లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌.. 'ఇండియాబుల్స్' చేతికి

Lakshmi Vilas Bank approves merger with lndiabulls Housing Finance - Sakshi

విలీన ప్రతిపాదనకు లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ బోర్డు ఆమోదం 

100 ఎల్‌వీబీ షేర్లకు 14 ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ షేర్లు

టాప్‌ 8 ప్రైవేట్‌ బ్యాంకుల్లో ఒకటిగా ఆవిర్భావం 

న్యూఢిల్లీ: దేశీ బ్యాంకింగ్‌ రంగంలో మరో విలీనానికి తెరతీస్తూ గృహ రుణాల సంస్థ ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ (ఐహెచ్‌ఎఫ్‌)లో విలీనానికి ప్రైవేట్‌ రంగ లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ (ఎల్‌వీబీ) బోర్డు శుక్రవారం ఆమోదముద్ర వేసింది. విలీన ప్రతిపాదన ప్రకారం.. ప్రతీ 100 ఎల్‌వీబీ షేర్లకు (రూ. 10 ముఖవిలువ) ఐహెచ్‌ఎఫ్‌ షేర్లు 14 (రూ. 2 ముఖవిలువ) కేటాయించనున్నారు. విలీన సంస్థకు ఇండియాబుల్స్‌ గ్రూప్‌ ప్రమోటరు సమీర్‌ గెహ్లాట్‌ .. వైస్‌ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఐహెచ్‌ఎఫ్‌ ఎండీ గగన్‌ బంగా, ఎల్‌వీబీ సీఈవో పార్థసారథి ముఖర్జీ జాయింట్‌ ఎండీలుగాను,  ఐహెచ్‌ఎఫ్‌ ఈడీ అజిత్‌ మిట్టల్‌.. ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టరుగా ఉంటారు. ఎల్‌వీబీ, ఐహెచ్‌ఎఫ్‌లు శుక్రవారం ఈ విషయాలు వెల్లడించాయి. కార్యకలాపాలు మరింత మెరుగుపర్చుకునేందుకు, కొత్త విభాగాల్లోకి కూడా ప్రవేశించేందుకు ఈ విలీనంతో తోడ్పాటు లభించగలదని ఎల్‌వీబీ పేర్కొంది. నిధుల సమీకరణ వ్యయాలు తగ్గడంతో పాటు, వ్యాపార పరిమాణాన్ని పెంచుకునేందుకు ఉపయోగపడగలదని ఐహెచ్‌ఎఫ్‌ వివరించింది. విలీనంతో దేశీయంగా వ్యాపార పరిమాణం, లాభదాయకత విషయంలో టాప్‌ 8 ప్రైవేట్‌ బ్యాంకుల్లో ఒకటిగా తమది ఆవిర్భవిస్తుందని ఐహెచ్‌ఎఫ్‌ పేర్కొంది.  

రెండు సంస్థల వ్యాపార పరిమాణం ఇలా .. 
తమిళనాడులోని కరూర్‌కి చెందిన ఏడుగురు వ్యాపారవేత్తలు స్థానిక ప్రజల ఆర్థిక అవసరాల కోసం 1926లో లక్ష్మీ విలాస్‌ బ్యాంకును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం.. ఎల్‌వీబీ డిపాజిట్లు రూ. 30,787 కోట్లు కాగా, ఇచ్చిన రుణాల పరిమాణం రూ. 24,123 కోట్లు. గత ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల కాలానికి రూ. 630 కోట్ల నష్టం నమోదు చేసింది. స్థూల మొండిబాకీలు 13.9%  నికర మొండిబాకీలు 7.6%గా ఉన్నాయి. దాదాపు 21.86 లక్షల ఖాతాదారులు, 4,881 మంది ఉద్యోగులు ఉండగా, దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లోని 150 పట్టణాల్లో 569 శాఖలు ఉన్నాయి. మరోవైపు,  ఇండియాబుల్స్‌ గ్రూప్‌లో భాగమైన ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ నికర విలువ ప్రస్తుతం రూ. 17,792 కోట్లు. గత ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలలకు రూ. 3,084 కోట్ల లాభాలు ఆర్జించింది. స్థూల నిరర్థక ఆస్తులు 0.79%, నికర నిరర్థక ఆస్తులు 0.59%గా ఉంది. గృహ రుణాల మార్కెట్‌లో హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు సంబంధించి మూడో స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల్లో కార్యకలాపాలతో ఇప్పటిదాకా మొత్తం రూ. 2.4 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేసింది.  

విలీనానంతరం 40వేల కోట్ల మార్కెట్‌ క్యాప్‌ .. 
గతేడాది డిసెంబర్‌ చివరి నాటికి విలీన సంస్థ నికర విలువ రూ. 19,472 కోట్లుగాను, లోన్‌ బుక్‌ దాదాపు రూ. 1,23,393 కోట్లుగానూ ఉంటుంది.  క్యాపిటల్‌ అడెక్వసీ నిష్పత్తి 20.6 శాతంగా ఉండనుంది. నియంత్రణ సంస్థ నిబంధనల ప్రకారం ఇది 10.875 శాతంగా ఉంటే సరిపోతుంది. అటు స్థూల మొండిబాకీలు 3.5 శాతానికి, నికర ఎన్‌పీఏలు 2 శాతానికి పరిమితం అవుతాయి. 800 శాఖలు, 14,302 మంది ఉద్యోగులు ఉండనున్నారు. మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ దాదాపు రూ. 40,000 కోట్ల పైచిలుకు ఉంటుందని గగన్‌ బంగా తెలిపారు.  

