ఆధార్‌ లింక్‌ సంగతేంటి మరీ?

ఆధార్‌ లింక్‌ సంగతేంటి మరీ?

సాక్షి, ముంబై : ఆధార్‌ కార్డునే అన్నింటికీ ఆధారం చేస్తున్న క్రమంలో వ్యక్తిగత గోప్యతపై సుప్రీంకోర్టు గురువారం ఇచ్చిన తీర్పు చర్చనీయాంశంగా మారింది. బ్యాంకు ఖాతాలు, పాన్‌ కార్డులకు, మొబైల్‌ కంపెనీ సిమ్‌లకు ఆధార్‌ కార్డు లింక్‌పై సందిగ్ధత ఏర్పడింది. వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనని పేర్కొన్న సుప్రీంకోర్టు, ఆధార్‌పై అభ్యంతరాలను ప్రస్తావించలేదు. కానీ ఆధార్‌ విషయంలోనే ఈ వ్యక్తిగత గోప్యత అంశం తెరపైకి వచ్చింది. ఆధార్‌ కార్డు లింక్‌ విషయంపై విచారణ సమయంలో వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు కాదని కేంద్రం వాదించింది. దీంతో అసలు కేసు మొదలైంది. ఆధార్‌ విధానం వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘిస్తోందంటూ 2015లో సుప్రీంకోర్టును పిటిషనర్లు ఆశ్రయించారు. వీటిపై పలుమార్లు విచారించిన అత్యున్నత న్యాయస్థానం ప్రజా బాహుళ్యంలో గోప్యత వివరాలు దుర్వినియోగమయ్యే అవకాశాలున్నాయని ఆగస్టు 2న పేర్కొంది. కానీ నేడు వెలురించిన తీర్పులో మాత్రం ఆధార్‌ గురించి ప్రస్తావించకపోవడం సందిగ్థత పరిస్థితికి దారితీసింది. 

 

బ్యాంకు ఖాతాలు, ప్రభుత్వ పథకాలు వంటి వాటికి తప్పనిసరి చేస్తున్న ఆధార్‌ కార్డు వివరాలు, వ్యక్తిగత గోప్యత కిందకే వస్తాయని పలువురు న్యాయవాదులంటున్నారు. ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ నిబంధనలు తీసుకురావడం అప్రకటిత ఎమర్జెన్సీ కిందకే వస్తుందన్నారు. ఆధార్‌ అప్‌లోడ్‌తో అన్ని వివరాలు బహిర్గతమవుతాయని ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇప్పటికే దేశవ్యాప్తంగా 80 శాతం ఆధార్‌ కార్డు ప్రక్రియ పూర్తయింది. బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ కార్డును లింక్‌చేసే గడువు ఈ ఏడాది చివరి వరకు ఉండగా... ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్నులు ఫైల్‌ చేయాలంటే ఆధార్‌ నెంబర్‌ ఉండాలనే నిబంధన దాదాపు పూర్తయింది.

 

పాన్‌ కార్డులకు ఆధార్‌ను లింక్‌ చేసే ప్రక్రియను కూడా ప్రభుత్వం చేపట్టింది. ఇవన్నీ వ్యక్తిగత గోప్యత కిందకు వస్తాయా? వస్తే ప్రభుత్వం తప్పనిసరి చేస్తున్న ఆధార్‌ కార్డు వివరాలు మనం ఇవ్వకపోయినా పర్వాలేదా? అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. ఈ పీటముడిపై ఏర్పడిన సందిగ్థతను తొలగించేందుకు ఐదుగురు జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం గోప్యత అనే ప్రాథమిక హక్కును ఆధార్‌ కార్డు ఉల్లంఘిస్తుందా? అనే దానిపై తీర్పు చెప్పనుంది.

 
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top