35,000 దిగువకు సెన్సెక్స్‌ 

Sensex closes 383 points down after 900-point swing - Sakshi

లాభాల స్వీకరణతో  మార్కెట్‌కు నష్టాలు  

మూడు రోజుల లాభాలకు బ్రేక్‌  

ఇంట్రాడేలో 878 పాయింట్ల రేంజ్‌లో కదలాడిన సెన్సెక్స్‌ 

383 పాయింట్లు పతనమై, 34,780 వద్ద ముగింపు  

132 పాయింట్ల నష్టంతో 10,453కు నిఫ్టీ

భారీ నష్టాల్లో ఎన్‌బీఎఫ్‌సీ షేర్లు 

స్టాక్‌ మార్కెట్‌ లాభాలు మూడు రోజుల ముచ్చటే అయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ తీవ్ర ఒడిదుడుకులకు గురికావడం, అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు మళ్లీ భగ్గుమనడం వంటి కారణాల వల్ల ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. దీంతో బుధవారం స్టాక్‌సూచీలు నష్టాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ మళ్లీ 35,000 పాయింట్ల దిగువకు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మళ్లీ 10,500 పాయింట్ల దిగువకు పతనమయ్యాయి. ఆరంభంలో 10,700 పాయింట్ల పైకి ఎగబాకిన నిఫ్టీ ఒక దశలో 10,450 పాయింట్ల దిగువకు ట్రేడ్‌ అయిందంటే మార్కెట్లో  ఏ స్థాయిలో ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయో అర్థం చేసుకోవచ్చు. చివరి గంటన్నరలో అమ్మకాలు వెల్లువెత్తాయి.  ఆర్థిక, రియల్టీ, ఆయిల్, గ్యాస్, వాహన, లోహ షేర్లలో అమ్మకాలు జరిగాయి. సెన్సెక్స్‌ 383 పాయింట్లు పతనమై 34,780 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 132 పాయింట్లు పతనమై 10,453 పాయింట్ల వద్ద ముగిశాయి. బ్యాంక్‌ నిఫ్టీ డెరివేటివ్స్‌ వీక్లీ ఎక్స్‌పైరీ కారణంగా బ్యాంక్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడి తీవ్రమైంది. 

మార్కెట్లో అప్రమత్తత... 
ఆరంభంలో లాభపడిన రూపాయి  ఆ తర్వాత తీవ్రమైన హెచ్చుతగ్గులకు గురైంది. మార్కెట్‌ ముగిసిన తర్వాత రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఆర్థిక ఫలితాలు వెలువడనుండటంతో ఇన్వెస్టర్లు ఆచి, తూచి వ్యవహరించారని విశ్లేషకులు పేర్కొన్నారు. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశ వివరాలు ఈ రాత్రికి వెల్లడి కానున్నాయి. రేట్ల పెంపునకు  సంబంధించి మరిన్ని సూచనలు ఈ సమావేశ వివరాలు అందిస్తాయనే అంచనాలతో ఆసియా, యూరప్‌ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి.  

880 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌... 
సెన్సెక్స్‌ లాభాల్లోనే అరంభమైంది. ఇన్ఫోసిస్‌ అంచనాలను మించిన ఫలితాలను వెల్లడించడంతో కొనుగోళ్ల జోరు పెరిగింది. ఇంట్రాడేలో 443 పాయింట్ల లాభంతో 35,605 పాయింట్ల వద్ద గరిష్ట స్థాయిని తాకింది. రూపాయి ఒడిదుడుకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల షేర్లు భారీగా నష్టపోవడం, ముడి చమురు ధరలు పెరగడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ చేశారు. దీంతో సెన్సెక్స్‌ 435 పాయింట్ల నష్టంతో 34,727 పాయింట్ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మొత్తం మీద రోజంతా 878 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌ కదలాడింది.  ఇక నిఫ్టీ  ఒక దశలో 125 పాయింట్లు పెరగ్గా, మరో దశలో 148 పాయింట్లు పతనమైంది. కాగా గత మూడు రోజుల్లో సెన్సెక్స్‌ 1,161 పాయింట్లు పెరిగింది. 

∙యస్‌ బ్యాంక్‌ 6.8 శాతం నష్టపోయి రూ. 232 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ షేర్లలో బాగా నష్టపోయిన షేర్‌ ఇదే. సీఈఓ పదవి నుంచి ఉద్వాసనకు గురికానున్న రాణా కపూర్‌కు 2014–15, 15–16 ఆర్థిక సంవత్సరాల్లో ఇచ్చిన బోనస్‌ను వెనక్కి తీసుకోవాలని, గత, ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాలకు ఎలాంటి బోనస్‌నూ ఇవ్వకూడదని డైరెక్టర్ల బోర్డ్‌ నిర్ణయించిందన్న వార్తల నేపథ్యంలో ఈ షేర్‌ పడిపోయింది.  
∙ఆర్థిక ఫలితాల వెల్లడి(మార్కెట్లు ముగిసిన తర్వాత) నేపథ్యంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ 1.2 శాతం నష్టంతో రూ.1,149 వద్ద ముగిసింది.  
∙ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ వర్గాల అంచనాలను మించడంతో ఇన్ఫోసిస్‌ షేర్‌ 1.1 శాతం లాభంతో రూ.705 వద్ద ముగిసింది.
∙లిక్విడిటీ సమస్యలు మళ్లీ తలెత్తడంతో నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌(ఎన్‌బీఎఫ్‌సీ) షేర్లు నష్టపోయాయి. ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్, దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్ప్, రెప్కో హోమ్‌ ఫైనాన్స్‌ షేర్లు 13 శాతం వరకూ పతనమయ్యాయి.  
∙తాజా మార్కెట్‌ పతనంతో 100కు పైగా షేర్లు తాజా ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. డీఎల్‌ఎఫ్, దిలిప్‌ బిల్డ్‌కాన్, ఫినోలెక్స్‌ ఇండస్ట్రీస్, జీఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్, జమ్మూ అండ్‌ కశ్మీర్‌ బ్యాంక్, క్వాలిటీ, రెప్కో హోమ్‌ ఫైనాన్స్‌ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.

వాహన షేర్లు డౌన్‌.... 
బీమా వ్యయాలు పెరగడం, ఎన్‌బీఎఫ్‌సీల లిక్విడిటీ సమస్యల కారణంగా ఈ పండుగ సీజన్‌లో అమ్మకాలు అంతంతమాత్రంగానే ఉండగలవన్న అంచనాల కారణంగా వాహన షేర్లు నష్టపోయాయి. మార్జిన్లపై ఒత్తిడి కారణంగా మారుతీ సుజుకీ టార్గెట్‌ ధరను అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థ, హెచ్‌ఎస్‌బీసీ 10 శాతం తగ్గించింది. దీంతో మారుతీ సుజుకీ  షేర్‌ 3.7 శాతం నష్టపోయి రూ.6,878 వద్ద ముగిసింది. నికర లాభం స్వల్పంగా తగ్గిన నేపథ్యంలో హీరో మోటోకార్ప్‌ షేర్‌ 2.8 శాతం నష్టంతో రూ. 2,815 వద్ద ముగిసింది.

నేడు మార్కెట్లకు సెలవు 
దసరా సందర్భంగా నేడు స్టాక్‌ మార్కెట్‌కు సెలవు. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ పనిచేయవు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top