
విశాఖపట్నం: ఎలక్ట్రికల్ ఉపకరణాల రంగంలోని ప్రముఖ కంపెనీ హావెల్స్ తొలిసారిగా అత్యాధునిక పరిజ్ఞానంతో కూడిన నీటి శుద్ధి పరికరాలను (వాటర్ ప్యూరిఫయర్) మార్కెట్లోకి విడుదల చేసింది. నీటిలోని పీహెచ్ సమతుల్యతను కాపాడుతూనే రివర్స్ ఆస్మోసిస్ (ఆర్వో) విధానంలో కోల్పోయిన ఖనిజాలను తిరిగి చేర్చే సామర్థ్యం ఈ పరికరాలకు ఉన్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
ఈ ఉత్పత్తులను విశాఖ మార్కెట్లో ఆవిష్కరించిన సందర్భంగా హావెల్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ శశాంక్ శ్రీవాత్సవ్ మాట్లాడుతూ... క్రిమిసంహారకాలు, పారిశ్రామిక కాలుష్యాలను సమర్థవంతంగా తొలగించే విధంగా వీటిని రూపొందించినట్టు చెప్పారు. నీటి నాణ్యతను వాటంతట అవే గుర్తించి సురక్షిత, ఆరోగ్యకరమైన నీటిని అందిస్తాయని చెప్పారు. వీటి ధరలు రూ.10,499 నుంచి రూ.23,999 మధ్య ఉంటాయని, రానున్న 3–4 ఏళ్లలో వాటర్ ప్యూరిఫయర్ మార్కెట్లో 10 శాతం వాటాను లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు.