ఆదివారం కదా అని పిజ్జా ఆర్డర్‌ చేస్తే..

Bengaluru techie orders pizza, loses Rs 95000 - Sakshi

పిజ్జా ఆర్డర్‌ చేస్తే.. రూ. 95 వేలు మాయంచేసిన కేటుగాళ్లు

నకిలీ లింక్‌ల పట్ల అప్రమత్తంగా వుండాలంటున్న పోలీసులు

సాక్షి, బెంగళూరు: ఆన్‌లైన్‌ పుడ్‌ డెలివరీ యాప్‌ ద్వారా పిజ్జా ఆర్డర్‌ చేసిన టెకీకి చుక్కలు కనిపించిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదివారం కదా అని..పిజ్జా తిందామని ఆశపడి ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఓ ఐటీ ఉద్యోగి ఏకంగా రూ.95వేలు పోగొట్టుకున్నాడు.  రెండు బ్యాంక్ అకౌంట్ల నుంచి అక్రమార్కులు ఈ  మొత్తాన్ని కొట్టేశారు.

వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని కోరమంగళ 1వ బ్లాక్‌లో నివాసం ఉండే ఐటీ ఉద్యోగి షేక్ డిసెంబర్ 1వ తేదీన మధ్యాహ్నం ఓ ఫుడ్ డెలివరీ యాప్‌లో పిజ్జా ఆర్డర్ చేశాడు. అయితే ఎంత సేపటికీ పిజ్జా రాకపోవడంతో ఆ యాప్‌కు చెందిన కస్టమర్ కేర్ నంబర్‌కు ఫోన్ చేశాడు. అంతే అదే ఆయన చేసిన తప్పయిపోయింది.  ఫోన్‌ లిఫ్ట్‌ చేసిన అవతలి వైపు తాము పిజ్జాలను ఆన్‌లైన్‌లో డెలివరీ చేయడం లేదని, కావాలంటే ఆ మొత్తాన్ని రీఫండ్ చేస్తామని  నమ్మబలికాడు. ఇందుకు ఒక లింక్‌ను కూడా షేర్‌   చేశాడు.  సదరు లింక్‌ను ఓపెన్ చేసి ఫోన్‌పే, బ్యాంక్ ఖాతా వివరాలను నమోదు  చేయమని చెప్పాడు.  ఆ మోసగాడి వలలో పడిన  షేక్  తూ.చ తప్పకుండా అతడు చెప్పినట్టే చేశారు.  సరిగ్గా ఈ అదనుకోసం చూస్తున్న కేటుగాళ్లు  షేక్‌కు చెందిన హెచ్‌డీఎఫ్‌సీ ఖాతా నుంచి రూ.45వేలు, ఆంధ్రా బ్యాంక్ నుంచి రూ.50వేలు మొత్తం రూ.95వేలను కాజేశారు. దీంతో మోసపోయానని గ్రహించిన షేక్ స్థానిక మడివాలా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  అంతేకాదు ఇలాంటి కేసులు తమ వద్దకు చాలా వస్తున్నాయనీ,  నకిలీలింక్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని మడివాలా పోలీసులు సూచించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top