మళ్లీ ‘క్యాషే’ కింగ్‌!

Fastest growing UPI transactions - Sakshi

పెరిగిన నగదు వాడకం

మళ్లీ నోట్ల రద్దుకు ముందటి పరిస్థితి

క్రెడిట్‌ కార్డులతో చెల్లింపులకు మొగ్గు

డెబిట్‌ కార్డులతో తగ్గిన చెల్లింపులు

వేగంగా పెరుగుతున్న యూపీఐ లావాదేవీలు

2023 నాటికి డిజిటల్‌ లావాదేవీల్లో సగం యూపీఐవే  

న్యూడిల్లీ: దేశవ్యాప్తంగా మళ్లీ నగదు చలామణి పెరుగుతోంది. ప్రజలు నగదు వినియోగానికి... లేదంటే క్రెడిట్‌ కార్డుల వైపు మొగ్గు చూపుతున్నారు. చిన్న కొనుగోళ్లకు నగదు చెల్లించే సంప్రదాయ అలవాటుకే తిరిగి వారు మళ్లుతున్నారు. కేంద్ర సర్కారు 2016 నవంబర్‌ 8న పెద్ద నోట్లను రద్దు చేసిన తరవాత డిజిటల్‌ లావాదేవీలు పెరగటం తెలిసిందే.

పెద్ద నోట్లను రద్దు చేయడం వెనుక ‘క్యాష్‌ లెస్‌ ఎకానమీ’గా (తక్కువ నగదు వినియోగం కలిగిన ఆర్థిక వ్యవస్థ) మార్చాలన్న ఆశయాన్ని కేంద్ర ప్రభుత్వం వినిపించింది. కానీ, డీమోనిటైజేషన్‌ తర్వాత తొలి నాళ్లలో నగదు కొరత కారణంగా డిజిటల్‌ చెల్లింపులను ఆశ్రయించిన ప్రజలు... ఇప్పుడు పాత విధానాలకే ప్రాధాన్యమిచ్చే పరిస్థితులు వచ్చేశాయి.

గత ఆర్థిక సంవత్సరం క్రెడిట్, డెబిట్‌ కార్డు లావాదేవీలను విశ్లేషించినప్పుడు ఈ వివరాలు వెల్లడయ్యాయి. నోట్ల రద్దుకు ముందున్న స్థాయికి నగదు అందుబాటులోకి రావటం దీనికి వీలు కల్పించినట్టు చెప్పుకోవాలి. ఈ ఏడాది మే 25 నాటికి వ్యవస్థలో రూ.18.5 లక్షల కోట్ల నగదు చలామణిలో ఉందని అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

యూపీఐ, ఇతర సాధనాల రాక...
2016 నవంబర్‌లో పెద్ద నోట్లను రద్దు చేశాక డెబిట్‌ కార్డు చెల్లింపులు ఎక్కువగా జరిగాయి. చలామణిలో ఉన్న 85 శాతం నగదు (అన్నీ రూ.500, రూ.1,000 నోట్ల రూపంలో ఉన్నది) చెల్లుబాటు కాకుండా పోవడమే ఇందుకు కారణం. దేశంలో మొత్తం కార్డు చెల్లింపుల్లో 96 శాతం డెబిట్‌ కార్డుల ద్వారానే జరిగాయి. క్రెడిట్‌ కార్డుల వాటా 4 శాతం. అయితే, అదేమంత కాలం కొనసాగలేదు. గతేడాది ఆగస్ట్‌లో క్రెడిట్‌ కార్డు లావాదేవీలు డెబిట్‌ కార్డు లావాదేవీలను మించేశాయి.

వ్యవస్థలోకి నగదు సరఫరా మెరుగు పడుతూ వచ్చింది. ఈ ఏడాది మార్చి మాసంలో క్రెడిట్‌ కార్డు లావాదేవీల విలువ 15 నెలల గరిష్ట స్థాయికి చేరి రూ.44,308 కోట్లుగా నమోదైంది. అదే నెలలో డెబిట్‌ కార్డు చెల్లింపుల విలువ రూ.41,857 కోట్లకు పరిమితమైనట్లు ఆర్‌బీఐ తాజా గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. 2017 డిసెంబర్‌ నాటికి చలామణిలో రూ.7.8 లక్షల కోట్ల నగదు ఉండగా, 2018 మే నాటికి రూ.18.5 లక్షల కోట్లకు పెరిగింది.

