ఒక్కరోజులోనే ఈ ప్రత్యర్థులకు 1.5 బిలియన్‌ డాలర్లు

India's billionaire telecom rivals add $1.5 billion to personal wealth

న్యూఢిల్లీ : దేశీయ టెలికాం మార్కెట్‌లో జరుగుతున్న యుద్ధంలో ఒక్కరిని మించి మరొకరు దూసుకుపోతున్నారు. తీవ్రమైన పోటీ వాతావరణం ఉన్నప్పటికీ ఎక్కడా కూడా ఆ ఇద్దరు మాత్రం తగ్గడం లేదు. ఇటు మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌లోనూ తీవ్ర పోటీ నెలకొంది. రిలయన్స్‌ ఇండస్ట్రీ షేర్లు, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు నేటి మార్కెట్‌లో మైలురాయిలకు దగ్గరగా మెరుపులు మెరిపించాయి. ప్రస్తుతం టెలికాం మార్కెట్‌ లీడర్‌గా ఉన్న భారతీ ఎయిర్‌టెల్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ సోమవారం రూ.2 లక్షల కోట్లకు చేరుకోగా.. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.6 లక్షల కోట్ల దగ్గరగా వచ్చేసింది. దీంతో కేవలం ఇన్వెస్టర్లు మాత్రమే కాదు, ఆ కంపెనీ అధినేతలు కూడా భారీగా లబ్ది పొందారు. 

ఫోర్బ్స్‌ అంచనాల ప్రకారం సోమవారం రిలయన్స్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముఖేష్‌ అంబానీ తన నికర సంపద మరో 1.1 బిలియన్‌ డాలర్లను చేర్చుకోగా.. భారతీ ఎంటర్‌ప్రైజ్‌ చైర్మన్‌ సునిల్‌ భారతీ మిట్టల్‌ 433 మిలియన్‌ డాలర్లను పెంచుకున్నారు. ఇరు కంపెనీల షేర్లు నేటి మార్కెట్‌లో భారీగా పెరగడంతో, కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌తో పాటు వారి సంపద కూడా పైకి ఎగిసింది. మొత్తంగా అంబానీ నికర సంపద 41.3 బిలియన్‌ డాలర్లు. మిట్టల్‌ సంపద 10.1 బిలియన్‌ డాలర్లు. ఒక్కరోజులోనే తమ సంపదను భారీగా పెంచుకున్న టాప్‌-3 గెయినర్లలో ఈ ప్రత్యర్థులున్నారు. నేటి మార్కెట్‌లో రిలయన్స్‌ షేర్లు 3 శాతానికి పైగా, ఎయిర్‌టెల్‌ షేర్లు 5 శాతం మేర జంప్‌ చేశాయి.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top