భారత్‌లో ఆర్థిక మందగమనం

IMF calls for urgent action by India amid slowdown - Sakshi

తక్షణ చర్యలు అవసరం

భారత్‌కు ఐఎంఎఫ్‌ సూచన

విధానపరమైన చర్యలు తీసుకోవాలని సలహా

రుణ వృద్ధి, ప్రైవేటు వినియోగం బలహీనంగా ఉన్నాయని వ్యాఖ్య  

వాషింగ్టన్‌: భారత్‌లో ఆర్థిక మందగమన పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) అభిప్రాయపడింది. దీర్ఘకాల ఈ ధోరణిని అరికట్టడానికి కేంద్రం తక్షణం విధానపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు ఐఎంఎఫ్‌ డైరెక్టర్స్‌ నివేదిక వెలువరించిన అంశాలను సంస్థ ఆసియా, పసిఫిక్‌ శాఖలో భారత్‌ వ్యవహారాల చీఫ్‌ రానిల్‌ సల్‌గాడో విలేకరులకు తెలిపారు. దీని ప్రకారం– భారత్‌ ఆర్థిక రంగానికి సంబంధించి కొన్ని ముఖ్యాంశాలను చూస్తే...

► నిజానికి భారత్‌ ఇటీవలి సంవత్సరాల్లో భారీ ఆర్థిక విస్తరణ బా టలో ముందడుగు వేసింది. దీనితో లక్షలాది మంది పేదరికం నుంచి బయటపడ్డారు. అయితే 2019 సంవత్సరం నుంచీ దేశంలో ఆర్థిక వృద్ధి పూర్తి మందగమనంలో జారిన జాడలు సుస్పష్టమయ్యాయి. తగిన విధానపరమైన చర్యలు తీసుకోకపోతే, ఈ పరిస్థితి దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉంది.  

► అయితే భారీ వృద్ధి తర్వాత వచ్చే దిగువబాటగానే (సైక్లికల్‌) మేము ఈ పరిస్థితిని ఇంకా పరిగణిస్తున్నాం. వ్యవస్థాగతమైన ఇబ్బందులు కనబడ్డంలేదు. అయితే ఈ సైక్లికల్‌ ప్రతికూలతలను ఎదుర్కొనడానికి కూడా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి ఫైనాన్షియల్‌ రంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాలి.

► ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికం (జూలై–సెప్టెంబర్‌)లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు ఆరేళ్ల కనిష్టం 4.5 శాతానికి పడిపోయింది. దేశీయంగా ప్రైవేటు డిమాండ్‌లో కేవలం ఒక శాతం వృద్ధి రేటు నమోదయ్యిందని గణాంకాలు పేర్కొంటున్నాయి. పరిస్థితి చూస్తుంటే, డిసెంబర్‌ త్రైమాసికంలోనూ ప్రతికూల జీడీపీ గణాంకాలే వెలువడతాయని భావించాల్సి వస్తోంది.  

► బ్యాంకింగ్‌ యేతర ఆర్థిక సంస్థల్లో (ఎన్‌బీఎఫ్‌సీ) రుణ వృద్ధి లేకపోవడం, ఆదాయాల వృద్ధి ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో పడిపోవడం మొత్తంగా ప్రైవేటు వినియోగంపై కనబడుతోంది.  

► తగినంత వ్యాపార విశ్వాసం లేకపోవడం వల్ల బ్యాంకింగ్‌ రంగంలో రుణ వృద్ధి మందగమనం కొనసాగుతోంది.  

► వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) మంచి వ్యవస్థాగత సంస్కరణే అయినప్పటికీ, అమల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. వృద్ధి మందగమనంలో దీనిపాత్ర కూడా ఉండొచ్చనిపిస్తోంది.   

► బ్యాంకింగ్‌ రంగంలో మొండిబకాయిల సమస్య పరిష్కార దిశలో తగిన చర్యలు ఉండాలి.  

► ప్రస్తుతం 2019–20లో భారత్‌ జీడీపీ వృద్ధిరేటు 6.1% ఉంటుందని అంచనా. అంచనాల సవరణ నిర్ణయం జనవరిలో ఉంటుంది. గత వృద్ధి అంచ నాలను గణనీయంగా తగ్గించే అవకాశాలే ఉన్నా యి. ప్రస్తుతం వివిధ జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు భారత్‌ వృద్ధి అంచనాలను దాదాపు 5% దిగువనకు కుదించిన సంగతి తెలిసిందే.  

► భారత్‌ ఆర్థిక రంగానికి సంబంధించి కొన్ని సానుకూల అంశాలూ ఉన్నాయి. అందులో విదేశీ మారక నిల్వలు రికార్డు స్థాయిలో  ఉండడం ఒకటి. నవంబర్‌ 15తో ముగిసిన వారంలో 441 మిలియన్‌ డాలర్ల పెరుగుదలతో 448.249 బిలియన్‌ డాలర్లకు ఎగశాయి. దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసం కరెంట్‌ అకౌంట్‌ లోటు కూడా కట్టడిలోనే ఉంది. కూరగాయల ధరల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణం ఇటీవల కట్టుతప్పినప్పటికీ, గడచిన కొన్ని సంవత్సరాలుగా పూర్తి నియంత్రణలో ఉంది. కార్పొరేట్‌ పన్ను రేటును 30 నుంచి 15 శాతానికి తగ్గించడమూ సానుకూలాంశమే. ఇన్ని చర్యలు ఉన్నా... ఆర్థిక మందగమనం ఆశ్చర్యకరమే. అందువల్ల ఈ మందగమనాన్ని ఆర్థిక సంక్షోభంగా అభివర్ణించలేం.  

► కార్మిక, భూ, ప్రొడక్ట్‌ మార్కెట్‌ వంటి విభాగాల్లో భారత్‌ సంస్కరణలు తీసుకురావాలని ఐఎంఎఫ్‌ భావిస్తోంది. అలాగే మార్కెటింగ్‌లో ప్రత్యేకించి అంతర్జాతీయంగా పోటీతత్వాన్ని ఎదుర్కొనేందుకూ చర్యలు అవసరం. ఇక విద్యా, ఆరోగ్యం వంటి కీలక రంగాల్లోనూ సంస్కరణలు అవసరం.  

► అయితే ఇక్కడ ఒక అంశాన్ని ఐఎంఎఫ్‌ విశ్వసిస్తోంది.  ప్రస్తుతం భారత్‌ ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం) సమస్యను ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థకు ఉద్దీపనలు ప్రకటించడానికి పరిమితులు ఉన్నాయి. 2019– 20 ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఈ పరిమాణం రూ.7.03 లక్షల కోట్లుగా ఉండాలన్నది (జీడీపీలో 3.3 శాతం) బడ్జెట్‌ లక్ష్యం. కానీ అక్టోబర్‌ ముగిసే నాటికే ఈ మొత్తం రూ.7,20,445 కోట్లకు చేరింది. ద్రవ్యలోటు కట్టడికి తగిన చర్యలపై దృష్టి పెట్టాలి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top