భారీగా ఉద్యోగ ఆఫర్లు: టీసీఎస్‌

TCS Hands Out 24000 Job Offers - Sakshi

బెంగళూరు : ఐటీ ఇండస్ట్రీలో ఓ వైపు నియామకాలు తగ్గిపోతూ ఉండగా... టెక్‌ దిగ్గజం టీసీఎస్‌ మాత్రం భారీగా ప్రెష్‌ గ్రాడ్యుయేట్లను తన కంపెనీలో చేర్చుకుంటోంది. ప్రెష్‌ గ్రాడ్యుయేట్లకు ఈ ఏడాది 20 వేల ఉద్యోగ ఆఫర్లు ఇచ్చామని, నాన్‌-ప్రెషర్లకు మరో 4000 జాబ్‌ ఆఫర్లు అందించామని టాప్‌ ఎగ్జిక్యూటివ్‌ చెప్పారు. ఈ ఆఫర్లు అందుకున్న వారిలో 70 శాతం మంది కంపెనీలో చేరతారని అంచనావేస్తున్నామన్నారు. ఇంతకుముందు కూడా ఇదే ట్రెండ్‌ కొనసాగిందన్నారు.

జనవరి-ఫిబ్రవరి కాలంలో ఆఫ్‌-క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ను నిర్వహించినట్టు టీసీఎస్‌ గ్లోబల్‌ హ్యుమన్‌ రిసోర్సస్‌ అధినేత, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అజోయేంద్ర ముఖర్జీ చెప్పారు. గతేడాది కూడా ఇన్నే ఆఫర్‌ లెటర్లను ఫ్రెషర్లకు ఇచ్చామని తెలిపారు. అయితే 2015లో కంపెనీ 40వేల ఆఫర్‌ లెటర్లను అందించింది. ఆ తర్వాత ఏడాది ఈ సంఖ్య 35 వేలకు పడిపోయింది. ఆటోమేషన్‌ కారణంతో ప్రస్తుతం ఐటీ రంగంలో నియామకాలు పడిపోతున్నప్పటికీ, ఈ ఆటోమేషనే కొత్త ఉద్యోగవకాశాలను కల్పిస్తుందని ముఖర్జీ చెప్పారు. కంపెనీలో ఉన్న ప్రస్తుత ఉద్యోగులకు కూడా భారీ ఎత్తున్న రీస్కిలింగ్‌ డ్రైవ్‌ చేపట్టామని, దీంతో కంపెనీ అవసరాల బట్టి జాబ్‌ రోల్స్‌ను కూడా మార్చుకునే అవకాశముందన్నారు.

టీసీఎస్‌ ఇప్పటికే 3,95,000 మంది ఉద్యోగుల్లో 2,10,000 మంది ఉద్యోగులకు శిక్షణ ఇచ్చింది. ఈ రీస్కిలింగ్‌ డ్రైవ్‌, కంపెనీ మార్జిన్లపై ఎలాంటి ప్రభావం చూపదని ముఖర్జీ చెప్పారు. గత కొన్నేళ్లుగా రీస్కిలింగ్‌ ప్రొగ్రామ్స్‌ చేపట్టడానికి తమ దగ్గర అవసరమైనంత పెట్టుబడులు ఉన్నాయని, బయట నుంచి తీసుకోవడం కంటే రీస్కిలింగ్‌ చేపట్టడమే మంచిదని తెలిపారు. డాలర్‌-రూపాయి మారకం విలువలో నెలకొన్న అనిశ్చితితోనే తమ ఆపరేటింగ్‌ మార్జిన్లు పడిపోయినట్టు ముఖర్జీ చెప్పారు.  
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top