తుమ్మపూడిలో వ్యక్తి దారుణ హత్య

Alcohol Murder in Guntur - Sakshi

 మద్యం మత్తులో బీరు సీసాతో గొంతులో పొడిచిన యువకుడు

పోలీసుల అదుపులో నిందితుడు

హత్య ఘటనతో కలవరపాటుకు గురైన గ్రామస్తులు

వైన్‌ షాపును అక్కడి నుంచి తొలగించాలని మహిళల ఆందోళన

దుగ్గిరాల(మంగళగిరి): మద్యం మహమ్మారి ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తుల మధ్య చెలరేగిన స్వల్ప వివాదం హత్యకు దారితీసిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామంలోని పద్మావతి వైన్స్‌లో చిలువూరు గ్రామానికి చెందిన కాబోతు పూర్ణశేఖర్‌(50) దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో ఉన్న అదే గ్రామానికి చెందిన యువకుడు సన్నెకంటి నరేష్‌ ఆలియాస్‌ చిన్నా విచక్షణారహితంగా చేతిలో ఉన్న బీరు బాటిల్‌తో దాడికి దిగటంతో బాధితుడు అక్కడికక్కడే ప్రాణం విడిచాడు. గ్రామంలో చోటుచేసుకున్న ఈ దారుణ సంఘటనతో గ్రామస్తులు కలవరపాటుకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే...చిలువూరు ఎస్సీకాలనీకి చెందిన కాబోతు పూర్ణశేఖర్‌(50) బ్యాండు మేళం వాయిద్యకారుడు. ఖాళీ సమయంలో వ్యవసాయ పనులు చేస్తుంటాడు. మద్యం అలవాటు ఉన్న పూర్ణశేఖర్‌ గ్రామంలోని పద్మావతి వైన్‌ షాపులో మద్యం తాగేందుకు వెళ్లాడు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న  సన్నెకంటి నరేష్‌ ఆలియాస్‌ చిన్నా అనే యువకుడితో వాగ్వాదం జరిగింది.

కొద్దిసేపటి తరువాత పూర్ణశేఖర్‌ మరోసారి మద్యం తాగేందుకు వైన్‌షాపునకు వెళ్లి వైన్స్‌ వెనుకభాగంలో నిలబడి ఉండగా అక్కడికి వచ్చిన నరేష్‌  ఏంటిరా....ఇందాక మాట్లాడుతున్నావు ఇప్పుడు చెప్పరా అంటూ గొడవకు దిగి, ఒక్కసారిగా పక్కనే ఉన్న ఖాళీ బీరు సీసా పగలగొట్టి దాడికి ప్రయత్నించాడు. దీంతో పక్కనే ఉన్న జ్యోతుల కిరణ్, నరేంద్ర, నెలమకంటి రాజశేఖర్‌తో పాటు పలువురు యువకులు అడ్డుకుని నరేష్‌ చేతిలో ఉన్న బీరు సీసాను లాక్కొని పక్కన పడేసి సర్దిచెప్పారు. మరోమారు ఆగ్రహించిన నరేష్‌ మరో బీరు సీసాను పగలగొట్టి ఒక్కసారిగా పూర్ణశేఖర్‌ గొంతుపై పొడిచాడు. అదే సమయంలో అక్కడ ఉన్న స్వీపర్‌ నెమలకంటి రంగమ్మ చూసి పెద్దగా కేకలు వేసింది. సమీపంలో ఉన్న యువకులు పరుగుపరుగున అక్కడికి రాగా, అప్పటికే పూర్ణశేఖర్‌ తీవ్ర రక్తస్రావమై దుస్తులు రక్తంతో తడిసిపోయి స్పృహ తప్పి పడిపోయాడు. అక్కడే ఉన్న అతని మేనల్లుడు కిరణ్‌ చేతిలో ఉన్న కండువాను గాయంపై కట్టాడు. పొడిచి అక్కడ నుంచి పారిపోతున్న నరేష్‌ను పలువురు యువకులు వెంబడించి పట్టుకుని దేహశుద్ధి చేశారు. 108కు సమాచారం అందించే సమయానికే పూర్ణశేఖర్‌ ప్రాణాలు విడిచాడు. సంఘటన గూర్చి తెలుసుకున్న దుగ్గిరాల ఎస్‌ఐ అనిల్‌కుమార్‌రెడ్డి, తెనాలి రూరల్‌ సీఐ యు.సుధాకరరావు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని రక్తపు మడుగులో ఉన్న పూర్ణశేఖర్‌ మృతదేహాన్ని పరిశీలించారు. హత్య జరిగిన తీరును గూర్చి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. పూర్ణశేఖర్‌ హత్య సమాచారం తెలిసి అక్కడికి వచ్చిన భార్య, ఇద్దరు కుమారులు కన్నీరు మున్నీరుగా విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. దుగ్గిరాల ఎస్‌ఐ అనిల్‌కుమార్‌రెడ్డి కేసు నమోదు చేయగా సీఐ సుధాకర్‌రావు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.

మా కాపురాలను నిలబెట్టండి సారూ...
తుమ్మపూడి పద్మావతి వైన్స్‌ వద్ద హత్య జరిగిన విషయం తెలుసుకున్న మహిళలు పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకుని ఆందోళనకు దిగారు. ‘‘రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు మావి. మద్యం మహమ్మారితో మా కుటుంబాలు ఛిద్రం అవుతున్నాయి. మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. విచ్చలవిడి మద్యం విక్రయాలతో మా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. వైన్స్‌ను ఇక్కడి నుంచి తొలగించి మా కాపురాలను నిలబెట్టండయ్యా’’ అంటూ... సుమారు వంద మంది మహిళలు  సీఐ సుధాకర్‌రావు ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. రెండు గ్రామాలకు మధ్యలో మెయిన్‌రోడ్డు వెంబడే మద్యం దుకాణం ఏర్పాటు చేయడం వల్ల ఈ రోడ్డున మహిళలు రాకపోకలు సాగించాలంటే ఆ సౌకర్యానికి గురవుతున్నారని వాపోయారు. వేళాపాళా లేకుండా మద్యం విక్రయాలు నిర్వహిస్తున్నారంటూ మండిపడ్డారు. మద్యం దుకాణాన్ని ఇక్కడి నుంచి తొలగించాలని కొద్దిసేపు అక్కడే భీష్మించుకుని కూర్చున్నారు. మద్యం దుకాణం ఏర్పాటు వలన ఎదురవుతున్న పరిణామాలపై సంబంధిత అధికారులకు లిఖితపూర్వకంగా తెలియజేస్తామని సీఐ హామీ ఇచ్చారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top