విలీనానికి కారణాలు.. 
ఇన్‌ఫ్రా ఫైనాన్స్‌ సంస్థ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ వరుసగా రుణాల చెల్లింపుల్లో డిఫాల్ట్‌ అయిన ప్రభావంతో 2018 సెప్టెంబర్‌లో ఆర్థిక మార్కెట్లు అస్తవ్యస్తంగా మారినప్పట్నుంచి ఐహెచ్‌ఎఫ్‌ లాంటి నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలకు నిధుల సమీకరణ కష్టతరంగా మారింది. డిసెంబర్‌ క్వార్టర్‌లో ఐహెచ్‌ఎఫ్‌ రుణాల మంజూరీ అంతక్రితం త్రై మాసికంతో పోలిస్తే 65% పడిపోయింది. మార్చి క్వార్టర్‌లో కాస్త మెరుగుపడినప్పటికీ.. సాధారణ స్థాయికన్నా తక్కు వే ఉంటోంది. సంక్షోభం రాకముందు ప్రతి క్వార్టర్‌లో ఐహెచ్‌ఎఫ్‌ సుమారు రూ. 10,000 కోట్ల మేర రుణా లు మంజూ రు చేసేది. ఇది గణనీయంగా తగ్గింది. నిధుల సమీకరణ వ్యయాలు పెరిగిపోయాయి. మరోవైపు, ఎల్‌వీబీ మొండిబాకీలు ఏకంగా 13.95 శాతానికి పెరిగిపోగా, క్యాపిటల్‌ అడెక్వసీ రేషియో నియంత్రణ సంస్థ నిర్దేశిత స్థాయికన్నా తక్కువగా 7.57 శాతానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో విలీనంతో ఇరు సంస్థలకు లబ్ధి చేకూరగలదని అంచనా.  విలీన వార్తలతో శుక్రవారం బీఎస్‌ఈలో లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ షేరు సుమారు 5 శాతం పెరిగి రూ. 92.75 వద్ద క్లోజయ్యింది. అటు ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేరు దాదాపు అరశాతం పెరిగి రూ. 903.15 వద్ద ముగిసింది.   

ఇరు సంస్థలకు ప్రయోజనాలేంటంటే.. 
ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ (ఐహెచ్‌ఎఫ్‌) నిధుల సమీకరణ వ్యయాలు తగ్గుతాయి. అలాగే ఆస్తులు, అప్పుల మధ్య భారీ వ్యత్యాసాల సమస్య పరిష్కారమవుతుంది. ఇక, ఇతరత్రా రిటైల్‌ బ్యాంకింగ్‌ పథకాలను ప్రవేశపెట్టేందుకు కూడా సాధ్యపడుతుంది. ఐబీహెచ్‌ ప్రధానంగా పశ్చిమ, ఉత్తరాది రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగిస్తుండగా.. ఎల్‌వీబీ దక్షిణాదిలో ఎక్కువగా విస్తరించి ఉంది. దీంతో ఈ విలీనం ద్వారా ఐబీహెచ్‌ దక్షిణాదిలో కూడా కార్యకలాపాలు విస్తరించడానికి వీలుపడనుంది.  మరోవైపు లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ (ఎల్‌వీబీ) విషయానికొస్తే.. విలీనంతో క్యాపిటల్‌ అడెక్వసీ నిష్పత్తి మెరుగుపడటంతో పాటు వ్యాపార పరిమాణం కూడా పెరుగుతుంది. అటు వ్యాపార వృద్ధికి మరిన్ని పెట్టుబడులు లభిస్తాయి. అటు క్లయింట్స్‌ సంఖ్య కూడా పెరుగుతుంది.

ఆర్‌బీఐ అనుమతులు కీలకం.. 
ఈ విలీన ప్రతిపాదనకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆమోదముద్ర వేయాల్సి ఉంది. సాధారణంగా ఇలాంటి విలీనాల్లో బ్యాంకు లైసెన్సును వేరే సంస్థకు బదలాయించేందుకు ఆర్‌బీఐ అంగీకరించదని, కాబట్టి లైసెన్సు ఎల్‌వీబీ పేరు మీదే కొనసాగవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. విలీనానంతరం ఏర్పడే సంస్థలో ఐహెచ్‌ఎఫ్‌ ప్రమోటర్లకు 19.5% వాటాలు ఉంటాయి. ప్రస్తుతం వారికి ఐహెచ్‌ఎఫ్‌లో 21.6% వాటాలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం బ్యాంకులో ప్రమోటర్లు పది శాతానికి మించి వాటాలు ఉంచుకునేందుకు ఆర్‌బీఐ నుంచి ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇండియాబుల్స్‌ గ్రూప్‌ అటు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార కార్యకలాపాలు కూడా సాగిస్తున్న నేపథ్యంలో రియల్టీ, బ్యాంకింగ్‌ వ్యాపారాల విలీనానికి ఆర్‌బీఐ ఎలా స్పందిస్తుందన్నది కూడా చూడాల్సిన విషయమని పరిశీలకులు అభిప్రాయపడ్డారు. గతంలో ఇలాంటి డీల్స్‌పై ఆర్‌బీఐ అంత సానుకూలత చూపలేదని వారు పేర్కొన్నారు. అటు షేర్‌హోల్డర్లతో పాటు కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ), నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌ (ఎన్‌హెచ్‌బీ), నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) మొదలైన నియంత్రణ సంస్థల నుంచి కూడా అనుమతులు పొందాల్సి ఉంటుందని గగన్‌ బంగా చెప్పారు.  
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top