రష్యా చమురు క్షేత్రంలో ఓఎన్‌జీసీ విదేశ్‌కు 15% వాటా | ONGC's 15% stake in the oil field in Russia videsku | Sakshi
Sakshi News home page

రష్యా చమురు క్షేత్రంలో ఓఎన్‌జీసీ విదేశ్‌కు 15% వాటా

Dec 24 2015 2:41 AM | Updated on Sep 3 2017 2:27 PM

రష్యా చమురు క్షేత్రంలో ఓఎన్‌జీసీ విదేశ్‌కు 15% వాటా

రష్యా చమురు క్షేత్రంలో ఓఎన్‌జీసీ విదేశ్‌కు 15% వాటా

రష్యాలోని రెండో అతిపెద్ద చమురు క్షేత్రం ‘వాంకోర్’లో ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్‌జీసీ విదేశ్(ఓవీఎల్) 15 శాతం వాటా కొనుగోలు కార్యరూపం దాల్చుతోంది.

నేడు మోదీ, పుతిన్‌ల సమక్షంలో ఒప్పందంపై సంతకాలు
డీల్ విలువ 1.268 బిలియన్ డాలర్లు...
 న్యూఢిల్లీ:
రష్యాలోని రెండో అతిపెద్ద చమురు క్షేత్రం ‘వాంకోర్’లో ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్‌జీసీ విదేశ్(ఓవీఎల్) 15 శాతం వాటా కొనుగోలు కార్యరూపం దాల్చుతోంది. ఈ డీల్ విలువ 1.286 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.8,300 కోట్లు). ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనలో భాగంగా గురువారం ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరగనున్నాయి.
 
  ఓఎన్‌జీసీకి చెందిన విదేశీ పెట్టుబడుల అనుబంధ సంస్థ ఓవీఎల్.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో దీనికి సంబంధించి ప్రాథమిక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. వాంకోర్ చమురు, గ్యాస్ క్షేత్రం డెవలపర్ అయిన రాస్‌నెఫ్ట్ అనుబంధ కంపెనీ వాంకోర్‌నెఫ్ట్‌తో షేర్ల కొనుగోలు, వాటాదారుల ఒప్పందంపై ఓవీఎల్ సంతకాలు కూడా చేసింది. దీని ప్రకారం అవసరమైతే అక్టోబర్ 31లోపు ఓవీఎల్‌కు ఈ డీల్ నుంచి వైదొలిగే అవకాశం కల్పించారు. అయితే, ఈ ఒప్పందానికి కట్టుబడేందుకు ఓవీఎల్ నిర్ణయించింది.
 
  ఇప్పుడు మోదీ పర్యటన సందర్భంగా ఈ ఫేజ్-1 డీల్ పూర్తయ్యే విధంగా సంతకాలు జరుగుతాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఒక చమురు పీఎస్‌యూ చేపడుతున్న తొలి విదేశీ కొనుగోలు ఒప్పందం ఇదే కావడం గమనార్హం.

 వాంకోర్ క్షేత్రంలో 2.5 బిలియన్ బ్యారెళ్ల ముడిచమురు నిల్వలు ఉన్నట్లు అంచనా. తాజా ఒప్పందం ప్రకారం ఓవీఎల్‌కు ఈ క్షేత్రాల నుంచి వార్షికంగా 3.3 మిలియన్ టన్నుల చమురు ఉత్పత్తికి అవకాశం లభిస్తుంది. కాగా, విదేశాల్లో ఓవీఎల్‌కు ఇది నాలుగో అతిపెద్ద కొనుగోలు ఒప్పందంగా నిలవనుంది.  ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 17 దేశాల్లో 36 ప్రాజెక్టులను ఓవీఎల్ నిర్వహిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement