ఎన్‌బీఎఫ్‌సీలకు కేంద్రం ఊరట

Union Cabinet approves Rs 3 lakh crore credit guarantee scheme for MSME sector - Sakshi

పాక్షిక రుణ హామీ నిబంధనల సడలింపు

రూ. 30వేల కోట్ల పథకానికి కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం

న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌యేతర ఫైనాన్స్‌ (ఎన్‌బీఎఫ్‌సీ), గృహ రుణ సంస్థలు (హెచ్‌ఎఫ్‌సీ), సూక్ష్మ రుణ సంస్థలకు ఊరటనిచ్చేలా కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుంది. మరిన్ని సంస్థలు పాక్షిక రుణ హామీ పథకం (పీసీజీఎస్‌) పరిధిలోకి వచ్చేలా నిబంధనలు సడలించడంతో పాటు కాల వ్యవధిని జూన్‌ 30 దాకా పొడిగించింది. దీని కాలపరిమితి వాస్తవానికి మార్చి 31తో తీరిపోయింది. సవరించిన పీసీజీఎస్‌ ప్రకారం ఏఏ కన్నా తక్కువ రేటింగ్‌ ఉన్న ఎన్‌బీఎఫ్‌సీ, ఎంఎఫ్‌ఐ, హెచ్‌ఎఫ్‌సీ బాండ్లను కొనుగోలు చేసే ప్రభుత్వ రంగ బ్యాంకులకు నష్టం వాటిల్లితే.. అందులో సుమారు 20 శాతం దాకా భర్తీ అయ్యేలా ప్రభుత్వం పూచీకత్తునిస్తుంది.

మరోవైపు, కరోనా వైరస్‌ సంక్షోభాన్ని అధిగమించే దిశగా రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీలో భాగంగా ఎన్‌బీఎఫ్‌సీ, హెచ్‌ఎఫ్‌సీలకు ప్రకటించిన రూ. 30,000 కోట్ల ప్రత్యేక లిక్విడిటీ పథకానికి కేంద్ర క్యాబినెట్‌ ఆమోదముద్ర వేసింది. 2018 సెప్టెంబర్‌లో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ కంపెనీల డిఫాల్ట్‌తో మొదలుపెట్టి ఆ తర్వాత చోటుచేసుకున్న అనేక పరిణామాలతో ఎన్‌బీఎఫ్‌సీలు నిధులు దొరక్క సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

మరోవైపు, సూక్ష్మ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సంస్థలకు తోడ్పాటు అందించేందుకు రూ. 10,000 కోట్లతో కొత్త పథకానికి కూడా క్యాబినెట్‌ ఆమోదముద్ర వేసింది. దీనితో 2,00,000 యూనిట్లకు రుణ ఆధారిత సబ్సిడీని అందించనున్నట్లు కేంద్రం తెలిపింది. 2024–25 దాకా అయిదేళ్లు ఈ స్కీము అమలవుతుంది. ఆదాయంలో ప్రభుత్వానికి వాటాలిచ్చే ప్రాతిపదికన వాణిజ్య కార్యకలాపాల కోసం బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియ విధానానికి క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ఆదాయంలో ప్రభుత్వానికి ఎంత వాటా ఇస్తారన్న అంశం ఆధారంగా కంపెనీలు బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. నాలుగు శాతం వాటా కనీస స్థాయిగా ఉంటుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top