ఆన్‌లైన్లో ఆఫర్ల దీపావళి..! | diwali offers in online shopping | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్లో ఆఫర్ల దీపావళి..!

Oct 8 2014 12:36 AM | Updated on Aug 1 2018 3:40 PM

ఆన్‌లైన్లో ఆఫర్ల దీపావళి..! - Sakshi

ఆన్‌లైన్లో ఆఫర్ల దీపావళి..!

ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్‌లు భారత ఆన్‌లైన్ రిటైల్ రంగంలో సృష్టించిన ప్రభంజనం ఇంతా అంతా కాదు. ఇంటర్నెట్‌తో టచ్ ఉన్న ప్రతి ఒక్కరు ఇ-కామర్స్ సైట్లను ఆక్టోబరు 6న క్లిక్ చేశారంటే అతిశయోక్తి కాదేమో.

భారీ డిస్కౌంట్లు, బహుమతులు
ఆఫర్లలో లక్షలాది ఉత్పత్తులు    
ఈ-కామర్స్ కంపెనీల సందడి

 
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:
ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్‌లు భారత ఆన్‌లైన్ రిటైల్ రంగంలో సృష్టించిన ప్రభంజనం ఇంతా అంతా కాదు. ఇంటర్నెట్‌తో టచ్ ఉన్న ప్రతి ఒక్కరు ఇ-కామర్స్ సైట్లను ఆక్టోబరు 6న క్లిక్ చేశారంటే అతిశయోక్తి కాదేమో. ఇదే ఊపుతో ఇ-కామర్స్ కంపెనీలు దీపావళికి రెడీ అవుతున్నాయి. ఆన్‌లైన్ బూమ్‌ను ఈ పండుగల సీజన్‌లో క్యాష్ చేసుకునే పనిలో నిమగ్నమయ్యాయి. భారీ డిస్కౌంట్లు, ఒకటి కొంటే ఒకటి ఉచితం, కచ్చిత బహుమతులు, క్యాష్‌బ్యాక్ వంటి ఆఫర్లను ప్రకటించాయి.

‘క్లిక్’మనిపించే స్థాయిలో డీల్స్‌ను నిర్వహిస్తున్నాయి. దసరాకు ముందు నుంచే ఇ-కామర్స్ కంపెనీల సందడి మొదలైంది. దీపావళి సమీపిస్తుండడంతో కంపెనీలు భారీ డిస్కౌంట్లనే ప్రకటిస్తాయని కస్టమర్లు వేచి చూస్తున్నారు. అటు కంపెనీలు సైతం కొత్త కొత్త ఉత్పత్తులను కస్టమర్ల ముందుకు తెస్తున్నాయి. కొత్త డిజైన్లు, విదేశీ ఉత్పత్తులతో వినియోగదారులను ఆకట్టుకునే పనిలో పడ్డాయి. 25 కోట్లకుపైగా ఇంటర్నెట్ కస్టమర్లున్న భారత్‌లో ఆన్‌లైన్ వ్యాపారానికి పెద్ద ఎత్తున అవకాశాలున్నాయి. ఇదే ఇప్పుడు ఇ-కామర్స్ కంపెనీలకు క్లిక్‌ల పంట పండిస్తోంది.
 
సీజన్‌లో ఎలాగైనా..
దేశవ్యాప్తంగా ఏటా జరిగే రిటైల్ అమ్మకాల్లో దసరా, దీపావళి సీజన్ వాటా ఎంతకాదన్నా 40 శాతం దాకా ఉంటుంది. ఇంతటి ప్రాముఖ్యత ఉన్నందునే ఆన్‌లైన్ కంపెనీలు పోటీపడి మరీ ఆఫర్లను గుప్పిస్తున్నాయి. కొన్ని ఉత్పత్తులు ఒక పోర్టల్‌కే పరిమితమయ్యేలా తయారీ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి కూడా. టాప్ కంపెనీలైన స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లు మార్కెటింగ్‌కు రూ.200 కోట్ల దాకా వ్యయం చేస్తున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

కస్టమర్ ఒకసారి తమ పోర్టల్‌లోకి ప్రవేశించారంటే ఎలాగైనా ఉత్పత్తులను కొనుగోలు చేసేలా వెబ్‌సైట్లను డిజైన్ చేశాయి. అందుకు తగ్గట్టుగానే ఉత్పత్తులను సిద్ధం చేస్తున్నాయి. ఆఫ్‌లైన్‌లో విక్రయాలు సాగిస్తున్న ఇతర బ్రాండ్లు సైతం ఆన్‌లైన్ పోర్టళ్లను పరిచయం చేస్తున్నాయి. భారత రిటైల్ మార్కెట్ పరిమాణం రూ.31 లక్షల కోట్లుంది. కాగా, ఆన్‌లైన్ రిటైల్ మార్కెట్ ప్రస్తుతం రూ.24,000 కోట్లుంటుందని అంచనా. 2016 నాటికి ఇది రూ.50,000 కోట్లకు చేరుతుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ జోస్యం చెబుతోంది.

ఊరిస్తున్న ఆఫర్లు..
అమెజాన్ దివాళీ బజార్ పేరుతో ఎత్నిక్ వేర్, ఎలక్ట్రానిక్స్, హోం, కిచెన్ అప్లయన్సెస్, ఎత్నిక్ జ్యువెలరీపై డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. దివాళీ ధమాకా వీక్‌ను అక్టోబర్ 10-16 మధ్య నిర్వహిస్తోంది. ఎలాంటి ఆఫర్లను కంపెనీ పేల్చబోతోందో కస్టమర్లు వేచి చూడాల్సిందే. ఇక ఫ్లిప్‌కార్ట్ వివిధ రకాల ఉత్పత్తులపై ప్రత్యేక డిస్కౌంట్ అందిస్తోంది. దివాళీ బంపర్ సేల్‌లో బై వన్ గెట్ వన్, లిమిటెడ్ పీరియడ్ ఆఫర్లను స్నాప్‌డీల్ పరిచయం చేసింది. ఇ-బే దివాళీ ఫెస్ట్‌లో భాగంగా ప్రత్యేక ఆఫర్లను సెప్టెంబరు 25 నుంచి అక్టో బర్ 23 వరకు నిర్వహిస్తోంది.

మింత్రా.కామ్ ఎంపిక చేసిన ఉత్పత్తులపై ఫ్లాట్ 50 శాతం డిస్కౌంట్, ప్రతి ఆర్డరుపై కచ్చిత క్యాష్‌బ్యాక్, ప్రతిరోజు బంగారం గెలుపొందే అవకాశాన్ని కల్పిస్తోంది. హోమ్‌షాప్18 దివాళీ స్పెషల్ ఆఫర్స్‌తో డిస్కౌంట్లను సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 23 వరకు అందిస్తోంది. షాప్‌క్లూస్ డిస్కౌంట్లతోపాటు మేక్ ఇన్ ఇండియా పేరుతో భారతీయ బ్రాండ్స్‌ను ప్రత్యేకంగా ప్రమోట్ చేస్తోంది. రెడిఫ్ షాప్, ఇన్ఫీబీమ్, జబాంగ్ తదితర కంపెనీలు డిస్కౌంట్లతో ఊదరగొడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement