ఒక్కరోజులోనే భారీగా నష్టపోయిన ప్రపంచ కుబేరుడు

Wall Street Market Crash Jeff Bezos Lose Huge Amount - Sakshi

ముంబై :  అంతర్జాతీయ మార్కెట్లు ముఖ్యంగా అమెరికా మార్కెట్లు కుప్పకూలడంతో ప్రపంచవ్యాప్తంగా తొలి 500 మంది సంపన్నులు బుధవారం ఒక్క రోజులోనే భారీ మొత్తంలో సంపదను కోల్పోయారు. కేవలం ఒక్కరోజులోనే అక్షరాలా 7.3 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారు. వీరందరిలో అత్యధికంగా నష్ట పోయింది అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌. ఈయన ఒక్కరే ఈ రోజు ఏకంగా 9.1 బిలియన్‌ డాలర్ల సంపదను (మన కరెన్సీలో దాదాపు 67 వేల కోట్ల రూపాయలు) కోల్పోయారు.

ఈ ఏడాది బిలియనీర్ల సూచీలో వచ్చిన రెండో అతిపెద్ద కుదుపుగా దీనిని బ్లూమ్‌బెర్గ్‌ అభివర్ణించింది. వీరందరిలోకి బెజోస్‌ ఎక్కువగా నష్టపోయినట్లు పేర్కొంది. ఇక యూరప్‌కు చెందిన బిలియనీర్‌ బెర్నార్డ్‌ అర్నాల్ట్‌ సంపద రూ.33వేల కోట్లు ఆవిరైంది. ఆయన ఈ ఏడాదిలో పెంచుకున్న విలువలో సగం ఒక్కరోజులోనే కోల్పోయారు. ఇక బెర్క్‌షైర్‌ హత్‌వే అధినేత వారన్‌ బఫెట్‌ సంపద కూడా దాదాపు రూ.33 వేల కోట్లు తగ్గింది. మరో 67 మంది బిలియనీర్‌లు తమ సంపదలో దాదాపు రూ.2.3 లక్షల కోట్లను కోల్పోయారు.

అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు ముదురుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థ వృద్ధి అంచనాలను ఐఎంఎఫ్‌ కుదించింది. ఈ రెండు దేశాలూ వచ్చే ఏడాదిలో వాణిజ్య వివాద ప్రభావాలను చవి చూడాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది. దీంతో అమెరికా స్టాక్‌ మార్కెట్లు  భారీగా నష్టపోయిన నేపథ్యంలో ఈ కుబేరులంతా ఒక్క రోజులేనే తమ సంపదలో అధిక భాగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. దలాల్‌ స్ట్రీట్‌కు కూడా ఈ సెగ తాకడంతో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే తొలి 5 నిమిషాల్లో సుమారు రూ.4లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైపోయిన సంగతి తెలిసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top