విజయా బ్యాంక్‌ లాభం 20% అప్‌ | Vijaya Bank net profit up 20%; shares rise marginally | Sakshi
Sakshi News home page

విజయా బ్యాంక్‌ లాభం 20% అప్‌

Oct 27 2017 12:24 AM | Updated on Oct 27 2017 12:24 AM

Vijaya Bank net profit up 20%; shares rise marginally

న్యూఢిల్లీ: విజయా బ్యాంక్‌ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 20 శాతం పెరిగింది. అంతే కాకుండా మొండి బకాయిలు తగ్గి రుణ నాణ్యత మెరుగుపడింది. అయితే మొత్తం ఆదాయం స్వల్పంగా తగ్గగా, కేటాయింపులు మాత్రం పెరిగాయి. గత క్యూ2లో రూ.155 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.185 కోట్లకు పెరిగిందని విజయా బ్యాంక్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.3,517 కోట్ల నుంచి రూ.3,501 కోట్లకు పడిపోయింది.

మొత్తం వ్యయాలు రూ.2,946 కోట్ల నుంచి 6 శాతం తగ్గి రూ.2,767 కోట్లకు చేరుకున్నాయి. స్థూల మొండి బకాయిలు రూ.6,812 కోట్ల నుంచి రూ.6,649 కోట్లకు, నికర మొండి బకాయిలు రూ.4,784 కోట్ల నుంచి రూ.4,473 కోట్లకు తగ్గాయని బ్యాంకు తెలియజేసింది. శాతాల పరంగా చూస్తే,  స్థూల మొండి బకాయిలు 7.07 శాతం నుంచి 7.06 శాతానికి, నికర మొండి బకాయిలు 5.1 శాతం నుంచి 4.86 శాతానికి తగ్గాయి.

నికర వడ్డీ ఆదాయం రూ.828 కోట్ల నుంచి 22 శాతం వృద్ధితో రూ.1,008 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ మార్జిన్‌ 2.93 శాతం నుంచి 3.04 శాతానికి పెరిగిందని, కేటాయింపులు కూడా పెరిగాయని బ్యాంకు వివరించింది. గతేడాది క్యూ2లో రూ.390 కోట్లుగా ఉన్న కేటాయింపులు ఈ క్యూ2లో రూ.458 కోట్లకు ఎగిశాయి. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో విజయా బ్యాంక్‌ షేర్‌ గురువారం తీవ్రమైన ఒడిదుడుకులకు గురైంది. బుధవారం రూ.66 వద్ద ముగిసిన ఈ షేర్‌ గురువారం రూ.62, రూ.70 కనిష్ట, గరిష్ట స్థాయిల మధ్య కదలాడింది. చివరకు 4 శాతం లాభంతో రూ.63 వద్ద ముగిసింది.

Advertisement
 
Advertisement
Advertisement