ప్రణాళికతోనే విద్యుత్ ఆదా! | Plans to save electricity! | Sakshi
Sakshi News home page

ప్రణాళికతోనే విద్యుత్ ఆదా!

May 2 2015 12:48 AM | Updated on Jul 29 2019 6:10 PM

ప్రణాళికతోనే విద్యుత్ ఆదా! - Sakshi

ప్రణాళికతోనే విద్యుత్ ఆదా!

అవసరమున్నా లేకపోయినా కరెంటుని ఇష్టానుసారం వినియోగించేవారిని మనం చూస్తూనే ఉంటాం.

సాక్షి, హైదరాబాద్: అవసరమున్నా లేకపోయినా కరెంటుని ఇష్టానుసారం వినియోగించేవారిని మనం చూస్తూనే ఉంటాం. కేవలం ఉద్యోగులే కాదు.. కొన్ని కొన్ని సంస్థల్లో యాజమాన్యాలు కూడా మిరుమిట్లు గొలిపే లైట్ సెట్టింగ్స్, కేఫ్‌టేరియాలు, పెద్ద వాటర్‌ట్యాంకులు, ఎంటర్‌టైన్‌మెంట్ విభాగాల కోసం విద్యుత్‌ను దుర్వినియోగం చేస్తుంటాయి. అనవసరంగా కరెంటుని ఖర్చు చేయడం వల్ల పర్యావరణానికి కూడా హాని కల్గుతుంది. ఎందుకంటే ఏసీలు, ఫ్రిజ్‌ల నుంచి పర్యావరణానికి హాని చేసే వాయువులు వెలువడుతాయి. రాబోయే కాలంలో ప్రపంచం ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో ఇంధనమే ముందు వరుసలో ఉంది. ఈ నేపథ్యంలో గ్రీన్ కాన్సెప్ట్‌తో ఆఫీస్ భవనాల నిర్మాణం చేస్తే అటు విద్యుత్ ఆదా అవుతుంది. ఇటు ఇంధన కొరతను అధిగమించవచ్చు మరి.
 
ఇవి పాటిస్తే సరి..
సహజ వెలుతురు ఉండేలా భవననిర్మాణం ఉంటే మంచిది. పాత బిల్డింగ్‌లను సైతం విద్యుత్ ఆదా అయ్యే పద్ధతుల్లో నవీకరించాలి. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు ఈ బాటలో ఇప్పటికే అడుగులు వేస్తున్నాయి. కాన్ఫరెన్స్ హాల్స్‌ల్లో, మీటింగ్స్ జరిగే చోట పనిలేనప్పుడు లైట్లను ఆపివేయాలి. తలుపులను, కిటికీలను బార్లా తెరిచి ఉంచితే గాలి, వెలుతురు బాగా రావడంతోపాటు, ఏసీ అవసరం కూడా తగ్గుతుంది. పనిపూర్తయిన వెంటనే కంప్యూటర్స్ అన్ని షట్‌డౌన్ అయ్యేలా చూడాలి.

అదే విధంగా కంప్యూటర్, ప్రింటర్, జిరాక్స్ దేనికదే ప్రత్యేక స్విచ్‌బోర్డ్‌ను కల్గి ఉంటే కరెంటు బిల్లు తక్కువకే పరిమితం అవుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఆఫీసులని నిర్మించేటప్పుడే ఆర్కిటెక్ట్‌లకు కరెంటు వినియోగం తక్కువగా ఉండేలా డిజైన్ చేయమని సూచించడం మేలు. గడ్డిని, కొన్ని రకాల మొక్కలను ఆఫీసు పైకప్పుపై పెంచడం ద్వారా చల్లదనంతోపాటు ఏసీ బిల్లుని తగ్గించుకోవచ్చు. అలాగే సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం మరింత మేలు.
 
వృథాను గుర్తించండి..
ఆఫీసులో ఏయే విభాగాల్లో ఎక్కడెక్కడ కరెంటు వృథా అవుతుందో తెలుసుకోండి. ఇందుకోసం ఒక అధికారిని లేదా బృందాన్ని నియమించండి. కరెంటు వినియోగాన్ని తగ్గించే క్రమంలో భాగంగా చేపట్టే ఎలాంటి చర్య ఎవ్వరినీ బాధపెట్టేలా ఉండకుండా జాగ్రత్త పడండి. ఏసీ నీకు అవసరమా? లాంటి ప్రశ్నలతో ఉద్యోగుల మనోభావాలను గాయపర్చకండి. అనవసరంగా లైట్లను వేయడం, చల్లదనం కోసం ఏసీ ఆన్ చేయడం.. ఆఫీసుల్లో ప్రధానంగా విద్యుత్ దుర్వినియోగం ఇలానే జరుగుతుంది.

వీకెండ్స్‌లో ఉద్యోగుల హాజరు తక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయాల్లో ఏసీలకు స్వస్తి చెప్పటం ద్వారా కరెంటు ఆదా చేయొచ్చు. లీకేజీలు ఉంటే పరిశీలించడం ద్వారా చల్లదనాన్ని బయటకు పోకుండా చూడడంతో పాటు అధిక కరెంటు ఖర్చు కాకుండా చూసుకోవచ్చు. మామూలు బల్బులతో పోలిస్తే ప్లోరోసెంట్ బల్బులు 5 శాతం అధిక వెలుతురుని, ఎనిమిది శాతం ఎక్కువ జీవితకాలాన్ని కల్గి ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement