ఉపాధి పెంచే పెట్టుబడులు రావాలి

Sakshi Interview With Isha Foundation founder Sadhguru Jaggi Vasudev

ఈశా ఫౌండేషన్‌ చీఫ్‌ సద్గురు జగ్గీ వాసుదేవ్‌ 

చైనాను వదిలి వెళ్లే కంపెనీలను ఆకర్షించే వ్యూహం ఉండాలి...

దానికి తగ్గ వాతావరణం, నిర్ణయాలు అవసరం

లేకుంటే పేదరికం ఎగబాకే ప్రమాదం

ఆర్థికంగా పురోగమించడంతో గడిచిన 20 ఏళ్లలో 24 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని... కరోనా వైరస్‌ కారణంగా ఎందరో పేదలు, వలస కార్మికులు మళ్లీ దారిద్య్ర రేఖ దిగువకు జారిపోయే ప్రమాదం కనిపిస్తోందని ఈశా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు, సద్గురు జగ్గీ వాసుదేవ్‌ హెచ్చరించారు. భారీగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఈ పరిస్థితిని నివారించే అవకాశం ఉందన్నారు. ‘‘కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రపంచదేశాలు తమ తయారీ వ్యవస్థల కోసం చైనా వెలుపలికి చూస్తున్నాయి. దీన్ని భారత్‌ అందిపుచ్చుకోవాలి’’ అని చెప్పారు. ‘సాక్షి’ బిజినెస్‌ ప్రతినిధితో ఆర్థికాంశాలపై ప్రత్యేకంగా మాట్లాడారాయన. ఆ వివరాలివీ...

► కోవిడ్‌తో తయారీ రంగంలో చైనా ఆధిపత్యానికి బ్రేకులు పడొచ్చనే అంచనాలున్నాయి. అలా బయటకు వచ్చే సంస్థలు ఇండియావైపు చూసే అవకాశం ఉందా?
కరోనా మహమ్మారితో మన ఆర్థికవ్యవస్థ కూడా బాగా దెబ్బతినేట్టు కనిపిస్తోంది. ఎందుకంటే 140 కోట్ల మంది జనాభా ఉన్నా... ఆ స్థాయి ఆర్థిక వ్యవస్థ మనకు లేదు. ధనికులు ఈ పరిస్థితిని తట్టుకోవచ్చు కానీ రోజు కూలీలు చాలామంది ఎంతో దుర్భర స్థితిని ఎదుర్కొంటారు. వచ్చే రెండేళ్లలో భారీ పెట్టుబడులు గానీ రాకపోతే పెద్ద ఎత్తున జనం దారిద్య్ర రేఖ దిగువకు జారిపోయే ప్రమాదముంది. చైనాపై ఇతర దేశాలకు నమ్మకం తగ్గుతోంది. అక్కడ భారీ పెట్టుబడులు పెట్టిన జపాన్‌... తమ కంపెనీలు చైనా నుంచి బయటకు వస్తే ప్రోత్సాహకాలిస్తోంది. ఇక అమెరికా ఇంతకన్నా ఎక్కువే చేయొచ్చు. అప్పుడు చైనాలో కార్యకలాపాలు సాగిస్తున్న విదేశీ కంపెనీలు తమ ఉత్పత్తిలో కొంతైనా ఇక్కడకు తరలిస్తే మనకు కలిసొస్తుంది. మన దేశానికి భౌగోళికంగా ఎన్నో అనుకూలతలున్నాయి. ఆయా దేశాలతో మనకు మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. కాకపోతే వాళ్ల పెట్టుబడులు ఇక్కడ సురక్షితమనే భావన కలిగించటం ముఖ్యం.

► చైనా వదిలి రావాలనుకుంటున్న కంపెనీలను ఆకర్షించడానికి కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు?
చైనాలో 300కు పైగా విదేశీ కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వాటిలో కొన్నయినా బయటికి వచ్చే ప్రయత్నాలు చేస్తాయి. అదే జరిగితే దాదాపు 150 వేల కోట్ల డాలర్ల పెట్టుబడులు తరలిపోతాయి. వాటిలో కొంతయినా వచ్చే రెండేళ్లలో ఇక్కడికి వస్తే ఉపాధి గురించి ఆందోళన ఉండదు. కాకపోతే దీనికోసం ప్రభుత్వం, పారిశ్రామిక సంస్థల నుంచి గట్టి ప్రయత్నాలు జరగాలి. అధికార పరమైన అడ్డంకులు లేకుండా, భూమి, విద్యుత్, ఇతర మౌలిక వసతులు కల్పించడంతో పాటు.. అన్ని రకాల ఆమోదాలను ఒకే వేదికపై అందించే ఏర్పాట్లుండాలి.

► రాష్ట్రాలు కూడా చర్యలు తీసుకోవాలంటారా?
రాష్ట్రాలు ఇలాంటి భారీ పెట్టుబడులు ఆకర్షించడానికి వీలుగా చట్టపరమైన మార్పులు తేవాలి. పరిశ్రమలన్నీ ఒకే చోట కాకుండా దేశవ్యాప్తంగా పలు జిల్లాల్లో విస్తరించాలి. దేశంలో వచ్చే పదేళ్లలో 20 కోట్ల మంది ప్రజలు గ్రామాల నుంచి పట్టణాలకు వలస వెళ్తారని కొన్ని అంచనాలు చెబుతున్నాయి. అదే జరిగితే నగరాల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడమే కష్టం. అందుకే వ్యాపారాలు నగరాల్లోనే కేంద్రీకృతం కాకూడదు. మన న్యాయవ్యవస్థలో జాప్యం ఎక్కువ కనుక భారీగా పెట్టుబడులు పెట్టేవారికి, వ్యాజ్యాల నుంచి కనీసం ఐదేళ్ల వరకైనా రక్షణ కల్పించాలి.  

► కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ సరైనదేనా? వలస కార్మికులు, పేదలకు ఇంకా ఏం చేయాలి?
రాజకీయ ఉద్యమాలతోనో, మిలిటరీ బలంతోనో దేశం అభివృద్ధి చెందదని అర్థం చేసుకోవాలి. వ్యాపారాభివృద్ధితోనే ఇది సాధ్యం. దురదృష్టవశాత్తు దేశంలో సోషలిస్టు భావాలున్న శక్తులు ఇంకా ఎన్నో ఉన్నాయి. ప్రభుత్వం పరిశ్రమలకు ఏ ఆర్థిక సాయం చేసినా... ‘ధనికులు మరింత ధనికులు అవుతున్నారు’ అంటూ వీళ్ళు మాట్లాడతారు. డబ్బులివ్వడం ద్వారా పేదవారిని దారిద్య్రం నుంచి బయటకు తీసుకురాలేం. సరైన పరిశ్రమలతోనే ఇది సాధ్యం. పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం కావాలి. అందరికీ గౌరవప్రదమైన జీవన భృతి దొరికేది అప్పుడే.

(సాక్షి, బిజినెస్‌ ప్రతినిధి)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top