గోల్డ్‌‘లోనే’ అయోమయం!

గోల్డ్‌‘లోనే’ అయోమయం!


♦ తగ్గుతున్న ధరపై రుణ కంపెనీల ఆందోళన

♦ కొత్త రుణాల కంటే పాక్షిక రుణ వసూళ్లపై దృష్టి

♦ గ్రాముకు రూ. 300 నుంచి రూ.400 తగ్గిన రుణ మొత్తం

♦ ధర సమీక్ష గడువు వారానికి కుదింపు

♦ నేల చూపులు చూస్తున్నగోల్డ్ లోన్ కంపెనీల షేర్లు

 

 తగ్గుతున్న షేర్ల ధరలు

 తగ్గుతున్న బంగారం ధరలు కంపెనీల లాభాల మార్జిన్లపై ఒత్తిడి పెంచుతున్నాయి. దీంతో ఈ రంగంలో ఉన్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల షేర్ల ధరలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. గత పది రోజుల్లో ఎన్‌బీఎఫ్‌సీ షేర్లు 15 నుంచి 20 శాతం నష్టపోయాయి. ముత్తూట్ ఫైనాన్స్ షేరు 19 శాతం, మణప్పురం 17 శాతం, ఐఐఎఫ్‌ఎల్ 15 శాతం చొప్పున నష్టపోయాయి.

 

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పడుతుండటమే కాక... ఇంకా తగ్గుతాయన్న అంచనాలు గోల్డ్ లోన్ వ్యాపారస్తులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌తో పోలిస్తే దేశీ మార్కెట్లో ఇంకా అంతగా తగ్గలేదు. అయితే మరింత తగ్గవచ్చనే విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగా... ఆభరణాలను తనఖా పెట్టుకొని అప్పులిచ్చే సంస్థలు ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా కొత్తగా ఇచ్చే రుణాల్లో లోన్ టు వేల్యూ (ఎల్‌టీవీ) విలువను భారీగా తగ్గించేశాయి.



గతంలో ప్రభుత్వరంగ బ్యాంకుల కంటే గ్రాముకు రూ.300 నుంచి రూ.400 అదనంగా ఇచ్చిన ప్రైవేటు సంస్థలు ఇప్పుడు ఆ ప్రీమియాన్ని తగ్గించేశాయి. మొన్నటి వరకు 22 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన గ్రాము బంగారంపై రూ.2,000 నుంచి రూ. 1,900 వరకు రుణమిచ్చే వారమని, ఇప్పుడు గరిష్టంగా రూ.1,650కి మించి ఇవ్వడం లేదని ప్రైవేటు గోల్డ్‌లోన్ సంస్థల ప్రతినిధులు చెప్పారు. బంగారం విలువలో 75 శాతానికి మించి ఇవ్వకూడదన్న నిబంధనను తు.చ. తప్పకుండా పాటించాలని ప్రైవేటు సంస్థలు  దిగువ ఉద్యోగులకు ఆదేశాలను జారీ చేశాయి.



అంతేకాకుండా ఇప్పటికే అధిక మొత్తానికి రుణాలిచ్చిన వారి నుంచి విలువ తగ్గిన మేరకు పాక్షికంగా కొంత మొత్తాన్ని వసూలు చేస్తున్నాయి. ఇప్పటికే పలు ఖాతాదారులకు సమాచారమివ్వడమే కాకుండా తగ్గిన విలువను కట్టించుకున్నట్లు ప్రైవేటు గోల్డ్‌లోన్ సంస్థల ప్రతినిధులు పేర్కొంటున్నారు. గతంలో నెల రోజులకు ఒకసారి ఎల్‌టీవీ విలువను లెక్కించే వారమని, మారిన పరిస్థితుల్లో ఇప్పుడు వారానికి ఒకసారి లెక్కిస్తున్నామని వారు తెలియజేశారు.



అలాగే కొత్త రుణాలను చాలా స్వల్పకాలానికే మంజూరు చేస్తున్నట్లు ఓ ప్రైవేటు సంస్థ ప్రతినిధి చెప్పారు. ప్రభుత్వరంగ బ్యాంకులు మాత్రం ఇంత వరకు ఎల్‌టీవీ విలువను సవరించలేదు. పీఎస్‌యూ బ్యాంకులు గ్రాముకు రూ. 1,600 నుంచి రూ. 1,700 వరకు మాత్రమే ఇస్తున్నాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు బాగా తగ్గడంతో త్వరలోనే ఎల్‌టీవీ విలువను సవరించనున్నట్లు ప్రభుత్వరంగ బ్యాంక్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top