అయితే, షాపుల వద్ద మొబైల్‌ ఆధారిత చెల్లింపులు పెరగడం కూడా డెబిట్‌కార్డు లావాదేవీల విలువ తగ్గడానికి కారణంగా బ్యాంకర్లు పేర్కొంటున్నారు. ఇక యూపీఐ ఆధారిత లావాదేవీలు గతేడాది ఇదే కాలంలో 9 లక్షలుగా ఉంటే, ఈ ఏడాది మే నెలలో 18.9 కోట్ల లావాదేవీలకు పెరగటం కూడా డెబిట్‌ కార్డు లావాదేవీలు తగ్గడానికి కారణంగా భావించొచ్చు.

నగదు లభ్యత పెరగడం వల్లే...
నోట్ల రద్దు తర్వాత తీసుకున్న చర్యలు అమలు కాలేదని, దీంతో పూర్వపు స్థితి వచ్చేసిందని డిజిటల్‌ పేమెంట్‌ కంపెనీల సంఘం ‘పేమెంట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా’ చైర్మన్‌ నవీన్‌సూర్య తెలిపారు. ‘‘నగదుకు కొరత ఉన్నప్పుడు మరో మార్గం లేక సాధారణ కొనుగోళ్లకు వారు డెబిట్‌ కార్డులు వినియోగించారు. ఇప్పుడు మళ్లీ పాత విధానానికే మళ్లారు’’ అని సూర్య వివరించారు.

చాలా మంది డెబిట్‌ కార్డుల కంటే క్రెడిట్‌ కార్డుల వినియోగానికే ప్రాధాన్యం ఇస్తున్నారని... డెబిట్‌ కార్డులు నేరుగా బ్యాంకు ఖాతాతో అనుసంధానమైనవి కనుక, వాటిని అధిక రిస్క్‌ ఉన్నవాటిగా పరిగణించడమే ఇందుకు కారణమని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. అయితే, దేశంలో 86.1 కోట్ల డెబిట్‌ కార్డులుంటే, వినియోగంలో ఉన్న క్రెడిట్‌ కార్డుల సంఖ్య కేవలం 3.7 కోట్లు కావడం గమనార్హం.

చిన్న దుకాణాలకు కార్డు స్వైప్‌ల కోసం పాయింట్‌ ఆఫ్‌ సేల్స్‌ టర్మినల్స్‌ అందించే ఎంస్వైప్‌ కంపెనీ వ్యవస్థాపకుడు మనీష్‌ పటేల్‌ స్పందిస్తూ... దేశంలోని మొత్తం కార్డుల్లో క్రెడిట్‌ కార్డులు 4 శాతమే ఉన్నప్పటికీ, వీటి ద్వారా జరిగే లావాదేవీల విలువ మొత్తం చెల్లింపుల్లో 51 శాతం మేర ఉంటుందని తెలియజేశారు.

నగదు వినియోగమనేది జనం అలవాటని, దాన్ని అంత సులభంగా మార్చలేమని అభిప్రాయపడ్డారు. రూ.2,000 వరకు లావాదేవీలపై దుకాణదారులు బ్యాంకులకు ఎలాంటి చార్జీలు చెల్లించక్కర్లేదని, కానీ, పరిస్థితులను గమనిస్తే డిజిటల్‌ కంటే నగదు చెల్లింపులకే కస్టమర్లు ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలుస్తోందని చెప్పారాయన.

2023 నాటికి యూపీఐ లావాదేవీల హవా
‘‘డిజిటల్‌ చెల్లింపులు చాలా వేగంగా పెరిగిపోతున్నాయి. యూపీఐ లావాదేవీల సంఖ్య బాగా పెరుగుతోంది. 2017 మార్చిలో 3% ఉంటే 2018 మార్చిలో 20%కి యూపీఐ లావాదేవీలు పెరిగాయి. 2023 నాటికి దేశ డిజిటల్‌ లావాదేవీల్లో యూపీఐ వాటా సగానికి పెరుగుతుంది. అదే సమయానికి దేశ జీడీపీలో డిజిటల్‌ లావాదేవీల వాటా 20% ఉంటుంది’’ అని మోర్గాన్‌స్టాన్లీ తన నివేదికలో తెలిపింది.

క్రెడిట్‌ కార్డుల వాటా 4%
చెల్లింపుల విలువలో
క్రెడిట్‌ కార్డుల వాటా 51%
2017 డిసెంబర్‌ నాటికి
నగదు రూ.7.8 లక్షల కోట్లు
2018 మే 25 నాటికి నగదు రూ.18.5 లక్షల కోట్లు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top