ఏసీబీ వలలో అవినీతి చేప 

ACB Arrests Govt Officer Kurnool - Sakshi

ఓర్వకల్లు:  ఏసీబీ వలలో ఓ అవినీతి చేప పడింది. సబ్సిడీ రుణాల మంజూరు కోసం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో పనిచేసే అధికారి లంచం డిమాండ్‌ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో వారు వలపన్ని అవినీతి అధికారిని రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ జయరామరాజు వివరాల మేరకు.. ఎన్‌ కొంతలపాడు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ పూలకంటి వెంకటస్వామి కొడుకు తిరుమలేష్‌ ఎస్సీ కార్పొరేషన్‌ రుణం కోసం మూడేళ్ల నుంచి దరఖాస్తు చేసుకుంటున్నా ఫలితం లేకపోయింది. గతేడాది మండల పరిషత్‌ కార్యాలయంలో పనిచేసే సీనియర్‌ అసిస్టెంట్‌ రజాక్‌ను సంప్రదించాడు.

మీ దరఖాస్తుకు ఆధార్‌ లింకప్‌ కావడంలేదని చెప్పి జాబితా నుంచి పేరు తొలగించాడు. ఈ ఏడాది తిరుమలేష్‌ తన భార్య సరస్వతి పేరుపై కిరాణాదుకాణం ఏర్పాటుకు రూ.2 లక్షల రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఎలాగైనా రుణం మంజూరయ్యేలా చూడాలని రజాక్‌ను కోరాడు. ఈక్రమంలో లంచానికి అలవాటు పడిన సీనియర్‌ అసిస్టెంట్‌ రూ.10 వేలు డిమాండ్‌ చేశాడు. బాధితుడు రాయలసీమ మాలమహానాడు అధ్యక్షులు మాదాసి నాగరాజుకు విషయం తెలియజేశాడు. అతడి సలహా మేరకు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. 

పట్టుబడిందిలా... 
బాధితుడి ఫిర్యాదు మేరకు కర్నూలు డీఎస్పీ జయరామరాజు, సీఐలు ఖాదర్‌బాషా, నాగభూషణం సిబ్బందితో కలిసి మంగళవారం మండల పరిషత్‌ కార్యాలయానికి చేరుకున్నారు. పథకం ప్రకారం బాధితుడు సీనియర్‌ అసిస్టెంట్‌కు రూ.10 వేల నగదు ఇస్తుండగా ఏసీబీ అధికారులు వెంటనే అతడిని అరెస్ట్‌ చేసి నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. నిందితుడిని బుధవారం కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top