భారత్ దూసుకుపోతుంది.. | India to be star performer; China to slow down in 2016: PwC | Sakshi
Sakshi News home page

భారత్ దూసుకుపోతుంది..

Jan 11 2016 1:36 AM | Updated on Oct 4 2018 5:15 PM

భారత్ దూసుకుపోతుంది.. - Sakshi

భారత్ దూసుకుపోతుంది..

వర్థమాన దేశాల్లో భారత్ మంచి పనితీరు కనబరుస్తుందని, వృద్ధి విషయంలో చైనాను అధిగమిస్తుందని అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ తెలిపింది.

పీడబ్ల్యూసీ అంచనా
న్యూఢిల్లీ: వర్థమాన దేశాల్లో భారత్ మంచి పనితీరు కనబరుస్తుందని, వృద్ధి విషయంలో చైనాను అధిగమిస్తుందని అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ  పీడబ్ల్యూసీ తెలిపింది. ఈ ఏడాది భారత్ 7.7 శాతం వృద్ధిని సాధిస్తుందని, వరుసగా రెండో ఏడాది కూడా చైనాను దాటేస్తుందని  ఈ సంస్థ తాజా నివేదిక పేర్కొంది. అభివృద్ధి చెందుతున్న ఏడు (చైనా, భారత్, బ్రెజిల్, మెక్సికో, రష్యా, ఇండోనేషియా, టర్కీ)దేశాల్లో భారత్ మాత్రమే వేగంగా వృద్ధి సాధిస్తుందంటున్న ఈ నివేదిక వెల్లడించిన కొన్ని ముఖ్యాంశాలు..,
     
ఇటీవల సంస్కరణల ఫలాలు భారత్‌కు అందివస్తాయి. గత ఏడాది  ఆర్‌బీఐ రెపోరేటును 8 శాతం నుంచి 6.75 శాతానికి తగ్గించడం వల్ల వినియోగం జోరు పెరిగింది.  పెట్టుబడుల వృద్ధికి తోడ్పాటు అందింది. విదేశీ పెట్టుబడుల పరిమితిని పలు రంగాల్లో పెంచడం వల్ల అభివృద్ధి చెందని తయారీ రంగంలో విదేశీ పెట్టుబడులు పెరిగే అవకాశాలున్నాయి. అయితే ఆర్థికాంశాల కన్నా భౌగోళిక రాజకీయాంశాలకే విధాన నిర్ణేతలు అధిక ప్రాధాన్యత ఇస్తారు.
     
బ్రెజిల్, రష్యా ఆర్థిక వ్యవస్థల వృద్ధి క్షీణిస్తుంది.  చైనా వృద్ధి మందగమనంగా ఉంటుంది. ఈ వర్థమాన దేశాలు తమ ట్రెండ్ రేట్ కంటే తక్కువ వృద్ధినే సాధిస్తాయి. చైనా ఆర్థిక వృద్ధి 6.5 శాతానికి తగ్గుతుంది. తయారీ, ఎగుమతుల రంగాల్లో వృద్ధి క్రమక్రమంగా మందగిస్తుంది.
     
* 2010 నుంచి చూస్తే జీ 7 దేశాలు (అమెరికా, యూకే, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, కెనడా)వేగవంతమైన వృద్ధిని సాధిస్తాయి.
* ఈ ఏడాది అమెరికా రికవరీ జోరుగా ఉంటుంది. యునెటైడ్ కింగ్‌డమ్ వృద్ధి కూడా జోరుగానే ఉంటుంది.
* యూరోజోన్ సంక్షోభం ముగింపు ప్రారంభం ఈ ఏడాది ఉండొచ్చు.
* బ్రిక్స్ దేశాలకు ఈ ఏడాది కూడా క్లిష్టంగానే ఉంటుంది. భారత్ మాత్రం మినహాయింపు.
* యూరోప్‌లో వలస సమస్య, పశ్చిమాసియా సంక్షోభానికి అంతర్జాతీయ స్పందన, యూరోపియన్ యూనియన్‌లో యూకే సభ్యత్వంపై జరిగే రిఫరెండమ్.. ఈ అంశాలు వార్తల్లో ప్రముఖ స్థానాన్ని ఆక్రమిస్తాయి.
* దీర్ఘకాలం పాటు కమోడిటీ ధరలు తక్కువ స్థాయిలోనే ఉండొచ్చు. వీటిని దిగుమతి చేసుకునే దేశాలకు ఇది సంతోషాన్నిచ్చే వార్త కాగా, కమోడిటీలను ఎగుమతి చేసే దేశాలకు మాత్రం అశనిపాతమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement