
సాక్షి, న్యూఢిల్లీ: కొత్త ఏడాది కార‍్ల కొనుగోలుదారులపై అధిక భారం పడనుంది. పలు కార్ల కంపెనీలు జనవరి నుంచి ధరలను పెంచేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. ముడిపదార్ధాల ధరలు పెరగడంతో ఆ భారాన్ని వినియోగదారులపై మోపేందుకు కసరత్తు చేస్తున్నాయి. తాజాగా జనవరి నుంచి తమ కార్ల మోడల్స్ ధర 4 శాతం వరకూ పెరుగుతుందని ఫోర్డ్ ఇండియా వెల్లడించింది.
కమోడిటీ ధరలతో పాటు ముడిపదార్ధాల ధరలు, రవాణా వ్యయం పెరగడంతో కార్ల ధరల పెంపు అనివార్యమైందని ఫోర్డ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ్ రైనా పేర్కొన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన న్యూ ఫోర్డ్ ఎకో స్పోర్ట్ సహా అన్ని ఫోర్డ్ ప్రోడక్ట్‌ల ధరలు పెరుగుతాయని చెప్పారు.
భారత్‌లో ఫోర్డ్ ప్రస్తుతం రూ 4.8 లక్షల విలువైన ఫిగో నుంచి ఐకానిక్ స్పోర్ట్స్ కార్ మస్టాంగ్ (రూ 71.62 లక్షలు)వరకూ పలు కార్లను విక్రయిస్తోంది.