యుక్త వయస్సు నుంచే ఇన్వెస్ట్‌మెంట్‌..

Profit With ELSS Investment - Sakshi

ఈఎల్‌ఎస్‌ఎస్‌తో రెండిందాల మేలు

ఇటు అధిక రాబడులు అటు పన్నుపరమైన ప్రయోజనాలు

రిటైర్మెంట్‌ తర్వాత చాలా మంది ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంటోందని నివేదికలు చెబుతున్నాయి. పొదుపు చేసిన డబ్బు తక్కువగా ఉండటం వల్ల.. యాభైలు, అరవైలలో ఉన్న వారు భారీగా వ్యయాలు తగ్గించుకోవడం... అప్పటిదాకా అలవాటుపడిన జీవన విధానాలను మార్చుకోవడం చేసుకోక తప్పడం లేదు. చేతిలో డబ్బు ఉన్నప్పుడు.. అనుభవించేంత తీరిక ఉండటం లేదు. తీరా తీరిక దొరికేసరికి చేతిలో డబ్బు ఉండటం లేదు. చాలా మంది తమ పిల్లలో లేదా బంధువుల మీదో ఆధారపడాల్సిన పరిస్థితుల్లోనే ఉంటున్నారు. ఇలాంటిది ఎదురు కాకూడదంటే.. సింపుల్‌ పరిష్కారం ఉంది. అదేంటంటే.. యుక్త వయస్సు నుంచే ఇన్వెస్ట్‌మెంట్‌ మొదలుపెట్టడం.

మరీ రక్షణాత్మక వైఖరి వద్దు..
సరైన పెట్టుబడి సాధనంలో ఇన్వెస్ట్‌ చేయడం అన్నింటికన్నా ముఖ్యం. రిస్కులు ఎదుర్కొనడానికి ఇష్టపడక మనలో చాలా మంది తక్కువ రిస్కు ఉండే ఫిక్సిడ్‌ డిపాజిట్లు, పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్స్‌ (పీపీఎఫ్‌)లలో ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. దీనివల్ల అధిక రాబడులు వచ్చే అవకాశాలను పోగొట్టుకోవడం అవుతుంది. రిస్కు ఉన్నా రిటైర్మెంట్‌ వంటి అవసరాల కోసం దీర్ఘకాలంలో అధిక రాబడులిచ్చే సాధనాలను ఎంచుకోవడం మంచిది. జీతం అనేది ఎలాగూ ఫిక్సిడ్‌ ఆదాయమే. కాబట్టి పొదుపు మొత్తాల్లో కొంత భాగాన్ని ఈక్విటీ మార్కెట్లలో ఇన్వెస్ట్‌ చేయడం శ్రేయస్కరం. ఉదాహరణకు 2018 మార్చి ఆఖరు నాటికి పదిహేనేళ్ల వ్యవధిలో పీపీఎఫ్‌ వార్షిక రాబడి 8.25 శాతంగా ఉంది. అదే నిఫ్టీ 500 టీఆర్‌ఐని తీసుకుంటే.. దాదాపు రెట్టింపు స్థాయిలో 15.46 శాతం స్థాయిలో రాబడులిచ్చింది. (ఐసీఆర్‌ఏ ఆన్‌లైన్‌–ఎంఎఫ్‌ఐ ఎక్స్‌ప్లోరర్‌ గణాంకాల ప్రకారం).

పన్ను ఆదా ప్రయోజనాలూ ఉంటాయి..
ఇన్వెస్ట్‌మెంట్స్‌తో పన్నుపరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వివిధ సాధనాల్లో చేసే ఇన్వెస్ట్‌మెంట్స్‌తో ఏటా రూ. 1.5 లక్ష దాకా పన్నుపరమైన మినహాయింపులు ఉంటున్నాయి. పీపీఎఫ్, నేషనల్‌ పెన్షన్స్‌ స్కీమ్, పోస్టాఫీస్‌ డిపాజిట్‌ 5 ఏళ్ల బ్యాంక్‌ డిపాజిట్, ఎల్‌ఐసీ, ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు (ఈఎల్‌ఎస్‌ఎస్‌), రాజీవ్‌ గాంధీ ఈక్విటీ సేవింగ్స్‌ స్కీమ్‌ (తొలిసారిగా మార్కెట్లో ఇన్వెస్ట్‌ చేసే వారికి) మొదలైన సాధనాలు అందుబాటులో ఉన్నాయి.  సాధారణంగా ఇవన్నీ కూడా పన్నుపరంగా దాదాపు ఒకే తరహా ప్రయోజనాలు ఇస్తాయి. మరి రిస్కులు, రాబడులను బేరీజు వేసుకుంటే.. వీటన్నింటిలో నుంచి దేన్ని ఎంచుకోవాలి. ఇదిగో.. ఇక్కడే ఈఎల్‌ఎస్‌ఎస్‌ పరిష్కారమార్గంగా ఉంటుంది.

