ఏసీబీ దాడుల కలకలం

ACB Rides In Jagtial - Sakshi

ఆరు నెలల్లో రెండు ఘటనలు

తాజాగా మత్య్సశాఖ అధికారులు

సాక్షి, జగిత్యాల: జిల్లాలో ఏసీబీ దాడులు కలకలం రేపాయి. ఆరు నెలల్లో ముగ్గురు అధికారులు ఏసీబీకి పట్టుబడడం చర్చనీయాంశమైంది. వరుస ఘటనలతో జిల్లా అధికారుల్లో కలవరం మొదలైంది. కార్యాలయాల్లోకి వచ్చే కొత్తగా వారిని నమ్మేందుకు జంకుతున్నారు. జూన్‌ 10న మెట్‌పల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో మేడిపల్లి వీఆర్వో గోపు బాపయ్య రైతు నుంచి రూ.3 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఆ ఘటన మరువక ముందే జిల్లా మత్స్యశాఖ అధికారి రాణాప్రతాప్, సీనియర్‌ అసిస్టెంట్‌ న్యూరొద్దీన్‌ రూ.60 వేల లంచం తీసుకుంటూ పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది.

50 సభ్యత్వాలు.. రూ.60 వేలు డిమాండ్‌ 
మత్స్య సహకారసంఘంలో అదనపు సభ్యత్వ నమోదు కోసం మెట్‌పల్లి మండలం జగ్గసాగర్‌కు చెందిన మత్స్యకార సంఘం సభ్యులు జిల్లా కేంద్రంలోని మత్స్యశాఖ కార్యాలయంలో సంప్రదించారు. కొత్తగా సభ్యులను చేర్చే విషయమై ఆ శాఖ అధికారులు 8 నెలలుగా వేధిస్తున్నారు. డబ్బులిస్తేనే సభ్యత్వ నమోదు చేస్తామని జిల్లా అధికారి రాణాప్రతాప్, సీనియర్‌ అసిస్టెంట్‌ న్యూరొద్దీన్‌ తేల్చి చెప్పారు. గ్రామశాఖ అధ్యక్షుడు ఏళ్ల రాజన్న పదిహేను రోజుల క్రితం ఇద్దరు అధికారులను కలిశాడు. జిల్లా అధికారికి రూ.40 వేలు, సీనియర్‌ అసిస్టెంట్‌కు రూ.20 వేల లంచం ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. ఇదే విషయాన్ని ఏసీబీ అధికారులకు తెలిపారు. గురువారం డబ్బులు తీసుకుంటుండగా సీనియర్‌ అసిస్టెంట్‌ న్యూరొద్దీన్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇద్దరు అధికారుల నుంచి వివరాలు సేకరించి, కరీంనగర్‌ ఏసీబీ డీఎస్పీ భద్రయ్య కేసు నమోదు చేశారు.

ఏసీబీ దాడులతో అధికారుల్లో ఆందోళన 
జగిత్యాల జిల్లా వ్యాప్తంగా మత్స్యశాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు జరుగుతున్నట్లు ప్రచారం జరగడంతో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. ఏసీబీ అధికారుల దాడులతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. జిల్లా మత్స్య శాఖ అధికారి ఏసీబీకి పట్టుబడిన సంఘటన సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది. మిగతా శాఖల ఉద్యోగులు అప్రమత్తమయ్యారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top