ఎగ్జిట్‌పోల్స్ అంచనాల్ని మించి ఎన్‌డీఏ భారీ మెజారిటీ సాధించడం, స్వయంగా బీజేపీయే 282 సీట్లు సాధించడంతో మార్కెట్ సైతం సాంకేతిక, ఫండమెంటల్ విశ్లేషకుల అంచనాల్ని మించి ర్యాలీ జరిపింది.
మార్కెట్ పంచాంగం
ఎగ్జిట్‌పోల్స్ అంచనాల్ని మించి ఎన్‌డీఏ భారీ మెజారిటీ సాధించడం, స్వయంగా బీజేపీయే 282 సీట్లు సాధించడంతో మార్కెట్ సైతం సాంకేతిక, ఫండమెంటల్ విశ్లేషకుల అంచనాల్ని మించి ర్యాలీ జరిపింది. ఇదే సమయంలో నగదు టర్నోవర్ పెరగడం, సూచీల్లో భాగమైన ఎక్కువశాతం షేర్లు రికార్డుస్థాయిల్ని చేరడం వల్ల భారత్ స్టాక్ మార్కెట్ దీర్ఘకాలానికి బుల్లిష్‌గా మారినట్లు పరిగణించవచ్చు. రెండు వారాలపాటు వేగవంతమైన ర్యాలీ జరిగిన కారణంగా స్వల్పకాలంలో చిన్నపాటి సర్దుబాటు జరిగినా, మార్కెట్ పతనమయ్యే అవకాశమైతే లేదు.
2009 మే నెలలో సైతం అప్పటి ఎన్నికల్లో అంచనాల్ని మించి యూపీఏ విజయం సాధించినపుడు రెండు రోజుల్లో 22% ర్యాలీ మార్కెట్లో జరిగింది. అటుతర్వాత రెండువారాల్లో 9% వరకూ కరెక్షన్ జరిగింది. ఆ సర్దుబాటుతర్వాత 8-9 నెలలకాలంలో సూచీలు 50 శాతం ర్యాలీ చేసాయి. దాదాపు అదేతరహాలో వచ్చే కొద్దివారాలు, కొద్దినెలల్లో మార్కెట్ కదలవచ్చు.
సెన్సెక్స్ సాంకేతికాంశాలు...
మే 16తో ముగిసినవారం రెండోరోజున ఎగ్జిట్ పోల్ ఫలితాలతో మొదలైన ర్యాలీ చివరిరోజున ఎన్నికల ఫలితాల ప్రభావంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 25,375 పాయింట్ల రికార్డు గరిష్టస్థాయిని చేరింది. చివరకు క్రితంవారంతో పోలిస్తే 1,128పాయింట్ల భారీలాభంతో 24,122 పాయింట్ల వద్ద ముగిసింది. శుక్రవారం లాభాల స్వీకరణ ఫలితంగా రికార్డుస్థాయి నుంచి భారీ ట్రేడింగ్ పరిమాణంతో 4 శాతంపైగా పడిపోయినందున, రానున్న రోజుల్లో 25,375 పాయింట్ల స్థాయి సెన్సెక్స్‌ను గట్టిగా నిరోధించవచ్చు.
ఈ స్థాయిని దాటేంతవరకూ ఒక పరిమితశ్రేణిలో సూచీ కదలవచ్చు. ఈ వారం సైతం పాజిటివ్ ట్రెండ్ కొనసాగితే సెన్సెక్స్ తొలుత 24,500 స్థాయికి పెరగవచ్చు. ఆపైన 24,700 స్థాయి లక్ష్యంగా ప్రయాణించవచ్చు. ఈ వారం కరెక్షన్ మొదలైతే 23,873 పాయింట్ల స్థాయి వద్ద తొలి మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును కోల్పోతే క్రమేపీ 23,308 స్థాయి వద్దకు (ఫిబ్రవరి 4నాటి కనిష్టస్థాయి 19,963 పాయింట్ల కనిష్టం నుంచి 25,375 గరిష్టంవరకూ జరిగిన 5,412 పాయింట్ల ర్యాలీలో 38.2 శాతం రిట్రేస్‌మెంట్ స్థాయి ఇది) తగ్గవచ్చు. ఈ స్థాయిని ముగింపులో కోల్పోతే 22,720 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు.
నిఫ్టీ తక్షణ మద్దతు 7,130
గత మార్కెట్ పంచాంగంలో సూచించినరీతిలో మే 9తో ముగిసినవారంలో 7,200 పాయింట్ల స్థాయిని ఛేదించిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ అనూహ్యంగా 7,563 పాయింట్ల రికార్డుస్థాయికి పరుగులు తీసింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 344 పాయింట్ల భారీలాభంతో 7,203 వద్ద క్లోజయ్యింది. శుక్రవారం పెద్ద ర్యాలీ జరిగిన సమయంలో 7,000, 7,200 స్ట్రయిక్స్ వద్ద భారీ పుట్ రైటింగ్, 7,400-7,500 స్ట్రయిక్స్ వద్ద పెద్ద ఎత్తున కాల్ రైటింగ్ జరిగినందున, ఈవారం ఆయా స్థాయిల మధ్య నిఫ్టీ హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చు. అధికస్థాయిలో పుట్ బిల్డప్ 7,000 స్ట్రయిక్ వద్ద, కాల్ బిల్డప్ 7,500 స్ట్రయిక్ వద్ద వుంది.
ఇక టెక్నికల్ చార్టుల ప్రకారం సమీప భవిష్యత్తులో నిఫ్టీ 7,330 సమీపంలో తొలి నిరోధాన్ని చవిచూడవచ్చు. ఆపైన ముగిస్తే 7,450 పాయింట్ల స్థాయివరకూ ర్యాలీ సాగించే ఛాన్స్ వుంటుంది. తొలి నిరోధాన్ని అధిగమించలేకపోతే 7,130 సమీపంలో తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతు దిగువన ముగిస్తే క్రమేపీ 6,941 పాయింట్ల స్థాయికి (ఫిబ్రవరి 4 నుంచి మే 16 వరకూ జరిగిన 1,630 పాయింట్ల ర్యాలీకి ఇది 38.2% రిట్రేస్‌మెంట్ స్థాయి) తగ్గవచ్చు. ఈ స్థాయిని కూడా కోల్పోతే 6,780 పాయింట్ల వద్దకు పతనమయ్యే ప్రమాదం వుంటుంది.