ఈఎల్‌ఎస్‌ఎస్‌ వర్సెస్‌ మిగతా సాధనాలు..
ట్యాక్స్‌ సేవింగ్‌ సాధనాలతో రూ. 1.5 లక్షల దాకా పన్ను మినహాయింపు లభిస్తోంది (ఎన్‌పీఎస్‌ కాకుండా). ఇదే మొత్తాన్ని రెండు దశాబ్దాల పాటు ఇన్వెస్ట్‌ చేస్తే.. మొత్తం రూ. 30 లక్షలు పెట్టుబడి అయినట్లవుతుంది. ఈ మొత్తాన్ని పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్‌ చేసిన పక్షంలో 2018 ఆఖరు నాటికి సగటున 8.31 శాతం వార్షిక రాబడితో రూ. 75.47 లక్షలు అవుతుంది (1998 నుంచి ఉన్న వడ్డీ రేట్ల ప్రకారం). ఇది ఆకర్షణీయమైన మొత్తమే. అయితే, వడ్డీ రేట్లు తగ్గుతున్న నేపథ్యంలో భవిష్యత్‌లోనూ ఇదే ధోరణి కొనసాగుతుందనుకోవడానికి లేదు. ఇక ఏటా రూ.1.5 లక్షలను ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్స్‌ (నిఫ్టీ 500 టీఆర్‌ఐ రాబడుల ప్రకారం)లో ఇన్వెస్ట్‌ చేస్తే మీరు పెట్టిన రూ. 30 లక్షలు కాస్తా ఏకంగా రూ. 1.77 కోట్లు అవుతుంది. అంటే పీపీఎఫ్‌ పోర్ట్‌ఫోలియో విలువ కన్నా 2.4 రెట్లు అధికం. మరో మాటలో చెప్పాలంటే.. మీకు సగటున వార్షిక రాబడి దాదాపు 19.71 శాతం మేర వచ్చినట్లు లెక్క. ఈ 20 ఏళ్ల వ్యవధిలో స్టాక్‌ మార్కెట్లు రెండు సార్లు భారీగా పతనమైనప్పటికీ.. ఈ స్థాయి రాబడులు అందించడం గమనార్హం. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈఎల్‌ఎస్‌ఎస్‌లో ఇన్వెస్ట్‌ చేసి ఉంటే ఒకవైపు పన్ను పోటును తప్పించుకోవడంతో పాటు మరోవైపు కోటీశ్వరులే అయి ఉండేవారు. మిగతా మార్కెట్లతో పోలిస్తే దేశీ మార్కెట్స్‌ మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. చాలా మటుకు ఫండ్స్‌ దీర్ఘకాలంలో మెరుగ్గానే రాణిస్తున్నాయి. ఈ ఫండ్స్‌ ద్వారా వచ్చే రాబడులపై దీర్ఘకాలిక క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ గానీ, డివిడెండ్స్‌ మీద ట్యాక్స్‌ గానీ ఉండదు. మిగతా ట్యాక్స్‌ ఆదా చేసే సాధనాలతో పోలిస్తే ఈఎల్‌ఎస్‌ఎస్‌ లాకిన్‌ పీరియడ్‌ కూడా చాలా తక్కువగా మూడేళ్లే  ఉంటుంది.

ఇలా ఇన్వెస్ట్‌ చేయొచ్చు..
సరిగ్గా ఆర్థిక సంవత్సరం ఆఖర్లో పన్ను పోటును తగ్గించుకునే వ్యూహాలపై కసరత్తు చేయకుండా.. ముందు నుంచే కాస్త జాగ్రత్తపడితే మంచిది. ఆఖర్లో ఏకమొత్తంగా ఒకేసారి పెట్టడం కాకుండా.. ప్రతి నెలా కొంత కొంతగా ఇన్వెస్ట్‌ చేస్తూ వెళ్లొచ్చు. దీనివల్ల మూడు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. మొదటి దేంటంటే.. ఆఖరు నెలల్లో ఆర్థికపరమైన ఒత్తిళ్లు తగ్గించుకోవచ్చు. ఇక రెండోది.. దీనివల్ల ఆర్థిక క్రమశిక్షణ అలవాటవుతుంది. ముందుగా ఇన్వెస్ట్‌ చేసిన తర్వాత మిగిలినది మాత్రమే ఖర్చులకు ఉపయోగించుకోవడం అలవాటవుతుంది. చివరగా మూడో దాని సంగతికొస్తే.. ప్రతి నెలా ఇన్వెస్ట్‌ చేయడం వల్ల వేర్వేరు రేట్లకు ఫండ్‌ యూనిట్స్‌ కొనుగోలు చేయొచ్చు. మార్కెట్‌ తగ్గినప్పుడు ఎక్కువ యూనిట్లు లభిస్తాయి. ఈ రకంగా సగటు కొనుగోలు రేటును తగ్గించుకోవచ్చు. ఫలితంగా లాభాలు కూడా దానికి అనుగుణంగానే పెంచుకోవచ్చు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top