ఎస్‌బీఐ చార్జీల బాదుడు.. | SBI to charge penalty for breach of minimum balance from April | Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐ చార్జీల బాదుడు..

Mar 6 2017 2:13 AM | Updated on Sep 5 2017 5:17 AM

ఎస్‌బీఐ చార్జీల బాదుడు..

ఎస్‌బీఐ చార్జీల బాదుడు..

ఎస్‌బీఐ ఖాతాదారులు ఇక మీదట కనీస నగదు నిల్వలు తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. లేదంటే చార్జీల మోత మోగుతుంది. ఏప్రిల్‌ 1 నుంచి కనీస బ్యాలన్స్‌ లేని ఖాతాలపై జరిమానా

ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి...
కనీస బ్యాలన్స్‌ లేకుంటే ఇకపై పెనాల్టీలు
నెలలో మూడు నగదు జమలే ఉచితం
ఆపై ప్రతీ లావాదేవీపై రూ.50 వడ్డింపు


న్యూఢిల్లీ: ఎస్‌బీఐ ఖాతాదారులు ఇక మీదట కనీస నగదు నిల్వలు తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. లేదంటే చార్జీల మోత మోగుతుంది. ఏప్రిల్‌ 1 నుంచి కనీస బ్యాలన్స్‌ లేని ఖాతాలపై జరిమానా విధించాలని ఎస్‌బీఐ నిర్ణయించింది. ఈ పద్ధతి గతంలోనూ ఉండేది. కాకపోతే ఐదేళ్ల నుంచి దీన్ని అమలు చేయడం లేదు. కొత్త ఖాతాదారులను రాబట్టుకునేందుకు వీలుగా నెలవారీ నగదు నిల్వల వైఫల్యంపై చార్జీలు విధించడాన్ని 2012లో నిలిపివేశామని, వాటిని ఏప్రిల్‌ 1 నుంచి తిరిగి ప్రవేశపెడుతున్నామని బ్యాంకు అధికారి ఒకరు తెలిపారు. వీటితోపాటు ఏటీఎం సహా పలు ఇతర సేవల చార్జీలను కూడా ఎస్‌బీఐ సవరించింది. నెలవారీ కనీస నగదు నిల్వ నిర్వహణలో విఫలమైతే సేవింగ్స్‌ ఖాతాదారులకు గరిష్టంగా రూ.100 పెనాల్టీ తోపాటు సేవా రుసుము విధింపు ఉంటుంది. కనిష్టంగా రూ.20+సేవా రుసుంను బ్యాంకు నిర్ణయించింది.

మూడు దాటితే బాదుడే
సేవింగ్స్‌ ఖాతాదారులు నెలలో మూడు సార్లు మాత్రమే తమ బ్యాంకు శాఖలో ఉచితంగా నగదు డిపాజిట్‌ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆపై ప్రతీ డిపాజిట్‌కు గాను రూ.50, దీనికి సేవా రుసుము కలిపి చెల్లించుకోవాలి. రూ.10,000 నెలవారీ సగటు నిల్వ (ఎంఏబీ) ఉండే సాధారణ కరెంటు ఖాతాదారులు బ్యాంకులో రోజుకు రూ.25,000 వరకు నగదును ఉచితంగా డిపాజిట్‌ చేసుకోవచ్చు. అంతకు మించి నగదు డిపాజిట్‌ చేయాలనుకుంటే ప్రతీ రూ.1,000పై 75పైసల చార్జీ+సేవా రుసుం విధింపు ఉంటుంది. అయితే, ఈ చార్జీ కూడా కనీసం రూ.50కి తక్కువ కాకుండా వసూలు చేస్తారు. మిగిలిన కరెంటు ఖాతాలపై చార్జీలు వేర్వేరుగా ఉన్నాయి. అయితే, బ్యాంకు శాఖలో నగదు ఉపసంహరణల విషయాన్ని బ్యాంకు ప్రస్తావించలేదు.

ఏటీఎం సేవలపై చార్జీలు
ఇక నుంచి నెలలో ఎస్‌బీఐ ఖాతాదారులు సొంత బ్యాంకు ఏటీఎంల నుంచి ఐదు సార్లు మాత్రమే ఉచితంగా నగదు ఉపసంహరించుకోగలరు. ఆపై సొంత బ్యాంకు ఏటీఎంల నుంచి జరిపే ప్రతీ లావాదేవీపై రూ.10 చార్జీ విధిస్తారు. అలాగే, నెలలో ఇతర బ్యాంకు ఏటీఎంల నుంచి మూడు సార్లు మాత్రమే నగదు ఉపసంహరణలు ఉచితం. ఆపై ప్రతీ లావాదేవీకి రూ.20 వడ్డన ఉంటుంది. ఒకవేళ ఖాతాలో కనీస నగదు నిల్వ రూ.25వేలు ఉంటే సొంత బ్యాంకు ఏటీఎంలలో జరిపే లావాదేవీలపై చార్జీలు ఉండవు. రూ.లక్ష బ్యాలన్స్‌ నిర్వహిస్తే ఇతర బ్యాంకుల ఏటీఎంలలోనూ లావాదేవీలు ఉచితం. ఏటీఎం మెషిన్లలో నగదు లేక లావాదేవీ తిరస్కరణకు గురైతే దానిపై కూడా రూ.20సేవా రుసుం విధించడం జరుగుతుంది.

ఇతర చార్జీలు
ఓ త్రైమాసిక కాలంలో కనీస నగదు నిల్వలు రూ.25 వేలలోపు నిర్వహించే ఖాతాదారులకు వారి డెబిట్‌ కార్డు లావాదేవీలపై ఎస్‌ఎంఎస్‌ అలర్ట్స్‌కు గాను బ్యాంకు రూ.15 చార్జీలు వసూలు చేస్తుంది. పీఐ/యూఎస్‌ఎస్‌డీ లావాదేవీల విలువ రూ.1,000 వరకు ఉంటే ఆ సేవలు ఉచితం. బ్యాంకులో లాకర్‌ తీసుకుని ఉంటే ఏడాదిలో 12 సార్లు మాత్రమే ఉచితంగా సందర్శించేందుకు అనుమతి. ఆపై లాకర్‌ను తెరిచిన ప్రతిసారీ రూ.100+సేవా రుసుం చెల్లించుకోవాల్సి ఉంటుంది. వీటికి అదనంగా వార్షిక నిర్వహణ చార్జీలు ఎలానూ చెల్లించుకోవాలి.

కరెంటు ఖాతాలపై చార్జీలు
కరెంటు ఖాతాల్లో పవర్‌ ప్యాక్‌ రకం ఖాతాలకు ఎంఏబీ రూ.5,00,000. సగటున నెలలో ఈ మొత్తం ఉండకపోతే జరిమానా రూ.2,500+సేవా రుసుం విధిస్తారు. పవర్‌ గెయిన్‌ ఖాతాలకు ఎంఏబీ 2,00,000. ఇది విఫలమైతే రూ.1,500+సేవారుసుం జరిమానా విధింపు ఉంటుంది. పవర్‌ జ్యోతి ఖాతాలకు ఎంఏబీ రూ.50,000. ఈ మొత్తం ఉంచకపోతే రూ.1,000+సేవారుసుం వసూలు చేస్తారు. మిగిలిన అన్ని కరెంటు ఖాతాలకు ఎంఏబీ రూ.10,000 కాగా, నిర్వహణలో విఫలమైతే నెలకు రూ.500+సేవా రుసుం చెల్లించుకోవాలి.

సేవింగ్స్‌ ఖాతాలపై జరిమానాలు
బేసిక్‌ సేవింగ్స్‌ బ్యాంకు స్మాల్, జన్‌ధన్‌ యోజన ఖాతాలు మినహా అన్ని సేవింగ్స్‌ ఖాతాలపై నెలవారీ కనీస నగదు నిల్వ (ఎంఏబీ) నిర్వహణలో విఫలమైతే చార్జీలు ఇలా ఉన్నాయి. జరిమానాలకు అదనంగా సేవా రుసుం కూడా ఉంటుంది.

ఖాతా మూసేయాలన్నా చార్జీయే
సేవింగ్స్‌ ఖాతాను ప్రారంభించిన తర్వాత 14 రోజుల నుంచి ఆరు నెలలలోపు మూసేయదలిస్తే రూ.500 చార్జీ, ఆరు నెలల నుంచి ఏడాది లోపు మూసేస్తే రూ.1,000 చార్జీ+సేవారుసుం వసూలు చేయనున్నట్టు ఎస్‌బీఐ ప్రకటించింది. కరెంటు ఖాతాలపై మూసివేత చార్జీ రూ.1,000గా ఉంటుంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement