బిజినెస్‌ జెట్‌.. రయ్‌ రయ్‌!!

Services to 200 airports - Sakshi

దేశంలో దూసుకెళ్తున్న బిజినెస్‌ ఏవియేషన్‌...

200 విమానాశ్రయాలకు సర్వీసులు

వసతులుంటే మరిన్ని కేంద్రాలకు...

విదేశాలకూ ప్రైవేట్‌ జెట్స్‌లో జర్నీ  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశీయ విమానయానంలో బిజినెస్‌ జెట్‌లు దూసుకెళ్తున్నాయి. ఒకప్పుడు బడా కార్పొరేట్లకే పరిమితమైన ప్రైవేటు విమానాలు... ఇప్పుడు చిన్న వ్యాపారవేత్తలకూ అందుబాటులోకి వచ్చేశాయి. దీంతో నాన్‌– షెడ్యూల్డ్, ప్రైవేట్‌ ఆపరేటర్ల హవా నడుస్తోంది. బిజినెస్‌/జనరల్‌ ఏవియేషన్‌లో ఉన్న నాన్‌–షెడ్యూల్డ్, ప్రైవేట్‌ ఆపరేటర్లు ఏకంగా 200 ఎయిర్‌పోర్టుల్లో అడుగుపెట్టడం వీటి జోరుకు నిదర్శనం. ప్రధానంగా వ్యాపారవేత్తల కారణంగానే ఈ స్థాయిలో కొత్త కొత్త ఎయిర్‌స్ట్రిప్స్‌లో చిన్న ఫ్లయిట్స్‌ ల్యాండ్‌ అవుతున్నాయి. వ్యాపారులు తమ అవసరాలకు విమానాలను అద్దెకు తీసుకోవడం లేదా సొంత విమానాల్లో ప్రయాణించడం గణనీయంగా పెరుగుతోందని బిజినెస్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ (బీఏఓఏ) చెబుతోంది. మౌలిక వసతులు మెరుగైతే దేశం లో ఉన్న 420 విమానాశ్రయాలు, హెలిపోర్టులు బిజీగా ఉం డటం ఖాయమని అసోసియేషన్‌ ధీమా వ్యక్తం చేస్తోంది.  

ఇవీ గణాంకాలు.. 
ప్రస్తుతం దేశంలో బిజినెస్‌/జనరల్‌ ఏవియేషన్‌ రంగంలో నాన్‌–షెడ్యూల్డ్‌ ఆపరేటర్లు 120, ప్రైవేటు ఆపరేటర్లు 60 మంది ఉన్నారు. వీరి వద్ద 275 హెలికాప్టర్లు, 125 బిజినెస్‌ జెట్లు, 100 దాకా టర్బో ప్రాప్‌ ఎయిర్‌క్రాఫ్టులు ఉన్నాయి. 2018లో మరో 20 విమానాలు కొత్తగా అడుగు పెట్టనున్నాయి.  పరిశ్రమ ఏటా 8 శాతం వృద్ధి చెందుతోందని బీఏఓఏ ప్రెసిడెంట్‌ రోహిత్‌ కపూర్‌ సాక్షి బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు. ఈ రంగం లగ్జరీ అన్న భావన నుంచి ప్రభుత్వం బయటకు వస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయని చెప్పారు. ‘విమానాలపై దిగుమతి సుంకం 3% వసూలు చేస్తున్నారు. నాన్‌ షెడ్యూల్డ్‌ ఆపరేటర్లకు  జీఎస్‌టీ 5 శాతంగా ఉంది. ప్రైవేటు వినియోగానికి కొనుగోలు చేస్తే 28 శాతం జీఎస్టీ, 3 శాతం సెస్‌ అమలవుతోంది. ఈ పన్నులు తగ్గితే మరింత మంది విమానాల కొనుగోలుకు ముందుకు వస్తారు’ అని పేర్కొన్నారు. కాగా, టికెట్లు విక్రయించి సర్వీసులు అందించే సంస్థలను షెడ్యూల్డ్‌ ఎయిర్‌లైన్స్‌ అంటారు. 

వ్యాపార విస్తరణకు..: అనుకూలమైన సమయంలో, కోరుకున్న విమానాశ్రయానికి వెళ్లే అవకాశంతోపాటు భద్రత, ప్రైవసీ ఉండటంతో వ్యాపారులు బిజినెస్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఆపరేటర్లను ఆశ్రయిస్తున్నారు. ప్రధానంగా షెడ్యూల్డ్‌ ఎయిర్‌లైన్స్‌ దేశంలో కేవలం 75 విమానాశ్రయాలకే సర్వీసులు అందిస్తున్నాయి. నాన్‌–షెడ్యూల్డ్, ప్రైవేట్‌ ఆపరేటర్లు 200ల విమానాశ్రయాలకు సేవలను విస్తరించారు. బిజినెస్‌ వర్గాలకు తాము ప్రత్యక్షంగానే సాయపడుతున్నామని రోహిత్‌కపూర్‌ అన్నారు. ‘విదేశాల్లోనూ వ్యాపార అవకాశా లను భారతీయులు వెతుక్కుంటున్నారు. అనుకూల ప్రాం తాలకు వెళ్లేందుకు బిజినెస్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లపై ఆధారపడుతున్నారు. వ్యాపారులు భారత ఎకానమీకి వెన్నెముక’ అని చెప్పారు. ప్రైవేట్‌ జెట్స్‌లో ప్రయాణం చేస్తున్న నగరాల్లో హైదరాబాద్‌ నాల్గవ స్థానంలో ఉందని ‘జెట్‌ సెట్‌ గో’ ఫౌండర్‌ కనిక టేక్రివాల్‌ తెలిపారు. ఏడాదిన్నరలో టాప్‌–1 స్థానానికి భాగ్యనగరం చేరుతుందనేది ఆమె అంచనా.

అడ్డంకులు తొలగితే... 
దేశంలో ఉన్న 420 విమానాశ్రయాలు, హెలిపోర్టులు అన్నీ మౌలిక వసతుల పరంగా మెరుగైతే విమానయాన రంగం అనూహ్యంగా వృద్ధి చెందడం ఖాయం. న్యూయార్క్, పారిస్, సింగపూర్‌ మాదిరిగా భారత్‌లోని ప్రధాన నగరాల్లో బిజినెస్‌ ఎయిర్‌క్రాఫ్ట్స్‌ కోసం ప్రత్యేక రన్‌వే ఉండాలని పరిశ్రమ డిమాండ్‌ చేస్తోంది. ముంబై, ఢిల్లీ విమానాశ్రయాలు షెడ్యూల్డ్‌ ఆపరేటర్ల ఫ్లయిట్స్‌తో బిజీగా ఉంటున్నాయి. బిజినెస్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ల కోసం స్లాట్స్‌ పరిమితంగా ఉంటున్నాయి. దీనిని అధిగమించాలంటే ఇక్కడా ప్రత్యేక రన్‌వేలు ఉండాలని పరిశ్రమ కోరుతోంది. అన్ని జిల్లాల్లోనూ హెలిపోర్టులు ఏర్పాటు కావాలి. ఇదే జరిగితే కొత్త విమానాలు వస్తాయి. చార్జీలు తగ్గుతాయి. ఒక్కో విమానంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 60 మందికి ఉపాధి లభిస్తుందని బీఏఓఏ చెబుతోంది.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top