ఖాయిలా పీఎస్‌యూలకు చికిత్స | Sakshi
Sakshi News home page

ఖాయిలా పీఎస్‌యూలకు చికిత్స

Published Sat, Sep 13 2014 12:51 AM

ఖాయిలా పీఎస్‌యూలకు చికిత్స - Sakshi

న్యూఢిల్లీ: తీవ్ర నష్టాల్లో కూరుకుపోయి ఖాయిలా పడిన ప్రభుత్వ రంగ(పీఎస్‌యూ) కంపెనీలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చికిత్స మొదలుపెట్టింది. మహారత్న, నవరత్న దిగ్గజాలతో పాటు ఇతర పీఎస్‌యూల వద్ద భారీ మొత్తంలో ఉన్న మిగులు నిధులను పునరుద్ధరణ కోసం ఉపయోగించనున్నట్లు భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థల శాఖ మంత్రి అనంత్ గీతే చెప్పారు.

 శుక్రవారమిక్కడ జరిగిన భారత వాహన తయారీదారుల సంఘం(సియామ్) వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనను అధ్యయనం చేసేందుకు ఎన్‌టీపీసీ చైర్మన్ అరూప్ రాయ్ నేతృత్వంలో ఒక కమిటీని నియమించామని.. రెండు నెలల్లో కమిటీ నివేదిక సమర్పించనుందని కూడా గీతే పేర్కొన్నారు. నగదు నిల్వలు పుష్కలంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ(సీపీఎస్‌ఈ)లు ప్రారంభ(సీడ్) ఈక్విటీ నిధులను సమకూర్చడం ద్వారా ఒక జాయింట్ వెంచర్(జేవీ)ను ఏర్పాటు చేయడం.. తద్వారా నష్టజాతక పీఎస్‌యూల నిర్వహణ, పునరుద్ధరణకు గల అవకాశాలను కమిటీ పరిశీలించనుంది.

 ‘మహారత్న, నవరత్న హోదా ఉన్న సీపీఎస్‌ఈలకు చెందిన రూ.2 లక్షల కోట్ల మేర మిగులు నిధులు బ్యాంకుల్లో నిరుపయోగంగా ఉన్నట్లు అంచనా. ఈ కంపెనీలన్నింటికీ సమాన ఈక్విటీ వాటా ఉండేవిధంగా ఒక జేవీ ఏర్పాటు ప్రతిపాదనను మేం రూపొందించాం. దీనిద్వారా ఇప్పుడున్న 70 ఖాయిలా పీఎస్‌యూల్లో 43 కంపెనీలను పునరుద్ధరించేందుకు వీలవుతుంది’ అని గీతే వివరించారు. ఏ ఖాయిలా కంపెనీని పునరుద్ధరించాలనేది కొత్తగా నెలకొల్పే జేవీ సమీక్షించి, నిర్ణయించనుందని.. దీనికి సంబంధించి పూర్తి భాధ్యతను జేవీకే ఇవ్వాలనేది తమ ప్రతిపాదనగా ఆయన పేర్కొన్నారు. ఈ మొత్తం నిధుల కల్పన ప్రక్రియను అత్యంత పారదర్శకంగా చేపట్టనున్నామని కూడా గీతే తెలిపారు.

 ఎలక్ట్రిక్ బస్సులపై త్వరలో నిర్ణయం...
 కాగా, నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్(ఎన్‌ఈఎంఎంపీ)ను అమలు చేసే ప్రతిపాదనపై నెల రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా బ్యాటరీతో నిడిచే ఎలక్ట్రిక్ వాహనాలను(బస్సులు) ప్రజా రవాణాకోసం వినియోగించాలనేది ఈ మిషన్ ప్రధానోద్దేశమని చెప్పారు. దేశంలోనే అత్యంత కాలుష్యభరితమైన నగరాల్లో ఢిల్లీ తొలి స్థానంలో ఉందని.. జాబితా నుంచి దీన్ని తొలగించడం కోసం ఈ నగరం నుంచే ఎన్‌ఈఎంఎంపీని ప్రారంభించనున్నట్లు గీతే పేర్కొన్నారు. 2020కల్లా 60-70 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యే అవకాశం ఉందని మిషన్ అంచనా వేస్తోంది.

Advertisement
Advertisement