
న్యూఢిల్లీ: నీటి శుద్ధి యంత్రాలు (water purifiers), వాటి ఫిల్టర్లు, సంబంధిత సేవలపై ప్రస్తుతం ఉన్న 18% జీఎస్టీని 5%కి తగ్గించాలని వాటర్ క్వాలిటీ ఇండియా అసోసియేషన్ (WQIA) కోరింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఒక లేఖ రాసింది. నీటి శుద్ధి యంత్రాలను సామాన్యులకు మరింత అందుబాటులోకి తీసుకురావడమే దీని వెనుక ముఖ్య ఉద్దేశమని ఆ లేఖలో పేర్కొంది. సురక్షితమైన తాగునీటిని విలాసవంతమైన వస్తువుగా కాకుండా నిత్యావసర వస్తువుగా పరిగణించాలని కోరింది.
లేఖలోని ప్రధాన అంశాలు
నీటి శుద్ధి యంత్రాలపై 18% జీఎస్టీ విధించడం వల్ల అవి ఎయిర్ కండిషనర్లు, కార్ల మాదిరిగా అధిక పన్ను పరిధిలోకి వస్తున్నాయి. అయితే, ఇవి ప్రజల ఆరోగ్యానికి అత్యంత అవసరం అని వాటర్ క్వాలిటీ ఇండియా అసోసియేషన్ వాదించింది.
దేశంలో ఎలక్ట్రిక్ వాటర్ ప్యూరిఫైయర్లను ఉపయోగించే కుటుంబాల శాతం కేవలం 6% మాత్రమే ఉందని, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఇది దాదాపు 20%గా ఉందని గుర్తు చేసింది. అధిక జీఎస్టీ రేటు తక్కువ, మధ్య ఆదాయ వర్గాల ప్రజలకు వీటిని కొనేందుకు అడ్డంకిగా మారిందని తెలిపింది.
20 లీటర్ల వాటర్ జార్‌లపై ప్రస్తుతం 12% జీఎస్టీ ఉన్నప్పటికీ, అది 5%కి తగ్గించవచ్చని భావిస్తున్నారు. అదే సమయంలో నీటి శుద్ధి యంత్రాలపై పన్ను 18% వద్దే ఉండటం విధానపరమైన వైరుధ్యాన్ని సృష్టిస్తుందని అసోసియేషన్ పేర్కొంది.