చంపేస్తున్నారు

Assassinated Cases Rising in Nizamabad - Sakshi

ఆస్తి కోసం హత్యలు

అయిన వారే హంతకులు

జిల్లాలో ఏడు నెలల్లో 15 హత్యలు

రక్త సంబంధాలు పలుచన అవుతున్నాయి. బంధాలకన్నా ఆస్తులే ముఖ్యమని భావిస్తున్న కొందరు.. తోడబుట్టినవారిని కడతేర్చడానికీ వెనకాడడం లేదు. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది.

సాక్షి, కామారెడ్డి: అయినవారే కానివారిలా మారిపోయి ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. క్షణికావేశంలో హత్యలకు పాల్పడుతున్నారు. హత్యలతో ఒకరు కాటికిపోతే మరొకరు కటకటాల వెనక్కి వెళ్లాల్సి వస్తోంది. జిల్లాలో ఇటీవలి కాలంలో హత్యలు పెరిగిపోయాయి. దాదాపు అన్నింటిలోనూ అయినవారే హంతకులని తేలుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఏడు నెలల కాలంలో 15 హత్యలు జరిగాయి. కొన్ని చోట్ల హతమార్చి నేరుగా పోలీసులకు లొంగిపోతున్నారు. మరికొందరు తప్పించుకున్నా ఏదో ఒక ఆధారంతో దొరికిపోతున్నారు. చాలా సంఘటనల్లో అన్నదమ్ముల్లో ఎవరో ఒకరు కాటికి చేరుతున్నారు. హత్యలతో ఒకరు కాటికి పోతుండగా, మరొకరు కటకటాల వెనక్కు వెళుతున్నారు. 

భూ వివాదాల్లోనే హత్యలు...
ఎక్కడ హత్య జరిగినా భూ వివాదాలు కారణంగా కనిపిస్తున్నాయి. మారుమూల గ్రామాలకూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం విస్తరించిన తరువాత భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో అన్నదమ్ముల మధ్యనే కాకుండా తండ్రీకొడుకుల మధ్య కూడా భూ వివాదాలు పెరిగాయి. గెట్టు పంచాయతీ హత్యలకూ దారితీస్తోంది. చంపాలని కాకున్నా క్షణికావేశంలో దాడి చేయడం మూలంగా ప్రాణాలు పోతున్నాయి. దీంతో దాడి చేసిన వ్యక్తి హంతకుడిగా జైలుపాలు కావలసి వస్తోంది. 

ఇటీవలి ఘటనలు..
ఈనెల 15న భిక్కనూరు మండలం తిప్పాపూర్‌ గ్రామంలో కూచనపల్లి రాజయ్యను ఆయన తమ్ముడు హతమార్చాడు. భూ వివాదమే హత్యకు దారితీసింది.  
ఈ నెల 19న మాచారెడ్డి మండల కేంద్రంలో తమ్ముడిపై అన్న పారతో దాడి చేయగా.. అతడు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ హత్యకూ భూ వివాదమే కారణం. 

శిక్షలు పడుతున్నా..
హత్య కేసుల్లో నిందితులకు శిక్షలు పడుతున్నాయి. అయితే క్షణికావేశంలో దాడి చేసి చావులకు కారణమైన వారికి శిక్షలు విధిస్తున్నప్పటికీ హత్యలు ఆగడం లేదు. హత్యకు గురైన వారి కుటుంబంతో పాటు హంతకుడి కుటుంబం కూడా రోడ్డున పడుతోంది. ఒకే ఇంట్లో రెండు  రకాల పరిస్థితులు తలెత్తుతున్నాయి. దీంతో సమాజంలో ఆ కుటుంబాలు  ఇబ్బంది  పడాల్సి వస్తోంది.  ఏడాది  కాలంలో జిల్లాలో ఐదు హత్య కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు విధించారు. క్షణికావేశంలో చేసిన నేరానికి   జీవితాన్ని  నాశనం  చేసుకోవలసి వస్తోంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top