చౌక ద్రవ్య విధానం అంటే?

చౌక ద్రవ్య విధానం అంటే?


ఆధునిక ప్రపంచంలో ప్రతి దేశం ఒక కేంద్ర బ్యాంకును స్థాపించుకుంది. ఇది దేశంలోని ద్రవ్య మార్కెట్‌కు నాయకత్వం వహించడంతో పాటు ద్రవ్య విధానాన్ని రూపొందిస్తుంది. దీంతోపాటు దేశీయ బ్యాంకింగ్‌ వ్యవస్థ, ఆర్థిక సంస్థల కార్యకలాపాల పర్యవేక్షణ, నియంత్రణ బాధ్యతలను నిర్వర్తిస్తుంది.ప్రపంచంలో మొట్టమొదట కేంద్ర బ్యాంకుగా స్వీడన్‌లోని ‘రిక్స్‌ బ్యాంకు’ను పేర్కొంటారు. దీన్ని 1656లో ‘స్టాక్‌హోమ్‌ బ్యాంకు’ పేరుతో ‘జొహన్‌ పామ్‌స్ట్రచ్‌’ నెలకొల్పాడు. అధిక కరెన్సీ ముద్రణ వల్ల నష్టాలు రావడంతో పార్లమెంటు తీర్మానం ద్వారా 1668, సెప్టెంబర్‌ 17న ‘రిక్స్‌ బ్యాంకు’గా అవతరించింది.కేంద్ర బ్యాంకు నిర్వహించే విధుల దృష్ట్యా 1694లో స్థాపించిన ‘బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌’ను మొదటి కేంద్ర బ్యాంకుగా గుర్తించారు. అమెరికాలో 1913, డిసెంబర్‌ 23న ఫెడరల్‌ రిజర్వ్‌ సిస్టం రూపంలో ఒక కేంద్ర బ్యాంకు వ్యవస్థను నెలకొల్పి, దీనికి అనుబంధంగా 12 ప్రాంతీయ ఫెడరల్‌ బ్యాంకులను ఏర్పాటుచేశారు. ‘బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌’ను ఆదర్శంగా తీసుకొని 1935లో మన దేశంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)ని ఏర్పాటు చేశారు.926లో రాయల్‌ కమిషన్‌ ఆన్‌ ఇండియన్‌ కరెన్సీ లేదా హిల్టన్‌–యంగ్‌ కమిషన్‌ మన దేశంలో కేంద్ర బ్యాంకును స్థాపించాలని సలహా ఇచ్చింది. 1931లో ఏర్పాటుచేసిన ‘ఇండియన్‌ సెంట్రల్‌ బ్యాంకింగ్‌ ఎంక్వైరీ కమిటీ’ సైతం కేంద్ర బ్యాంకు ఏర్పాటు చేయాల్సిందిగా సూచించింది. ఫలితంగా 1934 మార్చిలో రిజర్వ్‌ బ్యాంకు చట్టం రూపొందింది. 1935, ఏప్రిల్‌ 1న మన దేశ కేంద్ర బ్యాంకుగా ‘రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’ రూ.5 కోట్ల మూలధనంతో  ఏర్పాటైంది. దీన్ని 1949, జనవరి 1న జాతీయం చేశారు. ఆర్‌బీఐ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. కోల్‌కతా, చెన్నై, న్యూఢిల్లీల్లో ప్రాంతీయ బోర్డు కార్యాలయాలు ఉన్నాయి.

∙రిజర్వ్‌ బ్యాంకు గవర్నర్‌.. ముఖ్య కార్యనిర్వహణాధికారిగా వ్యవహరిస్తారు. ఆయనతోపాటు నలుగురు డిప్యూటీ గవర్నర్లు, 15 మంది ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు ఉంటారు. రిజర్వ్‌ బ్యాంకు మొదటి గవర్నర్‌గా ఓ.స్మిత్‌ వ్యవహరించారు. ప్రస్తుత గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ 2016, సెప్టెంబర్‌ 4న ఆర్‌బీఐ 24వ గవర్నర్‌గా నియమితులయ్యారు.ఆర్‌బీఐ.. ప్రభుత్వ విధానాలను అమలు చేస్తుంది. దీంతోపాటు ప్రభుత్వానికి కోశ వ్యవహారాల్లో మధ్యవర్తిగా వ్యవహరిస్తూ దేశ ద్రవ్య విధానాన్ని సమర్థంగా నిర్వహిస్తోంది. ఆర్‌బీఐ విధులను స్థూలంగా రెండు రకాలుగా పేర్కొనవచ్చు.1. సంప్రదాయక విధులు

