బీజేపీ నేతల చేతిలో చావుదెబ్బలు.. జైలుకు!

AIMIM Corporator Sent To Jail Over Vajpayee Tribute Issue - Sakshi

ఔరంగాబాద్‌ : మాజీ ప్రధాని, బీజేపీ అగ్రనేత అటల్‌ బిహారీ వాజ్‌పేయి సంతాప తీర్మానాన్ని వ్యతిరేకించిన ఏఐఎంఐఎం కార్పొరేటర్‌ సయ్యద్‌ మటీన్‌ రషీద్‌ను ఏడాది పాటు జ్యుడీషియల్‌ కస్టడీకి తీసుకున్నారు. ఔరంగాబాద్‌ పోలీసులు ఓ సంవత్సరం కాలం మటీన్‌ను జైలులో విచారించనున్నారు. ఏఐఎంఐఎం కార్పొరేటర్‌పై మహారాష్ట్ర చట్టం ఎంపీడీఏ-1981 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 

కాగా, ఇటీవల వాజ్‌పేయి మరణానంతరం మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్ సమావేశంలో బీజేపీ కార్పొరేటర్‌ రాజు విద్యా సంతాప తీర్మాణాన్ని ప్రవేశపెట్టారు. ఆ తీర్మానాన్ని ఎంఐఎం సభ్యుడు సయ్యద్‌ మటీన్‌ వ్యతిరేకించారు. దీంతో రగిలిపోయిన బీజేపీ సభ్యులు ఆవేశంతో దాడికి దిగి సయ్యద్‌ను చితకబాదారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వారి నుంచి సయ్యద్‌ను కాపాడి, చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించిన విషయం విదితమే. మటీన్‌పై దాడి చేసిన వీడియోలు ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.  (‘వాజ్‌పేయికి నివాళి అర్పించను’.. రచ్చ రచ్చ!)

అయితే గతంలోనూ జాతీయ గీతాన్ని ఆలపించడానికి మటీన్‌ నిరాకరించాడని.. ప్రస్తుతం వాజ్‌పేయి సంతాప తీర్మానాన్ని వ్యతిరేకించారని బీజేపీ కార్పొరేటర్లు తెలిపారు. మటీన్‌ తన చర్యల ద్వారా హిందూ-ముస్లిం మతాల విద్వేషాలు రెచ్చగొట్టే యత్నం చేశారని బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగర పోలీసు కమిషనర్‌ ఆదేశాల మేరకు సిటీ చౌక్‌ పోలీసులు మటీన్‌ను అరెస్ట్‌ చేసి హర్సల్‌ జైలుకు తరలించారు. మతాల మధ్య విద్వేషం రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం, శాంతి భద్రతలకు భంగం వాటిల్లే పనులు చేస్తే ఎంపీడీఏ కింద ఎవరినైనా అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టాల్సి ఉంటుందని కమిషనర్‌ చిరంజీవ్‌ ప్రసాద్‌ వివరించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top