ఫేస్ బుక్ లో ఆయనకే ఫాలోవర్స్ ఎక్కువ! | Sakshi
Sakshi News home page

ఫేస్ బుక్ లో ఆయనకే ఫాలోవర్స్ ఎక్కువ!

Published Sat, May 27 2017 4:14 PM

ఫేస్ బుక్ లో ఆయనకే ఫాలోవర్స్ ఎక్కువ! - Sakshi

న్యూఢిల్లీ : సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ లో ఎక్కువగా ఫాలోఅయ్యే ప్రపంచ నాయకుల్లో దేశ ప్రధాని నరేంద్రమోదీ అగ్రస్థానంలో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను వెనక్కి నెట్టేసి మరీ 4.17 కోట్ల ఫాలోవర్స్ తో మోదీ మోస్ట్ ఫాలోడ్ వరల్డ్ లీడర్ గా అవతరించారు. ఫేస్ బుక్ నేడు విడుదల చేసిన రిపోర్టులో ఈ విషయం వెల్లడైంది. ఇటీవల అమెరికాకు ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ పేజీ కన్నా,  ప్రధాని నరేంద్రమోదీ అధికారిక ఫేస్ బుక్ పేజీకే ఎక్కువమంది ఫాలోవర్స్  ఉన్నట్టు తెలిసింది. 2014 ఎన్నికల్లో బీజేపీ ప్రచారం నిర్వహించినప్పటి నుంచి నరేంద్రమోదీకి బాగా పాపులారిటీ వచ్చింది. సోషల్ మీడియాలో ఆయన ఫాలోవర్స్ విపరీతంగా పెరుగుతూ వస్తున్నారు. మే 2014లో ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు 1.4 కోట్లు ఉన్న మోదీ ఫాలోవర్ల సంఖ్య ప్రస్తుతం 4.17 కోట్లకు చేరుకున్నట్టు ఫేస్‌బుక్ ఇండియా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ అంకి దాస్ ప్రకటించారు. 
 
పెద్దనోట్ల రద్దు వంటి హఠాత్తు, విప్లవాత్మక చర్యలను గత ఆరు నెలల కాలంలో ప్రధాని మోదీ ప్రకటించినప్పటికీ, ఆయన ఫాలోవర్స్ ఏమాత్రం తగ్గలేదని పేర్కొన్నారు.  ఆయనకు విపరీతంగా ఫాలోవర్స్ పెరుగుతూనే ఉన్నారని చెప్పారు. మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్వచ్ఛ్ భారత్ వంటి ప్రచారాలు ప్రభుత్వం తీసుకుంటున్న అత్యంత ముఖ్యమైన క్యాంపెయిన్లుగా ఈ డేటా పేర్కొంది. మోదీ హవాతో 2014 ఎన్నికల్లో విజయఢంకా మోగించిన బీజేపీ, నేషనల్ డెమొక్రాటిక్ అలయన్స్ తో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఇటీవలే మూడేళ్ల పాలనను విజయవంతంగా పూర్తిచేసుకుంది. కేంద్రమంత్రులు రాజనాథ్ సింగ్, స్మృతీ ఇరానీ, జనరవ్ వీకే సింగ్, పీయూష్ గోయల్, అరుణ్ జైట్లీలను కూడా ఎక్కువ మంది యూజర్లు అనుసరిస్తున్నారు. 
 

Advertisement
Advertisement