నచ్చని టెల్కోలకు గుడ్‌బై!

Mobile Number Portability increased 37.4 Persant in July 2019 - Sakshi

ఆపరేటర్లను సులువుగా మారుస్తున్న కస్టమర్లు

రెండో స్థానంలో తెలంగాణ, ఏపీ సర్కిల్‌

ఇప్పటికే ఎంఎన్‌పీ అభ్యర్థనలు 44.7 కోట్లు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మొబైల్‌ నంబర్‌ పోర్టబిలిటీ(ఎంఎన్‌పీ) కోసం దేశవ్యాప్తంగా దరఖాస్తులు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఆశించిన స్థాయిలో సేవలు అందకపోతే కస్టమర్లు మరో ఆపరేటర్‌కు సులువుగా మారుతున్నారు. 2019 జూలై 31 నాటికి 44.74 కోట్ల మంది ఎంఎన్‌పీ సేవలను వినియోగించుకున్నారంటే వినియోగదార్లలో చైతన్యం అర్థం చేసుకోవచ్చు. ఇలా అభ్యర్థనలు వచ్చిన రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 4.14 కోట్ల దరఖాస్తులతో కర్ణాటక తొలి స్థానంలో ఉండగా.. 3.78 కోట్ల రిక్వెస్టులతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సర్కిల్‌ రెండో స్థానంలో నిలిచింది. తమిళనాడు, రాజస్తాన్, మహారాష్ట్ర సర్కిళ్లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక ఈ ఏడాది జూలైలో ఎంఎన్‌పీ కోసం 59.2 లక్షల విన్నపాలు వచ్చాయి. 2010 నవంబరు 25న హరియాణా సర్వీస్‌ ఏరియాలో తొలుత ఎంఎన్‌పీ అందుబాటులోకి వచ్చింది.  దశలవారీగా అన్ని సర్కిళ్లకు ఈ సర్వీసును విస్తరించారు.

పెరుగుతున్న ఫిర్యాదులు..
టెలికం రంగంలో భారత్‌లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. 2జీ తర్వాత 3జీ విస్తరణ కంటే వేగంగా 4జీ సేవలు దూసుకుపోయాయి. ప్రధానంగా రిలయన్స్‌ జియో రాకతో టెలికం రంగంలో పోటీ తీవ్రమైంది. 2019 జూలై నాటికి భారత్‌లో వైర్‌లెస్‌ చందాదారులు 97.2 కోట్ల మంది ఉన్నారు. మెరుగైన సేవల కోసం వినియోగదార్లు ఖర్చుకు వెనుకంజ వేయడం లేదు. మరోవైపు కస్టమర్ల సంఖ్య పెరుగుతోంది. దీంతో ఉత్తమ కవరేజ్, సర్వీసుల కోసం ఏటా అన్ని టెలికం కంపెనీలు ఎంత కాదన్నా రూ.10,000 కోట్లు ఖర్చు చేస్తున్నాయి. ఎయిర్‌టెల్‌ ప్రాజెక్ట్‌ లీప్‌ కింద రూ.10,000 కోట్లు వ్యయం చేస్తోంది. టవర్ల ఏర్పాటును రెసిడెన్షియల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్లు అడ్డుకోరాదన్న సుప్రీం తీర్పు తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చింది. మరోవైపు కేంద్ర టెలికం మంత్రిత్వ శాఖ చొరవతో టవర్ల ఏర్పాటుకు ప్రభుత్వ భవనాలను వినియోగించుకునే వెసులుబాటు టెలికం కంపెనీలకు లభించింది.

ప్రధాన సమస్యలు ఇవే..
కవరేజ్, డేటా స్పీడ్, కాల్‌ డ్రాప్, కాల్‌ కనెక్టివిటీ, కాల్‌ క్వాలిటీ వంటి నెట్‌వర్క్‌ సంబంధ ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. అలాగే బిల్లింగ్‌ పారదర్శకత, కాల్‌ సెంటర్‌తో అనుసంధానం, అందుబాటులో ఔట్‌లెట్ల వంటి సర్వీస్‌ విషయాలనూ కస్టమర్లు పరిగణలోకి తీసుకుంటున్నారు. ఫిర్యాదు చేయాలంటే కాల్‌ సెంటర్‌కు లైన్‌ కలిసే అవకాశమే ఉండడం లేదు. యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయాలని టెల్కోలు చెబుతున్నా అంతిమంగా పరిష్కారం అయ్యే చాన్స్‌ తక్కువ. వినియోగం కంటే మొబైల్‌ బిల్లు ఎక్కువగా ఉందని భావించే కస్టమర్లు మెరుగైన ప్యాకేజీ కోసం ఆపరేటర్‌కు గుడ్‌బై చెప్పేస్తున్నారు. ఎంఎన్‌పీ ప్రత్యేకత ఏమంటే వినియోగదారు మరో రాష్ట్రానికి (టెలికం సర్కిల్‌) మారినా వినియోగిస్తున్న నంబరు మారకపోవడం. ఈ అంశమే కస్టమర్లకు అస్త్రం. టెల్కోను మార్చిన 90 రోజులకు మరో ఆపరేటర్‌ను ఎంచుకునే వెసులుబాటు ఉండడం వినియోగదార్లకు కలిసి వస్తోంది.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top