ఫలితాలు, గణాంకాలపై దృష్టి | Focus on results and statistics | Sakshi
Sakshi News home page

ఫలితాలు, గణాంకాలపై దృష్టి

Jan 8 2018 1:56 AM | Updated on Jan 8 2018 1:56 AM

Focus on results and statistics - Sakshi

టీసీఎస్, ఇన్ఫోసిస్‌ వంటి ఐటీ దిగ్గజాల ఫలితాల ప్రభావం ఈ వారం స్టాక్‌ మార్కెట్‌పై ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ కంపెనీల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఫలితాలతో పాటు పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా స్టాక్‌ సూచీల గమనాన్ని నిర్దేశిస్తాయని వారంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం, డాలర్‌తో రూపాయి మారకం, ప్రపంచ మార్కెట్ల పోకడ, విదేశీ, దేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల సరళి కూడా తగిన ప్రభావం చూపుతాయి.

  ఈ నెల 11న(గురువారం) టీసీఎస్, 12(శుక్రవారం)న ఇన్ఫోసిస్‌ క్యూ3 ఫలితాలు వెల్లడవుతాయి. ఈ నెల 12న నవంబర్‌ నెలకు సంబంధించిన పారిశ్రామికోత్పత్తి గణాంకాలు వస్తాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో 4.1 శాతంగా ఉన్న ఐఐపీ గత ఏడాది అక్టోబర్‌లో 2.2 శాతానికి తగ్గింది. ఈ నెల 12న డిసెంబర్‌ నెలకు సంబంధించిన రిటైల్‌ ద్రవ్యోల్బణ గణాంకాలు వెల్లడవుతాయి. గత ఏడాది అక్టోబర్‌లో 3.58 శాతంగా ఉన్న రిటైల్‌ ద్రవ్యోల్బణం గత ఏడాది నవంబర్‌లో 13 నెలల గరిష్ట స్థాయి, 4.88 శాతానికి పెరిగింది. 

ప్రీమియమ్‌ వ్యాల్యూయేషన్‌...
స్టాక్‌ మార్కెట్లోకి పెట్టుబడులు భారీగా వస్తుండడం, కంపెనీల క్యూ3 ఫలితాలు బాగా ఉంటాయనే అంచనాలు, సానుకూల అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో మార్కెట్‌ ప్రీమియమ్‌ వ్యాల్యూయేషన్‌తో ట్రేడవుతోందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. బడ్జెట్‌ సంబంధిత సంకేతాలు, క్యూ3 ఫలితాలను బట్టే సమీప భవిష్యత్తులో మార్కెట్‌ గమనం ఉంటుందని ఆయన అంచనా వేస్తున్నారు. ఆర్థిక ఫలితాల సీజన్‌ ప్రారంభమైనందున అందరి కళ్లు టీసీఎస్, ఇన్ఫోసిస్‌ల ఫలితాలు, గైడెన్స్‌లపైనే ఉంటుందని ఎపిక్‌ రీసెర్చ్‌ సీఈఓ ముస్తఫా నదీమ్‌ చెప్పారు.


మార్కెట్‌ ప్రభావిత అంశాలు
తేదీ    విషయం
11    టీసీఎస్‌ క్యూ3 ఫలితాలు
12    ఇన్ఫోసిస్‌ క్యూ3 ఫలితాలు  
        నవంబర్‌ ఐఐపీ గణాంకాలు
        డిసెంబర్‌ రిటైల్‌ ద్రవ్యోల్బణం

డెట్‌ మార్కెట్లోకి రూ.1.49 లక్షల కోట్లు 
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు గత ఏడాది డెట్‌ మార్కెట్లో రూ.1.49 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారు. 2016లో కేవలం 43,645 కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయి. బాండ్ల రాబడులు బాగా ఉండడం, కరెన్సీ నిలకడగా ఉండడంతో డెట్‌మార్కెట్లో గత ఏడాది భారీగా విదేశీ పెట్టుబడులు వచ్చాయని నిపుణులు పేర్కొన్నారు. 

అయితే గత ఏడాది స్థాయిలో ఈ ఏడాది డెట్‌మార్కెట్లోకి పెట్టుబడులు రాకపోవచ్చని వారంటున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో రేట్లు పెరుగుతుండడం,  లిక్విడిటీ ఉపసంహరణ దీనికి కారణాలని వివరించారు.  ఇక ఈక్విటీ మార్కెట్లో గత ఏడాది ఎఫ్‌పీఐల పెట్టుబడులు రూ.51,000 కోట్లుగా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement