యాంబీ వ్యాలీ వేలాన్ని అడ్డుకుంటే జైలుకే...

Supreme Court to hear Sahara-SEBI case today

సహారా గ్రూపునకు సుప్రీం హెచ్చరిక

న్యూఢిల్లీ: యాంబీ వ్యాలీ వేలానికి అడ్డు పడుతున్న సహారా గ్రూపును సుప్రీంకోర్టు గురువారం గట్టిగా హెచ్చరించింది. వేలానికి ఎవరు అడ్డంకులు కల్పించినా కోర్టు ధిక్కారం కింద పరిగణించి జైలుకు పంపుతామని కఠిన స్వరంతో స్పష్టం చేసింది. యాంబీ వ్యాలీ వద్ద శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందంటూ సహారా గ్రూపు పుణె పోలీసులకు లేఖ రాయడం ద్వారా వేలానికి ఆటంకాలు కల్పించిందని సెబీ తరఫు న్యాయవాది గురువారం విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

సెప్టెంబర్‌ 28న ఇందుకు సంబంధించి సహారా గ్రూపు రాసిన లేఖతో పోలీసులు యాంబీ వ్యాలీని తమ అధీనంలోకి తీసుకోవడంతో వేలంలో పాల్గొనేందుకు ఎవరూ ముందుకు రాలేదని, దాంతో అది నిలిచిపోయినట్టు తెలియజేశారు. దీన్ని జస్టిస్‌ దీపక్‌ మిశ్రా అధ్యక్షత వహించిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్రంగా పరిగణించింది.

యాంబీ వ్యాలీని అధికారిక లిక్విడేటర్‌(బాంబే హైకోర్టు)కు 48 గంటల్లోనే స్వాధీనం చేయాలని మహారాష్ట్ర డీజీపీని ఆదేశించింది. వేలానికి ఎవరు ఆటంకం కల్పించినా కోర్టు ధిక్కారం కింద జైలుకు పంపిస్తామని, 6 నెలల వరకు శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుందని ధర్మాసనం హెచ్చరించింది. వేలాన్ని నిర్వహించుకోవచ్చని సెబీకి స్పష్టం చేసింది.

చెల్లింపులు చేశాం...
సెబీ ఆరోపణలను సహారా తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి ఖండించారు. వేలంలో పాల్గొనకుండా సహారా గ్రూపు అడ్డుకోలేదని చెప్పారు. ‘‘కోర్టు ఆదేశాల మేరకు సెబీ ఖాతాలో ఇప్పటికే రూ.19,000 కోట్లు జమ చేశాం. సెబీ మాత్రం ఇన్వెస్టర్లకు రూ.60 కోట్లు మాత్రమే చెల్లించింది. సహారా భూములకు సంబంధించిన ఆస్తుల పత్రాలను కూడా స్వాధీనం చేశాం. వీటి విలువ రూ.20,000 కోట్లు ఉంటుంది. డిపాజిటర్లకు సహారా 95% వరకు తిరిగి చెల్లింపులు చేసింది’ అని సహారా గ్రూపు ఓ ప్రకటనలో పేర్కొంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top