విశాఖ పోర్టు లాభం రూ. 200 కోట్లు 

Vishakha port profit of Rs. 200 crores - Sakshi

ఏటా ఐదు శాతం వృద్ధి రేటు 

రూ. 3,700 కోట్లతో పోర్టు ఆధునికీకరణ 

రూ. 5 వేల కోట్లతో కాలుష్య నియంత్రణ చర్యలు 

విశాఖ పోర్టు ట్రస్ట్‌ చైర్మన్‌   ఎంటీ కృష్ణబాబు వెల్లడి 

సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం పోర్టు గడిచిన ఐదేళ్లలో ఆర్థిక, నైపుణ్యత, మౌలిక సదుపాయాలు తదితర అన్ని రంగాల్లోనూ గణనీయమైన అభివృద్ధిని సాధించిందని పోర్టు ట్రస్ట్‌ చైర్మన్‌ ఎంటీ కృష్ణబాబు వెల్లడించారు. ప్రతి ఏటా ఐదు శాతం వృద్ధి రేటు సాధించడమే కాకుండా దేశంలోనే శుభ్రమైన పోర్టుగా వరుసగా మూడేళ్లు జాతీయ స్థాయిలో రెండో స్థానంలో నిలిచిందన్నారు. గ్రీన్‌ ఇండస్ట్రీ, గ్రీన్‌ పోర్టు అవార్డులను కూడా సొంతం చేసుకుందని చెప్పారు. పోర్టు అభివృద్ధి కోసం తన హయాంలో చేపట్టిన కార్యక్రమాలను కృష్ణబాబు శుక్రవారం విశాఖలో మీడియాకు వివరించారు. 2017–18లో 63.54 మిలియన్‌ టన్నుల మేర ఎగుమతులు, దిగుమతులు జరిగితే 2018–19లో 65.3 మిలియన్‌ టన్నులకు పెరిగాయని, తద్వారా రూ. 200 కోట్ల లాభాలను ఆర్జించి పోర్టు రికార్డు నెలకొల్పిందని తెలిపారు.

రూ. 300 కోట్ల ఖర్చుతో పోర్టు ఛానల్‌ లోతును 11 మీటర్ల నుంచి 14.5 మీటర్లకు పెంచామని, దీనివల్ల లక్ష టన్నులకు మించిన నౌకలు కూడా ఇన్నర్‌ హార్బర్లలోకి వచ్చే వెసులుబాటు కలిగిందని చెప్పారు. 85 ఏళ్ల కిందట ఏర్పడిన పోర్టును ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా ఆధునికీకరిస్తున్నామని, ఇందుకోసం విశాఖ పోర్టు ట్రస్ట్‌ రూ. 1,200 కోట్లు ఖర్చు చేస్తే, ప్రైవేటు సెక్టార్‌ నుంచి రూ. 2,500 కోట్లు పెట్టుబడులు పెట్టారన్నారు. విలాసవంతమైన భారీ క్రూయిజ్‌ల నిర్మాణం కోసం రూ. 77 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. పోర్టు కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు కాన్వెంట్‌ కూడలి నుంచి సీ హార్స్‌ జంక్షన్‌ వరకు 7.5 మీటర్ల ఎత్తులో రక్షణ గోడ నిర్మించామని వివరించారు. కాలుష్య నియంత్రణ కోసం గడిచిన 8 ఏళ్లలో రూ. 5 వేల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. సాగరమాల ప్రాజెక్టు కింద పోర్టు రోడ్డును నాలుగు వరుసలకు విస్తరించడంతో పాటు షీలానగర్‌ నుంచి సబ్బవరం వరకు కొత్తగా నిర్మిస్తున్న జాతీయ రహదారికి అనుసంధానమయ్యేలా పనులు జరుగుతున్నాయన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top