పార్లేలో 10 వేల ఉద్యోగాలకు ఎసరు

Parle may lay-off up to 10,000 employees over weakening demand - Sakshi

ఏడాది కాలంలో తీసేసే అవకాశం

జీఎస్‌టీ ప్రభావం, డిమాండ్‌ క్షీణతే కారణం

ముంబై: అమ్మకాలు పడిపోతుండటంతో వివిధ రంగాల సంస్థలు ఉత్పత్తిని తగ్గించుకునే క్రమంలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా బిస్కెట్ల తయారీ సంస్థ పార్లే కూడా ఈ జాబితాలో చేరనుంది. స్థూల ఆర్థిక పరిస్థితులు ఆశావహంగా లేకపోవడంతో వచ్చే ఏడాది కాలంలో సుమారు 10,000 మంది దాకా ఉద్యోగులను తొలగించాల్సి రావొచ్చని పార్లే ప్రోడక్ట్స్‌ విభాగం హెడ్‌ మయాంక్‌ షా తెలిపారు. సామాన్యుల కోసం ఉద్దేశించిన చౌక ఉత్పత్తులపై కూడా అధిక స్థాయిలో వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) విధింపు, డిమాండ్‌ మందగమనం వంటి అంశాలు ఇందుకు కారణమని ఆయన పేర్కొన్నారు. పార్లేకు సొంతంగా 10 తయారీ యూనిట్లు ఉండగా, థర్డ్‌ పార్టీ తయారీ సంస్థలు 125 దాకా ఉన్నాయి. బిస్కెట్‌ తయారీతో పాటు ఇతర వ్యాపార విభాగాల్లో పార్లేలో ప్రస్తుతం లక్ష మంది పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ‘ఇప్పటికైతే ఉద్యోగులెవరినీ తొలగించలేదు. కానీ పరిస్థితులు మెరుగుపడకపోతే ఈ చర్యలు తీసుకోవాల్సి రావొచ్చు’ అని మయాంక్‌ షా చెప్పారు.
 
ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారీ విక్రయ పరిమాణం ఉండే చౌక ఉత్పత్తుల అమ్మకాలు 7–8 శాతం పడిపోగా, తక్కువ విక్రయ పరిమాణం.. అధిక ధర ఉండే ఉత్పత్తుల అమ్మకాలు 8–9 శాతం పెరిగాయని ఆయన తెలిపారు. మొత్తం మీద బిస్కెట్ల విభాగం అమ్మకాల వృద్ధి గతంలో రెండంకెల స్థాయిలో ఉండేదని.. ప్రస్తుతం 2.5 శాతానికి పడిపోయిందని షా పేర్కొన్నారు. చౌక ఉత్పత్తుల విభాగం మొత్తం బిస్కెట్ల వ్యాపారంలో నాలుగో వంతే ఉన్నప్పటికీ.. అధిక పరిమాణంలో ఉత్పత్తి చేయాల్సినందున ఇందులో ఎక్కువ మంది సిబ్బంది ఉంటారని షా చెప్పారు. గతంలో కేజీకి రూ. 100 లోపు ధర ఉండే బిస్కెట్లకు ఎక్సైజ్‌ సుంకం నుంచి మినహాయింపు ఉండేదని ఆయన తెలిపారు. అయితే, 2017లో బిస్కెట్లను కూడా 18 శాతం జీఎస్‌టీ శ్లాబులో చేర్చినప్పట్నుంచీ పరిశ్రమకు సమస్యలు ప్రారంభమయ్యాయని షా చెప్పారు. అధిక జీఎస్‌టీ కారణంగా చౌక ఉత్పత్తుల రేట్లను కూడా తాము పెంచాల్సి వచ్చిందని, దీంతో డిమాండ్‌ పడిపోయిందని ఆయన తెలిపారు. జీఎస్‌టీపరమైన సమస్యలు సరిదిద్దాలంటూ పరిశ్రమ కోరుతున్నప్పటికీ .. ఇప్పటి వరకూ కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన తెలిపారు. అయితే, ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top