రీఫైనాన్స్‌ సదుపాయం కల్పించండి

NBFC Request to RBI And Central Government - Sakshi

కేంద్రం, ఆర్‌బీఐకి ఎన్‌బీఎఫ్‌సీల విన్నపం

ముంబై: నిధుల కొరతతో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న నాన్‌–బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ) తమకు ముద్రా స్కీము కింద రీఫైనాన్స్‌ సదుపాయాన్ని కల్పించాలంటూ కేంద్రాన్ని కోరాయి. అలాగే, లిక్విడిటీ అవసరాలు తీర్చేందుకు నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌ (ఎన్‌హెచ్‌బీ) తరహాలో శాశ్వత ప్రాతిపదికన పనిచేసేలా రిజర్వ్‌ బ్యాంక్‌లో ప్రత్యేక రీఫైనాన్స్‌ విండో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశాయి. ఎన్‌బీఎఫ్‌సీ సంస్థల సమాఖ్య ఫైనాన్స్‌ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (ఎఫ్‌ఐడీసీ) ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఆర్‌బీఐలో నమోదైన అన్ని ఎన్‌బీఎఫ్‌సీలకు ముద్రా స్కీము కింద రీఫైనాన్స్‌ సదుపాయం కల్పించాలని, స్ప్రెడ్స్‌ మధ్య (ఎన్‌బీఎఫ్‌సీలు తీసుకునే రుణాలు, ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్ల మధ్య వ్యత్యాసం) గరిష్ట పరిమితి 6 శాతమే ఉండాలన్న నిబంధనను ఎత్తివేయాలని కోరింది.  మార్కెట్‌కు అనుగుణంగా వడ్డీ రేట్లు ఆమోదయోగ్య స్థాయిల్లోనే ఉండేలా సాధారణంగానే సంస్థలు జాగ్రత్తపడతాయని పేర్కొంది. అలాగే, వ్యవస్థలో కీలకమైన భారీ ఎన్‌బీఎఫ్‌సీలు చిన్న, మధ్య స్థాయి షాడో బ్యాంకులకు రుణాలివ్వడానికి ముద్రా స్కీము కింద రీఫైనాన్స్‌ సదుపాయం పొందే వెసులుబాటు కల్పించాలని ఎఫ్‌ఐడీసీ చైర్మన్‌ రామన్‌ అగర్వాల్‌ తెలిపారు. ఎన్‌బీఎఫ్‌సీలు దివాలా తీసే పరిస్థితి ఉందంటూ వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. రుణ వృద్ధి మాత్రమే మందగించిందని దివాలా పరిస్థితులేమీ లేవని స్పష్టం చేశారు.

సమస్యల వలయం..
గతేడాది సెప్టెంబర్‌లో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సంస్థ దివాలా తీసినప్పట్నుంచి మొత్తం షాడో బ్యాంకింగ్‌ రంగం నిధుల కొరతతో అల్లాడుతున్న సంగతి తెలిసిందే. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ వంటి పెద్ద సంస్థలు కూడా డిఫాల్ట్‌ అవుతున్నాయి. వీటికి తోడ్పాటు అందిస్తామంటూ ఆర్‌బీఐ ప్రకటించినప్పటికీ నిర్మాణాత్మక చర్యలేమీ లేకపోవడంతో సంక్షోభం మరింత ముదురుతోంది. ఎన్‌బీఎఫ్‌సీలు ఒకవైపు మార్కెట్‌ వాటా పోగొట్టుకుంటూ ఉండగా.. మరోవైపు వాటి షేర్ల ధర కూడా భారీగా పతనమవుతోంది. పరిశ్రమ గణాంకాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఎన్‌బీఎఫ్‌సీల రుణ వితరణ 19 శాతం తగ్గింది. గతంలో రుణ వృద్ధి ఏటా 15% పైగా ఉండేది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Tags: 
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top