2. అభివృద్ధిపరమైన విధులు
సంప్రదాయక విధులు

కరెన్సీ నోట్ల జారీ:  రిజర్వ్‌ బ్యాంక్‌ చట్టం –1934లోని సెక్షన్‌ 22 ప్రకారం మన దేశంలో రూ.2 నుంచి రూ. 10,000 లోపు విలువ కలిగిన కరెన్సీ నోట్లను జారీ చేసే గుత్తాధికారం ‘రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’కు ఉంది. అలాగే సెక్షన్‌ 26 ప్రకారం రిజర్వ్‌ బ్యాంకు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం కరెన్సీ నోట్లను రద్దు చేయొచ్చు. 1938లో జారీ చేసిన రూ.10,000, రూ.5,000, రూ.1,000 కరెన్సీ నోట్లను 1946లో రద్దు చేశారు. మళ్లీ 1954లో ప్రవేశపెట్టారు. జనతా ప్రభుత్వం 1978, జనవరి 16న ఈ నోట్ల రద్దుకు ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. మోదీ ప్రభుత్వం 2016, నవంబరు 8న రూ.500, రూ.1000 కరెన్సీ నోట్లను రద్దు చేసింది. వీటి స్థానంలో కొత్తగా రూ.2000 నోట్‌ను జారీ చేసింది.కరెన్సీ నోట్ల జారీకి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రత్యేకంగా ఒక జారీ డిపార్ట్‌మెంట్‌ను ఏర్పాటు చేసింది. మన దేశంలో కరెన్సీ నోట్ల జారీకి 1935 నుంచి 1956 వరకు నైష్పత్తిక రిజర్వ్‌ పద్ధతిని అనుసరించారు. దీని ప్రకారం కరెన్సీ జారీకి 40 శాతం బంగారాన్ని నిల్వ ఉంచాలి. 1956, అక్టోబర్‌ 10 నుంచి కనిష్ట నిధుల పద్ధతి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం మొత్తం రూ.200 కోట్ల నిల్వల పరిమాణంలో రూ.115 కోట్ల విలువైన బంగారాన్ని, రూ.85 కోట్ల విదేశీ మారకద్రవ్యాన్ని నిల్వగా ఉంచాలి.ప్రభుత్వ బ్యాంకు: ఆర్‌బీఐ కేంద్ర ప్రభుత్వానికి బ్యాంకర్‌గా, ప్రతినిధిగా, సలహాదారుగా వ్యవహరిస్తుంది. వాణిజ్య బ్యాంకులు ఖాతాదారులకు ఎలాంటి బ్యాంకింగ్‌ సౌకర్యాలు కల్పిస్తాయో అవే సౌకర్యాలను రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రభుత్వానికి కల్పిస్తుంది. ప్రభుత్వ రుణాలను దీని ద్వారా జారీ చేస్తారు. ప్రభుత్వం ఇతర దేశాలకు చేయాల్సిన చెల్లింపుల కోసం ఆర్‌బీఐ విదేశీ మారక ద్రవ్యాన్ని సరఫరా చేస్తుంది. ప్రభుత్వం తరఫున విదేశీ కరెన్సీ కొనుగోలు, అమ్మకాలను చేపట్టడంతోపాటు ప్రభుత్వ బంగారం నిల్వలను పరిరక్షిస్తుంది. దేశ ఆర్థిక పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ద్రవ్యోల్బణం, ప్రతి ద్రవ్యోల్బణం, కరెన్సీ మూల్యహీనీకరణ, లోటు ద్రవ్యవిధానం, చెల్లింపుల శేషం తదితర విషయాల్లో ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంది.బ్యాంకులకు బ్యాంకు: రిజర్వ్‌ బ్యాంకు వాణిజ్య బ్యాంకులకు నాయకత్వం వహిస్తుంది. అవి స్వీకరించిన డిపాజిట్లలో కొంత భాగాన్ని రిజర్వ్‌ బ్యాంకులో నిల్వ ఉంచాలి. దీన్నే నగదు నిల్వల నిష్పత్తి అంటారు. ఆర్‌బీఐ.. వాణిజ్య బ్యాంకుల కార్యకలాపాలను నియంత్రిస్తుంది. వాణిజ్య బ్యాంకులకు అవసరమైనప్పుడు వాటి వద్ద ఉన్న ప్రభుత్వ బాండ్లను, ట్రెజరీ బిల్లులను రీ డిస్కౌంట్‌ చేసే సౌకర్యం కల్పిస్తుంది. అందుకే దీన్ని అంతిమ రుణదాతగా పేర్కొంటారు. రిజర్వ్‌ బ్యాంకు క్లియరింగ్‌ హౌజ్‌ను నిర్వహిస్తూ బ్యాంకుల మధ్య జరిగే లావాదేవీలను పర్యవేక్షిస్తుంది.విదేశీ నిధుల పరిరక్షణ: విదేశీ మారక నియంత్రణ చట్టాన్ని ప్రవేశపెట్టిన తర్వాత విదేశీ మారక నిల్వలన్నీ రిజర్వ్‌ బ్యాంకు అధీనంలోకి వచ్చాయి. ఈ చట్టం ప్రకారం అనుమతిలేనివారు విదేశీ మారకాన్ని అమ్మడానికి/కొనడానికి వీల్లేదు. విదేశీ ద్రవ్య వ్యవహారాలన్నీ ఆర్‌బీఐ ద్వారానే జరుగుతాయి.మారకపు రేటులో స్థిరత్వ సాధన: మన దేశానికి అంతర్జాతీయ ద్రవ్యనిధిలో సభ్యత్వం ఉంది. అందువల్ల ఇతర దేశాలతోపాటు కరెన్సీ మారకపు రేటులో స్థిరత్వ సాధన రిజర్వ్‌ బ్యాంకు బాధ్యత. దీంతో అంతర్జాతీయ కరెన్సీలకు సంబంధించి రిజర్వ్‌ బ్యాంకు.. రక్షకుడిగా వ్యవహరిస్తుంది.పరపతి నియంత్రణ: వాణిజ్య బ్యాంకులు తాము స్వీకరించిన ప్రాథమిక డిపాజిట్ల ఆధారంగా పరపతి ద్రవ్యాన్ని సృష్టిస్తాయి. పరపతి ద్రవ్యం ఎక్కువైనప్పుడు ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడతాయి. పరపతి ద్రవ్యం తక్కువైనప్పుడు ఆర్థిక వ్యవస్థలో ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితులు తలెత్తుతాయి. దీని దృష్ట్యా రిజర్వ్‌ బ్యాంకు పరిమాణాత్మక, గుణాత్మక పరపతి నియంత్రణ సాధనాలను ఉపయోగించి పరపతిని నియంత్రిస్తుంది.అభివృద్ధి పరమైన విధులు

