సంస్కరణలకు ‘ఇంధనం’!

PM Narendra Modi sees scope for further reforms in energy sectormodimodi - Sakshi

చమురు దిగ్గజాలతో భేటీలో ప్రధాని మోదీ

పెట్రోలియం ఉత్పత్తులను కూడా  జీఎస్‌టీలో చేర్చాలన్న ప్రైవేట్‌ సంస్థలు

ఓన్‌జీసీ చమురు–గ్యాస్‌ క్షేత్రాల్లో తమకూ వాటాలివ్వాలని సూచన

న్యూఢిల్లీ: దేశీ ఇంధన రంగంలో మరిన్ని సంస్కరణలకు అవకాశముందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. చమురు, గ్యాస్‌ ఉత్పత్తిలో మరింతగా అధ్యయనాలు, నూతన ఆవిష్కరణలు జరగాలని ఆకాంక్షించారు. సోమవారం దేశ, విదేశ చమురు దిగ్గజ సంస్థల అధినేతలతో భేటీ అయిన సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. సుమారు మూడు గంటలసేపు సాగిన ఈ సమవేశంలో దేశీయంగా చమురు, గ్యాస్‌ ఉత్పత్తిని మరింతగా పెంచే దిశగా ప్రభుత్వ రంగ ఓఎన్‌జీసీ చేతిలో ఉన్న ముంబై హై వంటి క్షేత్రాల్లో తమకూ వాటాలు ఇప్పించాలని ప్రైవేట్‌ రంగ చమురు దిగ్గజాలు సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఉత్పత్తి నిర్దిష్ట స్థాయిని దాటితే బ్యారెల్‌కి ఇన్ని డాలర్ల చొప్పున ఫీజు చెల్లించేలా నిబంధనలు విధించవచ్చని వారు తెలిపినట్లు పేర్కొన్నాయి. నిక్షేపాలు ఉన్నాయో లేదో తెలియని క్షేత్రాల్లో ఇన్వెస్ట్‌ చేయడం రిస్కుతో కూడుకున్నదే తప్ప.. ఫలితాల కోసం దీర్ఘకాలం ఎదురుచూడాల్సి వస్తుందని సమావేశంలో చమురు సంస్థల అధినేతలు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఉత్పత్తి జరుగుతున్న క్షేత్రాల్లోనే అవుట్‌పుట్‌ మరింతగా పెంచేందుకు పెట్టుబడులు పెట్టడం, సాంకేతికంగా అనుభవమున్న సంస్థలను భాగస్వాములను చేయడం ద్వారా ముందుకెళ్లొచ్చని పేర్కొన్నారు.  

మరోవైపు, సమగ్ర ఇంధన విధానాన్ని రూపొందించాలన్న సూచనను మోదీ స్వాగతించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. విధానాలు, సంస్కరణల అమలు జరుగుతున్న తీరును పలువురు సీఈవోలు ప్రశంసించినట్లు వివరించాయి. చమురు, గ్యాస్‌ ఉత్పత్తి, రవాణా, పంపిణీ నెట్‌వర్క్‌ మొదలైన వాటిల్లో పెట్టుబడుల సమీకరణ కోసం ఉద్దేశించిన ఈ సమావేశంలో చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు, చమురు ఎగుమతి దేశాల కూటమి సెక్రటరి జనరల్‌ మొహమ్మద్‌ బర్కిందో,  రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ తదితరులు పాల్గొన్నారు.

రష్యన్‌ దిగ్గజం రాస్‌నెఫ్ట్‌ సీఈవో ఐగోర్‌ సెచిన్, సౌదీ ఆరామ్‌కో సీఈవో అమీన్‌ మొదలైన వారు ఈ భేటీకి ప్రత్యేకంగా రావడం గమనార్హం. ఏకీకృత ఇంధన విధానం, బయో ఇంధనాలకు ప్రోత్సాహం, గ్యాస్‌ సరఫరాను మెరుగుపర్చడం, గ్యాస్‌ హబ్‌ ఏర్పాటు, నియంత్రణపరమైన అంశాలు ఇందులో చర్చకు వచ్చినట్లు పేర్కొన్నాయి.  

జీఎస్‌టీలోకి పెట్రోలియం ఉత్పత్తులు..!
పెట్రోలియం ఉత్పత్తులను కూడా వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) పరిధిలోకి చేరిస్తే పోటీ మరింత పెరుగుతుందని దేశ, విదేశ చమురు సంస్థలు సూచించినట్లు నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ తెలిపారు. దీనిపై రాష్ట్రాలతో చర్చిస్తానని ప్రధాని భరోసా ఇచ్చినట్లు  వివరించారు.

అంతర్జాతీయ దిగ్గజాలు భారత్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నట్లు చెప్పారు.  వచ్చే దశాబ్దకాలంలో భారత చమురు, గ్యాస్‌ రంగంలో 300 బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పేర్కొన్నారు. దేశీయంగా గ్యాస్‌ ట్రేడింగ్‌ ఎక్సే్చంజ్‌ ఏర్పాటు యోచనలో ఉన్నట్లు తెలిపారు.

భారత్‌లో మెగా పెట్టుబడులు
రిఫైనరీలు, పెట్రోకెమికల్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తాం
సౌదీ ఆరామ్‌కో సీఈవో అమీన్‌ నాసర్‌

న్యూఢిల్లీ: భారత్‌లోని రిఫైనరీ, పెట్రోకెమికల్‌ ప్రాజెక్టుల్లో ఇన్వెస్ట్‌ చేసే అవకాశాలు పరిశీలిస్తున్నట్లు చమురు ఉత్పత్తుల్లో ప్రపంచంలోనే టాప్‌ సంస్థ సౌదీ ఆరామ్‌కో సీఈవో అమీన్‌ హెచ్‌ నాసర్‌ వెల్లడించారు. భారత్‌తో క్రయ,విక్రయాలకు సంబంధించి వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా విస్తరించుకోవడంపై దృష్టి సారించినట్లు ఆయన పేర్కొన్నారు.

రూ. 2.7 లక్షల కోట్లతో పశ్చిమ తీరప్రాంతంలో ప్రతిపాదిత రిఫైనరీ, ఇటీవలే పూర్తయిన ఓఎన్‌జీసీ పెట్రోకెమికల్‌ ప్రాజెక్టు మొదలైన వాటిలో ఇన్వెస్ట్‌ చేయడంపై ఆసక్తిగా ఉన్నట్లు ఇండియా ఎనర్జీ ఫోరం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా నాసర్‌ పేర్కొన్నారు. ‘భారీ మార్కెట్‌ గల భారత్‌లో వృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయి. కీలకమైన ఈ మార్కెట్లో అత్యంత భారీ పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాం.

భారత ఇంధన రంగంలో ముఖ్యంగా.. పునరుత్పాక, పెట్రోకెమికల్స్‌ మొదలైనవాటిపై దృష్టి సారిస్తున్నాం. త్వరలోనే మా బృందం ఇక్కడికి రానుంది‘ అని ఆయన చెప్పారు. చమురు సరఫరా నుంచి, రిఫైనింగ్, మార్కెటింగ్‌ దాకా అన్ని స్థాయుల కార్యకలాపాల్లోనూ తాము ఇన్వెస్ట్‌ చేయదల్చుకున్నట్లు పేర్కొన్నారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top