రూ.1,000 కోట్ల వ్యాపార లక్ష్యం

Rs 1,000 crore business target - Sakshi

మూడేళ్లలో ‘స్టాండర్డ్‌’ టార్గెట్‌ ఇది

వాటర్‌ హీటర్ల విభాగంలోకి హావెల్స్‌ సంస్థ

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హావెల్స్‌ బ్రాండ్లలో ఒకటైన స్టాండర్డ్‌ తాజాగా వాటర్‌ హీటర్ల విభాగంలోకి అడుగుపెట్టింది. జో అండ్‌ జో ప్రైమ్, అమియో, అమేజర్, లిఫ్ట్‌ పేరిట 5 నూతన శ్రేణి ఎలక్ట్రిక్‌ వాటర్‌ హీటర్లతో పాటూ స్వీచ్‌లు, ఎంసీబీలనూ విపణిలోకి విడుదల చేసింది. ఈ సందర్భంగా గురువారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హావెల్స్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ అబ్ర బెనర్జీ మాట్లాడుతూ.. వీటిని రాజస్థాన్‌లోని నిమ్రానా ప్లాంట్‌లో అభివృద్ధి చేశామని.. త్వరలోనే ఐంటర్నెట్‌ ఆధారిత (ఐఓటీ) వాటర్‌ హీటర్లనూ విడుదల చేస్తామని చెప్పారు. లీటరు నుంచి 25 లీటర్ల సామర్థ్యం గల వీటి ధరలు రూ.3,500 నుంచి రూ.14 వేల వరకూ ఉన్నాయి. ‘‘ప్రస్తుతం స్టాండర్డ్‌ బ్రాండ్‌ కింద ఫ్యాన్లు, ఎంసీబీ, ఆర్‌సీసీబీలు, డిస్ట్రిబ్యూషన్‌ బోర్డులు, ఏసీబీలు, ఎంసీసీబీలు, స్విచ్‌లు, కేబుల్స్‌ ఉత్పత్తులున్నాయి. వచ్చే ఏడాది కాలంలో మరో 3–4 కొత్త విభాగాల్లోకి కూడా రానున్నాం’’ అని చెప్పారాయన. జో పేరిట కంపెనీ నూతన శ్రేణి స్విచ్‌లను కూడా విడుదల చేసింది. వీటి ప్రారంభ ధర రూ.38. దేశంలో స్విచ్‌ గేర్ల విపణి రూ.3 వేల కోట్లు. హావెల్స్‌ క్యాప్‌ట్రీ, స్టాండర్డ్‌ అనే మూడు బ్రాండ్ల కింద స్విచ్‌ గేర్లను విక్రయిస్తోంది. గత ఆర్ధిక సంవత్సరంలో స్విచ్‌ గేర్ల వ్యాపారంలో రూ.500 కోట్ల వ్యాపారాన్ని చేరుకుంది. ఆస్పిడా పేరిట నూతన శ్రేణి ఎంసీబీలనూ విడుదల చేసింది. వీటి ధరలు రూ.145 నుంచి ప్రారంభమవుతున్నాయి.

ఏపీ, తెలంగాణల్లో రూ.35 కోట్ల వ్యాపారం..
‘‘హావెల్స్‌ బ్రాండ్లలో స్టాండర్డ్‌ ప్రధానమైంది. గత ఆర్ధిక సంవత్సరంలో స్టాండర్డ్‌ రూ.400 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేసింది. వచ్చే 3 ఏళ్లలో రూ.1,000 కోట్ల వ్యాపారాన్ని లకి‡్ష్యంచాం. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాటా రూ.35 కోట్లుగా ఉంటుంది. దేశంలో స్టాండర్డ్‌కు 2,500 మంది డీలర్లు, 35 ఎక్స్‌క్లూజివ్‌ స్టోర్లున్నాయి. వీటిల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 125 డీలర్‌షిప్స్, 6 ఎక్స్‌క్లూజివ్‌ స్టోర్లున్నాయి. ఈ ఆర్ధిక సంవత్సరం చివరికల్లా ఎక్స్‌క్లూజివ్‌ స్టోర్ల సంఖ్యను 100కి పెంచుతాం’’ అని అబ్ర బెనర్జీ వివరించారు. కార్యక్రమంలో హైదరాబాద్‌ బ్రాంచ్‌ హెడ్‌ పంకజ్‌ కే వాస్సాల్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top