31 రుణ ఖాతాలపై ఫిర్యాదు | Received complaints about 31 loan accounts: ICICI Bank | Sakshi
Sakshi News home page

31 రుణ ఖాతాలపై ఫిర్యాదు

Jun 23 2018 12:31 AM | Updated on Jun 23 2018 12:31 AM

Received complaints about 31 loan accounts: ICICI Bank - Sakshi

న్యూఢిల్లీ: రుణ ఖాతాలపై ఓ వ్యక్తి నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరిపి మధ్యంతర నివేదికను నియంత్రణ సంస్థకు సమర్పించినట్టు ఐసీఐసీఐ బ్యాంకు స్టాక్‌ ఎక్సేంజ్‌లకు తెలిపింది. ఈ విషయంలో ఆడిట్‌ కమిటీ సూచనలకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్టు పేర్కొంది. ‘‘2018 మార్చిలో కొన్ని రుణ గ్రహీతల ఖాతాల విషయంలో అవకతవకలు జరిగాయని, ఫలితంగా ఆ ఖాతాల వర్గీకరణలో తప్పు చోటు చేసుకుందంటూ ఫిర్యాదు మా దృష్టికి వచ్చింది.

31 రుణ ఖాతాలను సదరు పిర్యాదుదారు ప్రస్తావించారు. ప్రజావేగు ఫిర్యాదుగా భావించి బ్యాంకు నిబంధనల మేరకు ఆడిట్‌ కమిటీకి నివేదించాం. విచారణకు సంబంధించి మధ్యంతర నివేదికను ఆడిట్‌ కమిటీ, స్టాట్యుటరీ ఆడిటర్లు పరిశీలించి 2017–18 ఖాతాల కోసం ఖరారు చేశారు. మధ్యంతర నివేదికలో గుర్తించిన అంశాలు 2017–18 ఆర్థిక ఖాతాలపై ఎటువంటి ప్రభావం చూపించలేదు.

ఇక ఫిర్యాదు అందడానికి ముందే ఈ రుణ బకాయిలను 2012 మార్చి 31 నుంచి 2017 మార్చి 31 మధ్యలో ఎన్‌పీఏలుగా వర్గీకరించి 50% నిధులు కేటాయింపు చేయడం జరిగింది. ఈ రుణాల మొత్తం 2018 మార్చి నాటికి రూ.6,082 కోట్లు’’అని ఐసీఐసీఐ బ్యాంకు తెలిపింది. వీడియోకాన్‌ గ్రూపునకు రుణాల జారీ వెనుక ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ, సీఈవో చందా కొచర్‌కు లబ్ధి చేకూరినట్టు ఆరోపణలు రావడంతో ఆమె దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిన విషయం తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement