చిన్నారులకు మీరిచ్చే కానుక

HDFC Children Gift Funds Scheme - Sakshi

హెచ్‌డీఎఫ్‌సీ చిల్ట్రన్స్‌ గిఫ్ట్‌ ఫండ్‌  

చిన్నారుల భవిష్యత్తు అవసరాల కోసం ఓ నిధి ఏర్పాటు చేసుకోవాలని భావించే వారు పరిశీలించతగిన పథకాల్లో హెచ్‌డీఎఫ్‌సీ చిల్డ్రన్స్‌ గిఫ్ట్‌ ఫండ్‌ కూడా ఒకటి. సెబీ సొల్యూషన్‌ ఓరియంటెడ్‌ ఫండ్స్‌ విభాగంలోకి ఇది వస్తుంది. గతంలో ఈ తరహా పథకాల్లో మూడేళ్ల పాటు లాకిన్‌ పీరియడ్‌ ఉండేది. ఇటీవల సెబీ మ్యూచువల్‌ ఫండ్స్‌ కేటగిరీల పునర్‌వ్యవస్థీకరణ తర్వాత... ఈ పథకంలో లాకిన్‌ అన్నది ఐదేళ్లకు పెరిగింది. దీంతో పెట్టుబడులను వెనక్కి తీసేసుకుండా దీర్ఘకాలం పాటు కొనసాగించడం ద్వారా లక్ష్య సాధనకు ఉపయోగపడుతుంది. మోస్తరు రిస్క్‌ భరించగలిగే వారికి హెచ్‌డీఎఫ్‌సీ చిల్ట్రన్స్‌ గిఫ్ట్‌ ఫండ్‌ అనుకూలమని చెప్పొచ్చు. 

రాబడులు..: ఇది ఈక్విటీ ఆధారిత హైబ్రిడ్‌ ఫండ్‌ వంటిది. డెట్‌ సాధనాల్లో, ఈక్విటీలోనూ ఇన్వెస్ట్‌ చేస్తుంది. ఈక్విటీల్లో 65–70 శాతం వరకు పెట్టుబడులు పెడుతుంది. ఏడాది కాలంలో ఈ పథకం పనితీరు 0.4 శాతం మైనస్‌లో ఉంటే, ఈ కేటగిరీ రాబడులు 1.8 శాతం ప్రతికూలంగా ఉన్నాయి. ఇక మూడేళ్ల కాలంలో ఈ పథకం 11.4 శాతం చొప్పున వార్షిక రాబడులను, ఐదేళ్ల కాలంలో వార్షికంగా 16.3 శాతం చొప్పున రాబడులను ఇచ్చింది. మూడేళ్లు, ఐదేళ్ల కాలంలో ఈ కేటగిరీ రాబడులు 9.4 శాతం, 14.6 శాతమే ఉండటం గమనార్హం. మైనర్‌ పేరిటే (18 ఏళ్ల లోపు) ఈ పథకంలో ఇన్వెస్ట్‌ చేయడానికి అవకాశం ఉంటుంది. సంబంధిత చిన్నారి తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకుడి పేరిట వ్యక్తిగత ప్రమాద బీమా కూడా ఇందులో లభిస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రీమియం చెల్లించక్కర్లేదు. ఫండ్స్‌ యూనిట్లు ఎన్నున్నాయో వాటి విలువకు పది రెట్లు, గరిష్టంగా రూ.10 లక్షల వరకు ఈ బీమా ఉంటుంది. అస్థిరతల రిస్క్‌ను తగ్గించుకునేందుకు సిప్‌ ద్వారా ఇందులో ఇన్వెస్ట్‌ చేసుకోవడం అనుకూలం. 

పనితీరు విధానం..: ఈ పథకం ఈక్విటీ, డెట్‌ రెండింటిలోనూ ఇన్వెస్ట్‌ చేయడం వల్ల రిస్క్‌ తగ్గుతుంది. ఒక విభాగం పనితీరు తగ్గినా మరో విభాగం పనితీరు ఆదుకుంటుంది. పైగా ఈక్విటీల్లోనూ లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. దాదాపు 60 శాతం పెట్టుబడులు లార్జ్‌క్యాప్‌లోనే పెడుతుంది. 2011 మార్కెట్‌ పతనంలో సెన్సెక్స్‌ 24 శాతం నష్టపోతే, ఈ పథకం నష్టాలను 7 శాతానికే పరిమితం చేయడం గమనించాల్సిన విషయం. మార్కెట్‌ ర్యాలీల్లో కొంత మేర పెట్టుబడులను విక్రయించి నగదు నిల్వలను పెంచుకుంటుంది. తద్వారా కరెక్షన్‌లో ఇన్వెస్ట్‌ చేయడానికి నిల్వలను పెంచుకుంటుంది. 2014 ఈక్విటీ, డెట్‌ విభాగాలు ర్యాలీ చేసిన సంవత్సరం. ఆ ఏడాది ఈ పథకం రాబడులు ఏకంగా 43 శాతం స్థాయిలో ఉన్నాయి. పదేళ్ల కాలంలో చూసుకున్నా వార్షిక రాబడులు 19 శాతంగా ఉన్నాయి. ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో 60 స్టాక్స్‌ వరకు ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, రిలయన్స్‌ మినహా మిగిలిన స్టాక్స్‌లో పెట్టుబడులు 3 శాతం, అంతకంటే తక్కువే ఉన్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top