
న్యూఢిల్లీ: ప్రైవేట్ బ్యాంకుల్లో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అనుమతించే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. అలాగే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కూడా ఎఫ్‌డీఐల పరిమితిని ప్రస్తుతమున్న 20 శాతం నుంచి 49 శాతానికి పెంచాలని కూడా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థిక శాఖ, పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం (డీఐపీపీ), ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
ప్రస్తుతం ప్రైవేట్ బ్యాంకుల్లో ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా ఆమోదం తీసుకోవాల్సిన అవసరం లేకుండా 49 శాతం దాకా ఎఫ్‌డీఐలకు అనుమతి ఉంది. అంతకు మించితే 74 శాతం దాకా చేసే పెట్టుబడులకు ప్రభుత్వ అనుమతి కావాల్సి ఉంటోంది. బ్యాంకింగ్ రంగంలో ఎఫ్‌డీఐ పరిమితులను పెంచడం వల్ల బ్యాంకులు సర్వీసులను మెరుగుపర్చుకోవడానికి, కనీస మూలధన అవసరాల నిబంధనలను పాటించడానికి తోడ్పడగలదని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి.