డివై‘డర్‌’!

30 Percent Divider Accident in Hyderabad - Sakshi

నగరంలో దడపుట్టిస్తున్న డివైడర్లు

వీటితో అనేక చోట్ల రోడ్డు ప్రమాదాలు

నిర్మాణంలో శాస్త్రీయతలోపమే కారణం

కలకలం రేపిన జూబ్లీహిల్స్‌ యాక్సిడెంట్‌

సాక్షి, సిటీబ్యూరో: ట్రాఫిక్‌ చిక్కులు తగ్గించేందుకు... రైట్‌–లెఫ్ట్‌ రహదారుల్ని వేరు చేసేందుకు ఉద్దేశించిన డివైడర్లు ప్రస్తుతం నగర వాసులకు భయం పుట్టిస్తున్నాయి. వీటితో పాటు మధ్యలో ఏర్పాటు చేసిన సైన్‌బోర్డుల్లో కొన్ని ప్రమాదహేతువులుగా మారడంతో ఏటా అనేక మంది ప్రాణాలు కోల్పోవడంతోపాటు తీవ్రంగా గాయపడుతున్నారు. వీటి నిర్మాణంలో శాస్త్రీయత కొరవడటం, అవసరమైన కనీస జాగ్రత్తలు, ప్రమాణాలు సైతం పాటించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని నిపుణులు చెప్తున్నారు. బుధవారం ఉదయం జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.10లో 27 ఏళ్ళ వంశీకృష్ణ ఇలానే బలైపోవడం తీవ్రకలకలం రేపింది. ఈ డివైడర్‌ ప్రమాదాలకు గురవుతున్న వాటిలో ద్విచక్ర వాహనాలు, మృతులు, క్షతగాత్రుల్లో యువత ఎక్కువగా ఉండటం ఆందోళనకరంగా మారుతోంది.   

యాక్సిడెంట్స్‌లో 30 శాతం వాటా...
రాజధానిలోని మూడు కమిషనరేట్ల పరిధిలోని ప్రధాన రహదారులతో పాటు శివారు మార్గాల్లో ఉన్న డివైడర్లు ప్రాణాంతకంగా మారుతూ వాహనచోదకుల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. నగరంతో పాటు సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 30 శాతం వరకు డివైడర్ల కారణంగానే జరుగుతున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇవి కాంక్రీటుతో నిర్మితం కావడం, కొన్ని ప్రాంతాల్లో అవసరానికి మించి ఎత్తు, వెడల్పులతో ఉండటంతో ఢీ కొట్టిన వాహనం నుగ్గుకావడంతో పాటు చోదకుడు ప్రాణాలతో బయటపడే అవకాశం చాలా తక్కువగా ఉంటోంది. గడిచిన కొన్ని ఏళ్లుగా వీటి వల్ల జరుగుతున్న ప్రమాదాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ట్రాఫిక్‌ క్రమబద్దీకరణ కోసం కొన్నిచోట్ల హఠాత్తుగా ఏర్పాటు చేస్తున్న డివైడర్లు పగటిపూట వాహనచోదకుల కళ్లలో పడకుండా రాత్రిళ్లు ప్రాణాలను హరిస్తున్నాయి. 

ప్రమాదాలకు కారణాలు అనేకం...
డివైడర్లు డెత్‌స్పాట్స్‌గా మారడానికి అనేక కారణాలు ఉంటున్నాయి. రాత్రి వేళల్లో కనిపించక ఢీ కొట్టడం, కీలక ప్రాంతాల్లో అశాస్త్రీయంగా ఏర్పాటు చేసిన వాటి వద్ద వాహనం కంట్రోల్‌ తప్పి దూసుకుపోవడం జరుగుతోంది. సిటీలోని కొన్ని ఫ్లైఓవర్ల వద్ద తరచుగా ప్రమాదాలు నమోదు కావడానికి ఇవే కారణాలుగా మారుతున్నాయి. ఇక మితిమీరిన వేగంతో, మద్యం మత్తులో దూసుకుపోతున్న ‘నిషా’చరులు వీటిని పట్టించుకునే స్థితిలో ఉండట్లేదు. వాహనచోదకులు హెల్మెట్‌ ధరించకపోవడంతోనూ డివైడర్‌ ప్రమాదాలు పెరుగుతున్నాయి. వంశీకృష్ణ ప్రమాదం వెనుక ఓవర్‌ స్పీడింగ్, హెల్మెట్‌ ధరించకపోవడం కారణాలుగానే ట్రాఫిక్‌ పోలీసులు ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు. వాణిజ్య ప్రాంతాలు, కనెక్టివిటీ ప్రాంతాలగా పరిగణించే కోఠి, అబిడ్స్, నాంపల్లిలోని ప్రధాన రహదారులతో పాటు సర్వీస్‌ రోడ్లు, నెక్లెస్‌ రోడ్, ఎన్టీఆర్‌ మార్గ్‌లోని డివైడర్లు, లక్టీకపూల్, హిమాయత్‌నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కృష్ణనగర్, ఎస్సార్‌నగర్‌లతో పాటు మాదాపూర్, గచ్చిబౌలి, ఎల్బీనగర్‌ తదితర శివార్లలోని అనేక రహదారుల్లోని డివైడర్లు ప్రాణాంతకాలుగా మారుతున్నాయి.  

నిర్మాణంలో తేడానే కారణమా?
సాధారణంగా 100 అడుగుల కంటే ఎక్కువ వెడల్పు ఉన్న రోడ్ల మధ్యలోనే డివైడర్లు నిర్మించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుత అవసరాలు స్థానిక పరిస్థితుల దృష్ట్యా  ఇందులో సగం ఉన్న రహదారుల్లోనూ వీటిని ఏర్పాటు చేయాల్సి వస్తోంది. మరోపక్క గతంలో అనేక ప్రాంతాల్లో డివైడర్లు మాత్రమే ఉండేవి. వీటి మధ్యలో వర్షపు నీరు ఓ పక్క నుంచి మరో పక్కకు పోయే అవకాశం ఉండేది. అయితే అడ్వర్‌టైజ్‌మెంట్‌ బోర్డులు, లాలీపాప్స్‌ ఏర్పాటు చేయడం ద్వారా ఆదాయం ఆర్జించాలనే జీహెచ్‌ఎంసీ వైఖరి కారణంగా డివైడర్ల  స్థానంలో సెంట్రల్‌ మీడియమ్స్‌ వచ్చి చేరుతుండటంతో వీటి వల్ల ఇబ్బందులు పెరుగుతున్నాయి. ఫలానా ప్రాంతం ప్రమాదకరమైంది, ప్రమాద హేతువు అని వివరించేందుకు సదరు స్పాట్‌కు కొద్దిదూరంలో కాషనరీ సైన్‌ బోర్డులు ఏర్పాటు చేయాలి. ఆయా స్పాట్లకు రెండు వైపులా కనీసం 200 మీటర్ల దూరంలో తొలి బోర్డు (కాషన్‌–1), 100 మీటర్ల దగ్గర మరోటి (కాషన్‌–2) కచ్చితంగా ఉండాలి. అత్యంత ప్రమాదకరంగా మారిన డివైడర్ల వద్ద ఈ సైన్‌బోర్డులు అవసరమైన స్థాయిలో కనిపించట్లేదు. ఈ డెత్‌ స్పాట్స్‌ దగ్గర ఉన్న డివైడర్‌ను సక్రమంగా నిర్వహించాలి. ఆ ప్రాంతాలకు ఇరువైపులా కనీసం 400 మీటర్ల మేర అయినా నిర్ణీత ఎత్తులో దీన్ని నిర్మించాలి. దీనికి ఇరువైపులా హజార్డ్‌ మార్కర్స్‌ (ప్రమాద సూచికలు) ఏర్పాటు చేయాలి. చీకట్లోనూ వీటి ఉనికి వాహనచోదకులకు తెలిసేలా రిఫ్లెక్టివ్‌ మార్కర్స్‌ లేదా  సోలార్‌ మార్కర్స్‌ పెట్టాలని నిపుణులు చెప్తున్నారు.  

కలర్స్, క్యాట్‌ ఐస్‌ ఏర్పాటూ అంతంతే...
ప్రమాదహేతువులుగా ఉన్న ప్రాంతాల్లో డివైడర్‌తో పాటు రోడ్‌ మార్జిన్స్‌లోనూ పెయిటింగ్‌ వేయడం అవసరం. సాధారణ పెయింట్స్‌ కంటే రిఫ్లెక్టివ్‌ పెయింట్స్‌ వల్ల ఉపయోగాలు ఎక్కువగా ఉంటాయి. రాత్రి వేళ కూడా ఇవి స్పష్టంగా కనిపిస్తాయి. మార్జిన్స్‌తో పాటు ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లో రాత్రి పూట మెరిసే క్యాట్‌ ఐస్‌ ఏర్పాటు చేయాలి. ఇవి రాత్రి పూట వాహనచోదకుల దృష్టి ఆకర్షిస్తాయి. నగరంలో డివైడర్ల వద్ద వీటి ఏర్పాటు సైతం అంతంతగానే ఉంటోంది. డివైడర్‌ను పూర్తి శాస్త్రీయ పద్ధతిలో, ఇంజనీరింగ్‌ నిపుణుల సహకారంతో ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. కొత్తగా వెలిసిన డివైడర్ల వద్ద వాటి ఉనికి తెలిసేలా సూచికలు కచ్చితంగా ఉండాలని చెప్తున్నారు. రాత్రి వేళల్లో డివైడర్లను గుర్తించేందుకు వీలుగా రిఫ్లెక్టర్లు, క్యాట్‌ఐస్‌ వంటివి వెంటనే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు.   

ప్రాణం తీసిన మ్యాన్‌హోల్‌: ద్విచక్రవాహనంపైనుంచి పడి ఒకరి మృతి
జూబ్లీహిల్స్‌: ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి పడి యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. బోరబండకు చెందిన కుంచాల వంశీకృష్ణ(26) ఓ ఫైనాన్స్‌ కంపెనీ రికవరీ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం లింగంపల్లికి వెళ్లడానికి ద్విచక్రవాహనం   ( ఏపీ09 సీహెచ్‌ 7103 )పై బయలుదేరి జూబ్లీహిల్స్‌ రోడ్‌నెంబర్‌ 10లోని వాక్స్‌బేకర్స్‌ సమీపంలోకి రాగానే మ్యాన్‌హోల్‌ గుంతలో వాహనంపడి అదుపుతప్పి కిందపడిపోయాడు. తల డివైడర్‌కు ఢీకొని తీవ్రగాయాలపాలై అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఈ సంవత్సరం ‘డివైడర్‌ ప్రమాదాల్లో’ కొన్ని...
జనవరిలో మాదాపూర్‌ ఠాణా పరిధిలో ఐటీ మొబైల్‌–2 డివైడర్‌ను ఢీ కొట్టడంతో కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి.
అదే నెలలో బంజారాహిల్స్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని కేబీఆర్‌ పార్క్‌ వద్ద జరిగిన బైక్‌ ప్రమాదంలో ఒకరు మరణించగా మరొకరికి తీవ్రగాయాలు.
ఫిబ్రవరిలో సైబరాబాద్‌ కమిషనరేట్‌లోని రాయదుర్గం సబ్‌–స్టేషన్‌ వద్ద చోటు చేసుకున్న ద్విచక్ర వాహన ప్రమాదంలో ఇద్దరు మృతి.
మార్చిలో కేపీహెచ్‌బీ పోలీసుస్టేషన్‌ పరిధిలోకి వచ్చే క్లాస్‌రూమ్‌ కాంప్లెక్స్‌ వద్ద బైక్‌ ప్రమాదానికి గురై ఒకరు మృతి. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top