పరిశ్రమలు మళ్లీ ‘ప్లస్‌’లోకి..

Indian Industrial Sector Recorded A Growth Rate Of 1.8percentage - Sakshi

నవంబర్‌లో ఐఐపీ 1.8 శాతం వృద్ధి

మూడు నెలల తర్వాత క్షీణత నుంచి వృద్ధి బాటలోకి...

‘తయారీ’ రంగం రికవరీ

న్యూఢిల్లీ: భారత్‌ పారిశ్రామిక రంగం నవంబర్‌లో వెలుగురేఖలు చూసింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 1.8 శాతం వృద్ధిరేటును నమోదుచేసుకుంది. భారత్‌ పారిశ్రామిక రంగం మూడు నెలల తర్వాత వృద్ధిబాటలోకి రావడం గమనార్హం. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌లలో భారత్‌ పారిశ్రామిక రంగంలో అసలు వృద్ధినమోదుకాకపోగా, క్షీణ రేటు నెలకొంది. మొత్తం సూచీలో మెజారిటీ వాటా ఉన్న తయారీ రంగం కూడా క్షీణతలో నుంచి బయటపడ్డం మొత్తం గణాంకాలకు కొంత సానుకూలమైంది.

శుక్రవారం జాతీయ గణాంకాల కార్యాలయం విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... 
►2018 నవంబర్‌లో పారిశ్రామిక రంగం ఉత్పత్తి వృద్ధి రేటు కేవలం 0.2 శాతం. 
►సూచీలో దాదాపు 77 శాతం వెయిటేజ్‌ ఉన్న తయారీ రంగం 2.7 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. 2018 ఇదే నెలలో ఈ విభాగం అసలు వృద్ధిలేకపోగా –0.7 శాతం పడింది.  నవంబర్‌ తయారీ రంగంలోని మొత్తం 23 పారిశ్రామిక గ్రూపుల్లో 13 సానుకూల ఫలితాలనే ఇచ్చాయి.  
►విద్యుత్‌ రంగం విషయానికి వస్తే పరిస్థితి నిరాశాజనకంగా ఉంది. 2018 నవంబర్‌లో కనీసం 5.1 శాతం వృద్ధి నమోదయితే, 2019 ఇదే నెలలో అసలు వృద్ధిలేకపోగా –5 శాతం క్షీణత నమోదయ్యింది.  
►మైనింగ్‌ విషయంలో క్షీణ రేటు 1.7 శాతంగా ఉంది. అయితే ఈ రేటు 2018 నవంబర్‌లో పోల్చితే (–2.7 శాతం) తగ్గడం గమనార్హం.  
►భారీ యంత్రపరికరాలు, పెట్టుబడులను సూచించే క్యాపిటల్‌ గూడ్స్‌ విభాగంలో –8.6 శాతం క్షీణత నమోదుకావడం గమనార్హం. పైగా 2018 నవంబర్‌ క్షీణత స్థాయి (–4.1 శాతం) పెరగడం ఆందోళన కలిగించే అంశం.  
►ఎఫ్‌ఎంసీజీ  (కన్జూమర్‌ నాన్‌–డ్యూరబుల్‌ సెగ్మెట్‌) వస్తువుల విభాగంలో 2 శాతం స్వల్ప వృద్ధి (2018 నవంబర్‌లో –0.3 శాతం) నమోదయ్యింది. అయితే రిఫ్రిజిరేటర్లు, ఏసీల వంటి కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ విభాగంలో మాత్రం వృద్ధి నమోదుకాలేదు.

ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ వరకూ  
ఇక ఆర్థిక సంవత్సరం ప్రారంభం ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ వరకూ చూస్తే, వృద్ధి రేటు కేవలం 0.6 శాతంగా నమోదయ్యింది. 2018 ఇదే కాలంలో ఈ రేటు 5 శాతంగా ఉంది.

విధాన నిర్ణేతలకు ఊరట 
పారిశ్రామిక రంగం తాజా గణాంకాలు ఇటు మార్కెట్‌కు, అటు విధాన నిర్ణేతలకు కొంచెం ఊరటనిస్తాయి. క్యాపిటల్‌ గూడ్స్‌ విభాగంలో క్షీణత తగ్గుముఖం పడుతుండడం ఆశాజనకమైన అంశం.
–రుమ్‌కీ మజుందర్, ఆర్థికవేత్త, డెలాయిట్‌ ఇండియా

బేస్‌ ఎఫెక్ట్‌ మాత్రమే.. 
ఇప్పుడు కనిపించిన పారిశ్రామిక వృద్ధి రేటు కేవలం బేస్‌ ఎఫెక్ట్‌ మాత్రమే. 2018 ఇదే నెలల్లో అతి తక్కువ రేటు ప్రతిబింబమిది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి వరకూ (మార్చి) ఈ ఫలితాలు ఇలానే ఉండే వీలుంది.
–కరణ్, మహర్షి, యాక్యురేట్‌ రేటింగ్స్‌ అండ్‌ రిసెర్చ్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top