
వాషింగ్టన్ : ప్రముఖ కార్ల సంస్థ ఫోర్డ్ మోటార్‌కు అమెరికాలో చుక్కెదురైంది. లోపభూయిష్టమైన ఎయిర్‌బ్యాగ్‌తో ఉన్న మూడు మిలియన్ల వాహనాలకు అదనపు పరీక్ష నిర్వహించడానికి, రీకాల్ ప్రక్రియను ఆలస్యం చేస్తామంటూ ఫోర్డ్ మోటార్ వేసిన పిటిషన్‌ను అమెరికా జాతీయ రహదారి ట్రాఫిక్ భద్రతా నిర్వహణ తిరస్కరించింది. టకాటా ఎయిర్‌బ్యాగ్ లోపంతో ఫోర్డ్ మోటార్ ఈ రీకాల్ ప్రక్రియను చేపడుతోంది. కార్లు, ట్రక్కుల్లో ఉన్న అధిక శక్తితో టకాటా ఎయిర్‌బ్యాగ్ ఇన్‌ఫ్లేటర్లు పేలిపోతున్నాయని విచారణలో వెల్లడైంది. ఈ పేలుళ్లతో ప్రపంచవ్యాప్తంగా 18 మరణాలు సంభవించగా.. 180 మంది గాయాలు పాలయ్యారు. టకాటా కార్పొరేషన్‌కు చెందిన ఎయిర్‌బ్యాగ్‌ల్లో లోపాల వల్ల ఈ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
టకాటా ఎయిర్‌బ్యాగ్‌లను వాడుతున్న కార్ల సంస్థల్లో సుమారు 19 కార్ల సంస్థలు రీకాల్ ప్రక్రియను చేపట్టాయి. అదేవిధంగా మాజ్డా మోటార్ కంపెనీ వేసిన ఇదే పిటిషన్‌ను కూడా ఎన్‌హెచ్‌టీఎస్‌ఏ తిరస్కరించింది. ఫోర్డ్, మాజ్డా ఫిర్యాదులపై ఎన్‌హెచ్‌టీఎస్‌ఏ తీసుకున్న నిర్ణయంపై ప్రజలు డిసెంబర్ 18 వరకు స్పందించవచ్చని మాజ్డా తెలిపింది. ఏజెన్సీ నిర్ణయంపై ఇంకా ఫోర్డ్ మోటార్ స్పందించలేదు. ఎయిర్‌బ్యాగ్స్‌లో లోపాల వల్ల నిస్సాన్ కూడా 5 లక్షలకు పైగా వాహనాలను రీకాల్ చేస్తోంది. మొత్తంగా ఆటో కంపెనీలు 2019 వరకు 125 మిలియన్ వాహనాలను రీకాల్ చేసే అవకాశముందని టకాటా తెలిపింది.