ఆర్థిక వ్యవస్థకు మోదీ టానిక్‌!

PM Modi reviews state of economy with Nirmala Sitharaman, FinMin officials - Sakshi

దేశ ఆర్థిక పరిస్థితిపై ప్రధాని సమీక్ష

మంత్రి నిర్మలా సీతారామన్, ఉన్నతాధికారులతో భేటీ

అన్ని అంశాలపై సమగ్ర చర్చ త్వరలో చర్యలకు అవకాశం

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక రంగ పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం సమగ్ర సమీక్ష నిర్వహించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన తర్వాత ప్రధాని నేరుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. మందగమన పరిస్థితులు ఒకదాని తర్వాత మరో రంగానికి వేగంగా విస్తరిస్తుండడం, ఉద్యోగాలు, సంపదకు విఘాతం కలుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని ఈ సమీక్ష నిర్వహించడం గమనార్హం. ఆర్థిక మందగమనానికి సహజ కారణాలు, దీర్ఘకాలిక ప్రభావాన్ని అంచనా వేయడానికే ఈ భేటీ జరిగినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. రంగాలవారీగా ఉద్దీపన చర్యలను ప్రభుత్వం ప్రకటించవచ్చన్న అంచనాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

దేశ జీడీపీ వృద్ధి 2018–19లో 6.8%కి తగ్గిపోగా, 2014–15 తర్వాత ఇదే అత్యంత కనిష్ట స్థాయి. వినియోగ విశ్వాసం క్షీణిస్తుండడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కుంగుదల వంటి అంశాలు ప్రభుత్వాన్ని సైతం ఆందోళనకరం. అంతర్జాతీయంగా అమెరికా–చైనా మధ్య ముదిరిన వాణిజ్య, కరెన్సీ యుద్ధం పరిస్థితులను మరింత ప్రతికూలంగా మారుస్తోంది. అయితే, ప్రభుత్వం నుంచి ఇతమిద్ధంగా ఈ చర్యలు ఉంటాయన్న స్పష్టత అయితే ఆర్థిక శాఖ ఇంత వరకు వ్యక్తపరచలేదు. గత 2 వారాల వ్యవధిలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బ్యాంకర్లు, వివిధ రంగాల పారిశ్రామిక వేత్తలతో సమావేశాలు నిర్వహించడంతోపాటు ఆర్థిక రంగ వృద్ధికి అవరోధంగా ఉన్న అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం నుంచి త్వరలోనే చర్యలు ఉంటాయని ఆ సందర్భంగా పారిశ్రామిక వేత్తలకు హామీ కూడా ఇచ్చారు. దీంతో ప్రభుత్వం ప్రకటించే చర్యల కోసం మార్కెట్లు, పారిశ్రామిక వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఆర్‌బీఐ సైతం తనవంతుగా రెపో రేట్లను కూడా మరోమారు తగ్గించింది.

ఆందోళన కలిగిస్తున్న పరిస్థితులు
► వాహన రంగం అయితే గత రెండు దశాబ్దాల కాలంగా అత్యంత దారుణ పరిస్థితులను చవిచూస్తోంది. వాహనాల అమ్మకాలు ప్రతీ నెలా భారీగా తగ్గిపోతున్నాయి.  

► కార్లు, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు 19 ఏళ్ల కనిష్టానికి పడిపోయాయి. ఇప్పటి వరకు 300 డీలర్‌షిప్‌లు మూతపడ్డాయని, 2.30 లక్షల వరకు ఉద్యోగాలు పోయాయని అంచనా. ఆటో పరిశ్రమలో 10 లక్షల ఉద్యోగాలపై ప్రభావం పడినట్టు వాహన కంపెనీల సంఘం ప్రకటించింది.

► రియల్టీ పరిస్థితీ ఆశాజనకంగా లేదు. అమ్ముడుపోని ఇళ్లు భారీగానే ఉన్నాయి.  

► ఎఫ్‌ఎంసీజీ కంపెనీల అమ్మకాల వృద్ధి సైతం గతంలో పోలిస్తే జూన్‌ త్రైమాసికంలో తగ్గింది. హిందుస్తాన్‌ యూనిలీవర్‌ జూన్‌ క్వార్టర్‌లో అమ్మకాల పరంగా కేవలం 5.5 శాతం పెరుగుదల నమోదు చేసింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో వృద్ధి 12 శాతంగా ఉంది. డాబర్‌ అమ్మకాల వృద్ధి సైతం 21 శాతం నుంచి 6 శాతానికి పరిమితం అయింది. బ్రిటానియా అమ్మకాల వృద్ధి 12% నుంచి 6 శాతానికి క్షీణించింది.  

► ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో బ్యాంకుల నుంచి పరిశ్రమలకు రుణాలు అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 0.9%నుంచి 6.6%కి పెరగడం కాస్త ఆశాజనకం. కానీ, అత్యధికంగా ఉపాధి కల్పించే ఎంఎస్‌ఎంఈ రంగానికి మాత్రం రుణాల పంపిణీ 0.7 శాతం నుంచి 0.6 శాతానికి తగ్గింది.  

► ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు కేవలం 1.4 శాతమే పెరగ్గా, జీఎస్టీ వసూళ్లు జూలై వరకు 9% పెరిగాయి. 18% వృద్ధి సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top