మైలేజీ రాకపోతే వాహనం వాపస్ | Mahindra's Blazo receives over 6000 inquiries, to boost company's HCV sales | Sakshi
Sakshi News home page

మైలేజీ రాకపోతే వాహనం వాపస్

Mar 24 2016 12:40 AM | Updated on Apr 3 2019 4:08 PM

మైలేజీ రాకపోతే వాహనం వాపస్ - Sakshi

మైలేజీ రాకపోతే వాహనం వాపస్

వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా భారీ వాణిజ్య వాహన (హెచ్‌సీవీ) విభాగంలో బ్లేజో శ్రేణి

మహీంద్రా నుంచి బ్లేజో స్మార్ట్ ట్రక్స్
48 గంటల్లో సర్వీస్ పూర్తి


హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా భారీ వాణిజ్య వాహన (హెచ్‌సీవీ) విభాగంలో బ్లేజో శ్రేణి స్మార్ట్ ట్రక్కులను బుధవారమిక్కడ ప్రవేశపెట్టింది. మార్కెట్లో ఉన్న వాహనాల కంటే 8 శాతం వరకు అధిక మైలేజీ గ్యారంటీ అని కంపెనీ వెల్లడించింది. మైలేజీ ఇవ్వకపోతే వాహనాన్ని వెనక్కి ఇవ్వవచ్చు. వెహికిల్‌కు చెల్లించిన మొత్తం డబ్బులను తిరిగి ఇస్తారు. ఇక బ్లేజో సర్వీస్ విషయానికి వస్తే 48 గంటల్లో వాహనాన్ని సిద్ధం చేస్తారు. అంత కంటే ఎక్కువ సమయమైతే రోజుకు రూ.1,000 చొప్పున వాహన యజమానికి చెల్లిస్తామని మహీంద్రా ట్రక్, బస్ విభాగం సీఈవో నళిన్ మెహతా ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు.

 మొత్తం 55 వేరియంట్లలో..
బ్లేజో శ్రేణిలో 55 వేరియంట్లలో వాహనాలను రూపొందించారు. సామర్థ్యం 25-49 టన్నులు. లోడ్, రోడ్డునుబట్టి ఇంధనాన్ని వినియోగించేలా మల్టీ డ్రైవ్ మోడ్‌తో ఫ్యూయెల్ స్మార్ట్ ఇంజన్‌ను పొందుపరిచారు. ఘాట్ రోడ్లలో టర్బో మోడ్, సరుకుతో వెళ్లినప్పుడు హెవీ, ఖాళీగా వెళ్లేప్పుడు లైట్ మోడ్ బటన్ నొక్కితే చాలు. మోడ్‌నుబట్టి ఇంధనం ఖర్చు అవుతుంది. 45 రోజుల్లో ఈ వాహనం కోసం 6,500లకుపైగా ఎంక్వైరీలు వచ్చాయని మహీంద్రా తెలిపింది.

 రెండేళ్లలో రెండింతల వాటా..
మూడేళ్లుగా స్తబ్దుగా ఉన్న హెచ్‌సీవీ విభాగంలో వృద్ధి మొదలైందని నళిన్ వెల్లడించారు. ‘క్రితం ఏడాదితో పోలిస్తే మూడో త్రైమాసికంలో పరిశ్రమ వృద్ధి 35 శాతముంది. మహీంద్రా 60 శాతం నమోదు చేసింది. కంపెనీకి హెచ్‌సీవీ రంగంలో 3.7 శాతం వాటా ఉంది. రెండేళ్లలో దీనిని రెట్టింపు చేయాలన్నది లక్ష్యం. 2015-16లో పరిశ్రమ 1,78,000 యూనిట్ల అమ్మకాలను నమోదు చేయనుంది. 2016-17లో 40 శాతం అమ్మకాలు బ్లేజో నుంచి సమకూరతాయని ఆశిస్తున్నాం. నిర్మాణ రంగం నుంచి అధిక ఆర్డర్లు ఉంటాయి.’ అని వ్యాఖ్యానించారు.

 8-16 టన్నుల విభాగంలోకి..
మహీంద్రా 8-16 టన్నుల విభాగంలోకి ప్రవేశిస్తోంది. ముందుగా 2018లో వాణిజ్య వాహనాలను, ఆ తర్వాత బస్‌లను ప్రవేశపెట్టనుంది. వీటి అభివృద్ధికి కంపెనీ రూ.700 కోట్లను వెచ్చిస్తోంది. స్క్రాప్ పాలసీ అమలైతే ఆధునిక, భద్రమైన వాహనాలు రోడ్డెక్కుతాయి. దేశానికి, ఆర్థికంగానూ మంచిది అని సీఈవో తెలిపారు. కాగా, బ్లేజో వాహన ధరలు ఎక్స్‌షోరూంలో రూ.25-35 లక్షలు ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement