ఇన్‌ఫ్రా, విద్యుత్‌ కంపెనీలకు రుణాలు వద్దు..

Lending to power sector projects will have to stop: State Bank of India - Sakshi

వాటికిచ్చిన రుణాల్లో అధిక భాగం ఎన్‌పీఏలే

కఠినంగా స్పందించిన ఎస్‌బీఐ  

ముంబై: మౌలిక సదుపాయాల (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌) ప్రాజెక్టులు, ముఖ్యంగా విద్యుత్‌ రంగానికి బ్యాంకులు రుణసాయం నిలిపివేయాలని ప్రభుత్వరంగ అగ్రగామి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) అభిప్రాయపడింది. గత దశాబ్దకాలంలో ఈ రంగానికి మంజూరు చేసిన రుణాల్లో అధిక భాగం మొండి బకాయిలుగా (ఎన్‌పీఏలు) మారడం వంటి భయానక అనుభవాన్ని ఇందుకు కారణంగా పేర్కొంది. ఆర్‌బీఐ మార్గదర్శకాల నేపథ్యంలో విద్యుత్‌ రంగానికి సంబంధించి రూ.1.7 లక్షల కోట్ల ఎన్‌పీఏలను దివాలా చర్యల కోసం బ్యాంకులు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు  (ఎన్‌సీఎల్‌టీ) నివేదించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

బ్యాంకులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో ఇన్‌ఫ్రా ప్రాజెక్టులకు రుణాలను నిలిపివేయాల్సి రావచ్చని ఎస్‌బీఐ ఎండీ దినేష్‌కుమార్‌ ఖరా మీడియాతో అన్నారు. దేశ ఆర్థిక వృద్ధికి కీలకమైన ఇన్‌ఫ్రా రంగానికి నిధుల సాయం అవసరాల నేపథ్యాన్ని గుర్తు చేస్తూ, బ్యాంకులకు ఇప్పుడు ఈ రంగం ‘అంటరానిదా’ అన్న ప్రశ్నకు... కేవలం విద్యుత్‌ రంగానికే అది వర్తిస్తుందని ఖరా బదులిచ్చారు. తన మాటల్ని సవరించి రోడ్డు ప్రాజెక్టులకు రుణాలిచ్చేందుకు సుముఖంగానే ఉన్నామని చెప్పారు. రిస్క్‌ నివారణను సరైన చర్యలు తీసుకుంటే అన్ని రంగాలకు రుణాలిచ్చేందుకు బ్యాంకులు సిద్ధమేనని తేల్చి చెప్పారు.

అయితే, విద్యుత్‌ రంగానికి సంబంధించి ఇంధన సరఫరా ఒప్పందాలు, విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల పరంగా సమస్యలు ఉన్నాయని గుర్తు చేశారు. మరో ఎండీ పీకే గుప్తా మాట్లాడుతూ... ఫిబ్రవరి 12 నాటి ఆర్‌బీఐ ఎన్‌పీఏల సత్వర గుర్తింపు ఉత్తర్వుల కారణంగా బ్యాంకులకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందన్నారు. విద్యుత్‌ ప్రాజెక్టుల ఎన్‌పీఏలను ఎన్‌సీఎల్‌టీకి నివేదించితే సహజంగానే విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల రద్దుకు దారితీస్తుందని, అది బ్యాంకులను బలహీనపరుస్తుందని చెప్పారు. బ్యాంకులకు మరింత సమయం ఇస్తే ఎన్‌సీఎల్‌టీకి వెళ్లకుండా పరిష్కార ప్రణాళిక కనుగొనేందుకు అవకాశం ఉంటుందన్నారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top