బ్యాంకింగ్‌ వ్యవస్థ అభివృద్ధి: రిజర్వ్‌ బ్యాంకు దేశంలోని బ్యాంకుల కార్యకలాపాలను పర్యవేక్షించడంతోపాటు బ్యాంకింగ్‌ వ్యవస్థలో  నూతన మార్పులను ప్రవేశపెడుతుంది. బ్యాంకుల అభివృద్ధికి బ్యాంకింగ్‌ కార్యకలాపాల శాఖను ఏర్పాటు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్‌ శాఖల ఏర్పాటును ప్రోత్సహిస్తోంది.    వ్యవసాయ పరపతికి ప్రోత్సాహం: రిజర్వ్‌ బ్యాంకు గ్రామీణ, వ్యవసాయ పరపతిని అందించడంలో పరోక్షంగా కృషి చేçస్తుంది. ఇందులో భాగంగా రాష్ట్ర సహకార బ్యాంకులకు, వ్యవసాయ పరపతిని అందించే విత్త సంస్థలకు ఆర్థిక సహాయం అందిస్తుంది. తద్వారా వ్యవసాయదారులకు స్వల్ప, మధ్య, దీర్ఘకాలికరుణ సౌకర్యాల కల్పనకు తోడ్పడుతుంది. గ్రామీణ పరపతిలో శిఖరాగ్ర బ్యాంకుగా వ్యవహరించే నాబార్డు మూలధనంలో 50 శాతాన్ని రిజర్వ్‌ బ్యాంకే సమకూర్చింది.పారిశ్రామిక ప్రగతికి తోడ్పాటు: రిజర్వ్‌ బ్యాంకు పెద్ద పరిశ్రమల అభివృద్ధికి తోడ్పడుతూనే చిన్న పరిశ్రమల అభివృద్ధికి సైతం కృషి చేస్తుంది. భారత పారిశ్రామికాభివృద్ధి బ్యాంకు, భారత పారిశ్రామిక విత్త సంస్థ, రాష్ట్ర విత్త సహాయ సంస్థల కార్యకలాపాల్లో రిజర్వ్‌ బ్యాంకు పాత్ర కీలకం. పారిశ్రామిక విత్త సహాయం నిమిత్తం రిజర్వ్‌ బ్యాంకు యూనిట్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియాను నెలకొల్పింది.

బిల్‌ మార్కెట్‌ అభివృద్ధికి కృషి: ఆర్‌బీఐ 1952లో బిల్‌ మార్కెట్‌ పథకాన్ని ప్రారంభించింది. తద్వారా సమర్థవంతమైన ద్రవ్య మార్కెట్‌కు పునాదులు వేసింది. నరసింహం కమిటీ సిఫారసుల మేరకు 1970లో కొత్త బిల్‌ మార్కెట్‌ పథకాన్ని ప్రారంభించడం ద్వారా రీ డిస్కౌంటింగ్‌ పద్ధతులను సులభతరం చేసింది. తద్వారా రుణాల మంజూరీలో అనవసర జాప్యాన్ని నివారించింది.సిబ్బందికి శిక్షణ సౌకర్యాలు: దేశీయ బ్యాంకింగ్‌ రంగంలో పనిచేస్తున్న సిబ్బందికి శిక్షణ  కోసం ఆర్‌బీఐ మూడు కళాశాలలను నిర్వహిస్తోంది. అవి..  

1. బ్యాంకర్ల శిక్షణ కళాశాల (ముంబై)

2. వ్యవసాయ బ్యాంకింగ్‌ కళాశాల (పుణె )

3. రిజర్వ్‌ బ్యాంకు సిబ్బంది కళాశాల (చెన్నై).
ద్రవ్య విధానం

ఒక దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరు ఆ దేశ ద్రవ్య విధానంపై ఆధారపడి ఉంటుంది. ద్రవ్య విధానం ఆర్థిక విధానంలో అంతర్భాగం. ద్రవ్య విధాన రూపకల్పనలో రిజర్వ్‌ బ్యాంకు పాత్ర విశిష్టమైంది. ఆర్‌బీఐ ఆర్థిక వ్యవస్థలో పరపతిని క్రమబద్ధం చేస్తూ ద్రవ్య సరఫరాను అదుపులో ఉంచుతుంది. తద్వారా సాధారణ ధరల స్థాయిలో సుస్థిరత తీసుకొస్తుంది. ఆర్థికాభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేయడమే ద్రవ్య విధాన ముఖ్య లక్ష్యం. పరపతిని నియంత్రించేందుకు రెండు రకాల సాధనాలు ఉన్నాయి. అవి..  1. పరిమాణాత్మక నియంత్రణ సాధనాలు

2. గుణాత్మక నియంత్రణ సాధనాలు

పరిమాణాత్మక నియంత్రణ సాధనాలు
బ్యాంకు రేటు: వాణిజ్య బ్యాంకులు తమ వద్ద ఉన్న వినిమయ బిల్లుల్ని డిస్కౌంట్‌ చేయడం ద్వారా లేదా సెక్యూరిటీలను హామీగా ఇవ్వడం ద్వారా రిజర్వ్‌ బ్యాంకు నుంచి రుణాలు పొందుతాయి. ఈ రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీ రేటును బ్యాంకు రేటు అంటారు. దీన్నే ‘రీ డిస్కౌంటింగ్‌ రేటు’గా కూడా పేర్కొంటారు. ఆర్థిక వ్యవస్థలో పరపతి పరిమాణం ఎక్కువగా ఉండి ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడినప్పుడు ద్రవ్య çసరఫరాను తగ్గించేందుకు రిజర్వ్‌ బ్యాంకు.. బ్యాంకు రేటును పెంచుతుంది. దీన్ని ఖరీదైన ద్రవ్య విధానం అంటారు. ఆర్థిక వ్యవస్థలో పరపతి పరిమాణం తక్కువగా ఉండి ప్రతిద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడినప్పుడు రిజర్వ్‌ బ్యాంకు ద్రవ్య çసరఫరాను పెంచేందుకు బ్యాంకు రేటును తగ్గిస్తుంది. దీన్ని చౌక ద్రవ్య విధానం అంటారు. ప్రస్తుతం బ్యాంకు రేటు 6.25 శాతంగా, రెపో రేటు 6 శాతంగా, రివర్స్‌ రెపో రేటు 5.75 శాతంగా ఉంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top