ద్రవ్యోల్బణానికి చమురు సెగ..

Wholesale Inflation Down South Surges on Higher Oil Prices - Sakshi

మే నెలలో టోకు ధరల ద్రవ్యోల్బణం 4.43 శాతం

14 నెలల గరిష్ట స్థాయి ఇది..

న్యూఢిల్లీ: టోకు ధరల ద్రవ్యోల్బణం (హోల్‌సేల్‌ ధరల ఆధారిత) మే నెలలో కట్టుతప్పింది. చమురు ధరల సెగకు ఏకంగా 4.43 శాతానికి పెరిగింది. ఇది 14 నెలల గరిష్ట స్థాయి. అంతకుముందు నెల ఏప్రిల్‌లో టోకు ద్రవ్యోల్బణం 3.18 శాతమే. గతేడాది మే నెలలో ఇది 2.26 శాతం. గతేడాది మార్చిలో హోల్‌సేల్‌ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 5.11 శాతంగా నమోదైన అనంతరం, మరోసారి గరిష్ట స్థాయికి చేరడం ఈ ఏడాది మే నెలలోనే.  

ఆహారోత్పత్తుల విభాగంలో ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 0.87 శాతంగా ఉంటే, మే నెలలో 1.60 శాతానికి చేరింది.  
 ఇంధనం, విద్యుత్‌ విభాగంలో 11.22 శాతం నమోదైంది. ఏప్రిల్‌లో 7.85 శాతంగానే ఉంది. చమురు ధరల పెరుగుదల ప్రభావం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది.  
 కూరగాయల ధరల పరంగా 2.51 శాతం నమోదైంది. ఆలుగడ్డల వరకే చూస్తే ద్రవ్యోల్బణం 81.93 శాతానికి పెరిగింది.
 పండ్ల విభాగంలో ద్రవ్యోల్బణం 15.40 శాతం.  
    పప్పు ధాన్యాల్లో డిఫ్లేషన్‌ చోటు చేసుకోవడం గమనార్హం. 21.13% డిఫ్లేషన్‌ నమోదైంది. ధరల పెరుగుదల ద్రవ్యోల్బణానికి దారితీస్తే, ధరల పతనం డిఫ్లేషన్‌కు కారణమవుతుంది. అంటే సాధారణ స్థాయి కంటే ధరలు పడిపోవడం.
 ఈ ఏడాది మార్చి నెలకు సంబంధించిన టోకు ద్రవ్యోల్బణం 2.47% నుంచి 2.74కు సవరించారు.
  ఏప్రిల్‌ నెలలో బ్యారెల్‌ చమురు 66 డాలర్లుగా ఉంటే, అదిప్పుడు 74 డాలర్ల స్థాయిలో ఉంది.  

చర్యలు తీసుకోవాలి: అసోచామ్‌
పెరుగుతున్న పెట్రోల్, డీజిల్‌ ధరలకు కళ్లెం వేయాలని అసోచామ్‌ ప్రభుత్వానికి సూచించింది. లేదంటే దిగుమతుల బిల్లు భారీగా పెరిగి కరెన్సీ మారకంపై ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి అదనంగా ముడి పదార్థాల ధరలపైనా ఇది ప్రభావం చూపిస్తుందని, ఇప్పటికే ఈ ప్రభావంతో లాభాలపై ఒత్తిడి మొదలైందని అసోచామ్‌ సెక్రటరీ జనరల్‌ డీఎస్‌ రావత్‌ అన్నారు.  

మరికాస్త పెరగొచ్చు:ఇక్రా
ఇక్రా ప్రధాన ఆర్థికవేత్త అదితి నాయర్‌ స్పందిస్తూ... అధిక ముడి పదార్థాల ధరలను వినియోగదారులకు బదిలీ చేయడం, బలహీన రూపాయి ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణంగా పేర్కొన్నారు. ‘‘టోకు ద్రవ్యోల్బణం మరో 0.80 శాతం మేర పెరగొచ్చు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఏ స్థాయిలో స్థిరపడతాయి, దేశీయంగా చమురు ధరలపై వాటి ప్రభావం, రుతుపవనాల తీరు, ఎంఎస్‌పీలో మార్పులు ద్రవ్యోల్బణాన్ని నిర్ణయిస్తాయి’’ అని అదితి నాయర్‌ వివరించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top